పిత్రోత్సాహం

Spread the love
Like-o-Meter
[Total: 0 Average: 0]

సూచన: ఈ కథ “నవ్య” పత్రిక ఏప్రిల్, 2004 సంచికలో ప్రచురితమైంది.

రచన : జె. యు. బి. వి. ప్రసాద్ 

#####

హైదరాబాదులో న్యూసైన్సు కాలేజీలో రెండవ యేడాది బి.యస్సీలో చేరాను. ఆ రోజు కాలేజీకి మొదటిసారిగా బయలుదేరుతూ వుంటే, ‘న్యూసెన్సు కాలేజీలో చేరావటగా’ అంటూ పలకరించింది ఎదుటి వాటా వాళ్ళ అమ్మాయి శేషు.

మేం వుంటున్న లోగిట్లో ఇంటివాళ్ళతో కలిపి నాలుగు వాటాలున్నాయి. అన్నీ బ్రాహ్మణ కుటుంబాలే ఆ వాటాల్లో. బ్రాహ్మణులు కానివాళ్ళకి అద్దెకిచ్చేవారు కాదు వాటాలు.

శేషు ఇంటర్మీడియెట్ రెండవ యేడాది చదువుతోంది. ఆ అమ్మాయి వేళాకోళానికి వళ్ళు మండిపోయింది. వెంటనే ఘాటుగా జవాబిద్దామని నోరు తెరవబోయాను. ‘ఆల్ ద బెస్ట్’ అంటూ నవ్వింది. నన్ను నేను సంభాళించుకున్నాను. సిటీ వాళ్ళ హాస్యాలు ఇలా వుంటాయన్న మాట! పుట్టినప్పటినించీ కాకినాడ టౌన్‌లో పెరిగాను. ఇంక ఈ సిటీ వాతావరణానికి అలవాటు పడాలి అని నిశ్చయించుకున్నాను. ‘థాంక్స్’ చెప్పి ముందుకు సాగాను.

కాలేజీకి వెళ్ళే కొత్తలో నన్ను ఎక్కువ మంది అడిగిన ప్రశ్న, ‘మీ నాయన ఏం జేస్తడు?’ అని. నాకు వళ్ళు మండిపోయేది ఆ ప్రశ్న వింటే.

ఒక రోజు కాలేజీ ఆఫీసు గుమాస్తా అదే ప్రశ్న అడిగాడు. ‘అలా గౌరవం లేకుండా అడుగుతారేమిటీ? ‘మీ నాన్నగారూ అని అనాలి. అయినా ఆయన ఎవర్నీ ఏమీ చెయ్యరూ అని కోపంగా జవాబిచ్చాను.

‘ఈ సిటీలో మేం గిట్లనే మాట్టాడతాం’ అన్నాడు ఆ గుమాస్తా. మాట్టాడకుండా వెళ్ళిపోయాను అక్కడ నించీ.

అదేరోజు మా క్లాస్‌మేట్ యాదగిరి అడిగాడు.

‘ఏంది భాయ్! మీ నాయన ఏం జేస్తడు?’

మీద పడి కరిచినంత పని చేశాను. ‘మా నాన్నగారు నీకేమన్నా మేనమామా, అంత గౌరవం లేకుండా మాట్లాడుతున్నావు? సరిగా మర్యాదగా మాట్లాడ్డం రాదూ? బుద్ది లేదూ?’ అని తూర్పు గోదావరి జిల్లా భాషలో తిట్టాను.

‘గట్లంటవేంది భాయ్! వూర్కే పరేషాన్ అవతవెందుకు? ఈ వూళ్ళో బాస గిట్లనే వుంటది గద! నీ ఆంధ్రా బాస నాకు తెల్వదు బే!’ అన్నాడు.

అక్కడే కాస్సేపుంటే, ఏ రాయో తీసుకుని వాడి మొహం బద్దలుకొడతానని భయం వేసి, అక్కడ నించీ వెళ్ళిపోయాను.

నా అసలు బాధ వీళ్ళ భాష కాదు. వీళ్ళకు చెప్పటానికి నా దగ్గర జవాబు లేదు. అదీ నా కష్టం. ఎందుకంటే మా నాన్న నిజంగా ఏమీ చేయడు.

ఆరేళ్ళ కిందట హోటల్ వ్యాపారం దివాళా తీసినప్పటి నించీ ఏమీ చెయ్యటం లేదు సంపాదనకి. అక్కకున్న చిన్న వుద్యోగంతో కొంప నడుస్తోంది. ఆయన ఒకళ్ళ దగ్గర లొంగి పని చేయలేడుట. ఆత్మాభిమానంట. వ్యాపారం తప్పితే మరొకటి చేయలేడుట. కానీ పెట్టుబడి లేకపోవటం చేత వ్యాపారం చెయ్యలేకపోతున్నాడుట.

ఆ విషయాలు వింటే వళ్ళు మండిపోతుంది నాకు. ఏమన్నా అంటే మక్కెలు విరగకొడతాడనే భయంతో నోరు మూసుకుని వూరుకున్నాను.

ఆ రోజు కాలేజీ నించి ఇంటికి వెళ్ళేసరికి, ఇంట్లో అంతా హడావుడిగా వుంది. అమ్మా, నాన్నల మొహాలు సంతోషంతో వెలిగిపోతున్నాయి.

పక్క సందులో వుండే పార్థసారథిగారు మా నాన్నకి గీత బోధ చేస్తున్నారు.

[amazon_link asins=’B0787JFT3X,B07DYCHPD7,1599639610,9387779599′ template=’ProductGrid’ store=’aavaakin-21′ marketplace=’IN’ link_id=’e8dcdbfd-0d25-11e9-aa94-bbc66523a507′]

‘అలా చెయ్యి వెంకట్రావూ, బాగుంటుంది. కొన్నాళ్ళలో ఆ భగవంతుడి కృప వల్ల అభివృద్ధి చెందుతుంది. పడ్డవాడెప్పుడూ చెడలేదు. రేపు తిథీ, నక్షత్రం అన్నీ బాగున్నాయి. కాబట్టి నువ్వూ, నీ పిల్లాడూ పూజ చేసి మొదలుపెట్టండి కార్యక్రమం రేపు మధ్యాహ్నం. నేను కూడా వచ్చి కాసేపుంటాను మీతో. ఇంక వెళ్ళి వస్తానూ అంటూ బయటికి కదిలారు.

నాన్న ఆయన్ని వీధి వరకూ సాగనంపడానికి వెళ్ళాడు.

ఇంటినిండా ఏవేవో సామానులున్నాయి. పెద్ద, పెద్ద పొయ్యిలూ, పెద్ద బూర్లె మూకుడ్లూ, గరిటెలూ, ఇంకా చాలా సామానులున్నాయి.

‘ఏమిటమ్మా ఇదంతా? ఏం జరుగుతోంది?’ అర్థం కాక అడిగాను.

‘నాన్న రేపు తిలక్‌నగర్‌లో కొట్టు పెడుతున్నారు. పచ్చి మిరపకాయ బజ్జీలూ, బోండాలూ, పకోడీలూ చేసి అమ్ముతారు. దాంతో మనకి సంపాదన వస్తుంది కదా వేణ్ణీళ్ళకి చన్నీళ్ళు తోడుగా. కాలేజీ అయిపోయాక నువ్వు కూడా నాన్నకు సాయం చేయాలీ అమ్మ సంతోషంగా వివరించింది.

నాక్కూడా సంతోషం వేసింది నాన్న సంపాదన మొదలుపెట్టబోతున్నందుకు. నాకు చేతనైన సాయం నేనూ చెయ్యాలని నిశ్చయించుకున్నాను.

‘మరి ఇవన్నీ కొనడానికి పెట్టుబడి ఎక్కడ నించీ వచ్చింది?’ అడిగాను అనుమానంగా.

‘మీ మేనమామ పంపాడు డబ్బు అప్పుగా! ఈ వ్యాపారంలో నిలదొక్కుకోగానే నాన్న ఆ అప్పు తీర్చేస్తారూ అంది అమ్మ భరోసాగా.

మామయ్య దగ్గర నించీ మళ్ళీ అప్పు తీసుకున్నారంటే మనసు చివుక్కుమంది. ఒక యేడేళ్ళ కిందట ఆయన దగ్గర కొంత డబ్బు అప్పు తీసుకుని ఇప్పటి వరకూ ఇవ్వలేదు. మళ్ళీ అప్పు!

నా వుత్సాహం సగం చచ్చిపోయింది. అయినా నా మాట వినేవాళ్ళు ఎవరు ఇక్కడ?

ఆ మరుసటి రోజు ఆదివారం. పది దాటాక నాన్నా, పార్థసారథిగార్లతో నేను మా బజ్జీల కొట్టు ప్రారంభోత్సవానికి వెళ్ళాను. ఆ కొట్టు ఒక కల్లు కాంపౌండ్‌ని ఆనుకుని వుంది. కల్లు కాంపౌండ్ అంటే పెద్ద ప్రహరీ గోడ చుట్టురా లేదు. అదంతా పెద్ద పర్ర. అక్కడక్కడ కాస్త గడ్డి వుంది ఆ పెద్ద ఖాళీ గ్రౌండ్‌లో. ఒక మూల రెండు, మూడు పాకలున్నాయి కల్లూ, సారా అమ్మడానికి. సాయంకాలం అయ్యాక చాలా మంది మనుషులు వచ్చి, కల్లూ, సారా కొనుక్కుని, ఆ గ్రౌండ్‌లో కూర్చుని తాగుతారు. వాళ్ళు మా కొట్టు లోంచి పచ్చి మిరపకాయ బజ్జీలు కొనుక్కుంటారని మా వాళ్ళ ప్లాను.

అవాక్కయిపోయాను ఆ లొకాల్టీ చూడగానే.

మా నాన్న అద్దెకి తీసుకున్న కొట్టు ఒకటే గది వీధివేపుగా. దానికి పెద్ద షట్టరు కింద నించి పైకి తీయడానికి గోడౌను లాగా. ఆ గది ముందర కొంత ఖాళీ స్థలం పొయ్యి పెట్టుకుని బజ్జీలు వండటానికి.

మా నాన్న కుక్. నేను కాషియరూ, పాకేజి మేనూ.

ముందరగా పార్థసారధిగారి ఆధ్వర్యంలో నాన్న చిన్న పూజ చేశాడు. తరువాత పొయ్యి అంటించి, మొదటి వాయిలో వండిన బజ్జీలు పార్థసారథిగారికి పెట్టాడు చేసిన సహాయానికి కృతజ్ణ్జతగా. నాకూ పెట్టబోతే వద్దనేశాను.

చుట్టూ వున్న వాతావరణం చూస్తే నాకు చాలా దిగులేసింది. రిక్షా లాగేవాళ్ళూ, సోడాలమ్మే వాళ్ళూ, ఆకతాయిగా బీడీలు కాలుస్తూ తిరిగే పిల్లలూ, చెట్టు కింద పేకాడే శ్రామికులూ, కల్లూ, సారా కొనుక్కుని తాగేవాళ్ళూ మా కస్టమర్లు.

వాళ్ళకి మా మొహాలు చూడగానే మేం బ్రాహ్మణజాతికి చెందినవాళ్ళమని అర్థం అయిపోయింది. నాన్నని పెద్ద పంతులూ అనీ, నన్ను చిన్న పంతులూ అనీ పిలిచారు వాళ్ళు.

‘ఏయ్ చిన్న పంతులూ! నాలుగు వేడి వేడి బజ్జీలు పార్శిల్ చెయ్యి!’ అంటూ ఒకడు పకోడీ పళ్ళెంలో చెయ్యి పెట్టి ఒక పకోడీ ముక్క రుచి చూశాడు. కస్టమర్లని ఏమీ అనకూడదుట.

అందుకని, మర్యాదగా, ‘అలా పళ్ళెంలో చేతులు పెట్టకండి. మిగిలిన కస్టమర్లకి నచ్చదు. మీకు రుచికి కావాలంటే చెప్పండి. నేనే ఇస్తానూ అని అన్నాను. వాడో వెర్రి నవ్వు నవ్వాడు.

రోజులు భారంగా అలాగే గడుస్తున్నాయి.

ఆ రోజు కాలేజీకి వెళ్ళే దారిలో నా క్లాస్‌మేట్ నరసిమ్మ మర్యాదగా అడిగాడు.

‘మీ నాన్నగారేం పని చేస్తారు?’

కల్లు కాంపౌండ్ దగ్గర బజ్జీలు అమ్ముతారని చెప్పటానికి సిగ్గేసింది. అసలా విషయం ఎలాగో కాలేజీలో తెలిసి కొంత మంది యేడిపిస్తారేమోనని ఒకటే దిగులుగా, భయంగా వుంది. తాగుబోతులకి బజ్జీలు అమ్మాలంటే చాలా బాధగా వుండేది. ఏమీ జవాబు చెప్పకుండా మాట మార్చాను అప్పటికి.

నాకు ఇంకో సమస్య వచ్చింది అప్పుడు. అది నా చదువు. కాలేజీ మూడింటికి అవగానే, మూడు మైళ్ళు నడుకుంటూ ఇంటికి చేరేసరికి మూడున్నర అయ్యేది. అప్పటికే నాన్న బజ్జీల కొట్టుకు వెళ్ళిపోయేవాడు.

అమ్మ పెట్టింది ఏదో కాస్త తిని, నాలుగు కల్లా నేనూ కల్లు కాంపౌండ్ దగ్గరకి చేరేవాడిని. దగ్గర దోవని చెప్పి, ఆ గ్రౌండ్ లోంచి అడ్డంగా వెళ్ళేవాడిని. అక్కడంతా ఎప్పుడూ ఒక రకమైన కంపు కొడుతూ వెగటుగా వుండేది.

వెళ్ళేటపుడు కాలేజీ పుస్తకాలు తీసుకెళ్ళేవాడిని చదువుకోవడానికి. అవి నిజంగా హస్త భూషణాలే. మధ్య మధ్యలో దొరికే చిన్న ఇంటర్వెల్‌లో పుస్తకం తిరగేస్తే ఒక్క ముక్కా బుర్రకెక్కేది కాదు. దానికి తోడు కొన్ని బేరాలు తొందరగా తెమిలేవి కావు.

కొంతమంది బేరమాడేవాళ్ళు ‘ఎక్కువ బజ్జీలిస్తావా’ అని. ఒకడు, ‘అదేం పుస్తకం?’ అనడిగాడు నా కాలేజీ లైబ్రరీ పుస్తకం చూసి. ‘నేను బి.యస్సీ చదువుతున్నానూ అన్నాను కాస్త గొప్పగా. ఆ మాట విని నాకు కాస్త గౌరవం ఇస్తాడని ఆశపడ్డాను.

‘అలాగా! అంటే పెద్ద బడన్న మాటా అన్నాడు తల పంకిస్తూ. ఏదో కాలేజీ చదువు చదివి, పెద్ద వుద్యోగం చేసి, ఏదో అయిపోదామని కలలు కంటుంటే, ఈ ఖర్మ ఏమిటో అర్థం కాలేదు నాకు.

ఎలాగో అలాగ మా నాన్న ఆ కొట్టు మూసేస్తే బాగుణ్ణు అనే కోరిక ఎక్కువయిపోయింది. సరిగ్గా చదవకపోవడం వల్ల క్లాసు పరీక్షల్లో మార్కులు సరిగా వచ్చేవి కావు. రాత్రి పదయ్యాక గానీ కొంప చేరేవాడిని కాదు. అప్పుడు చదవాలన్న కోరిక ఏమీ వుండేది కాదు. కాస్త తినగానే నిద్ర వచ్చేది. కాస్సేపు ఏదో చదివినట్టు నటించి పడుకునేవాడిని.

మర్నాడు మళ్ళీ మామూలే. ఆదివారం కూడా శలవు లేదు. ఫ్రెండ్సుతో ఆడుకోవడానికి అస్సలు వీలుండేది కాదు.

మా కాంపౌండ్‌లో చాలా మంది పిల్లలుండే వారు. రోజూ సాయంకాలం కాంపౌండ్ ముందరున్న ఖాళీ స్థలంలో క్రికెట్ ఆడేవారు. నాకు ఆట రాకపోయినా వాళ్ళతో సరదాగా ఆడేవాడిని వచ్చిన కొత్తలో. ఆడుతున్నంతసేపూ, ఏమీ గుర్తు రాక, చాలా సంతోషంగా వుండేది. వుత్త పుణ్యానికి నవ్వు వచ్చేది ఆడుతుంటే. వూరికే ఒకరి నొకరు వేళాకోళాలు చేసుకునే వాళ్ళం. శరీరానికి శ్రమ కలిగి, మనసు కూడా ఫ్రెష్‌గా వుండేది.

బజ్జీల కొట్టు తెరిచాక ఆట మొహమే చూడ్డానికి వీలవలేదు. అందరూ గ్రౌండ్‌లో చేరి క్రికెట్‌కి సంసిద్ధం అవుతూ వుంటే, నేను బజ్జీలమ్మడానికి కల్లు కాంపౌండు దగ్గరకి బయలుదేరాలి. ఒక్కోసారి కళ్ళళ్ళో నీళ్ళు గిర్రున తిరిగేవి వాళ్ళు నా వేపు సానుభూతిగా చూసినప్పుడు.

ఆ బజ్జీల కొట్టుకు మనసులో శాపనార్థాలు పెట్టుకున్నాను. ఈ కష్టాలే కాకుండా, ఒక రోజు చెప్పీ పెట్టకుండా వచ్చింది ఇంకో పెద్ద కష్టం.

‘మనం ఇక్కడే కూర్చుని అమ్ముదామంటే బేరాలు సరిగా రావటం లేదు. నేను పొయ్యీ, పార్శిలింగూ చూసుకుంటాను. నువ్వు ఆ గ్రౌండ్‌లోకెళ్ళి కస్టమర్ల దగ్గర ఆర్డర్లు పట్టుకుని రా’ అన్నాడు నాన్న ఒకరోజు.

కొంతమంది పిల్లలు బుట్టల్లో తిండి పదార్థాలు పెట్టుకుని, ఆ గ్రౌండులో కూర్చుని తాగుతున్న వాళ్ళ దగ్గరకి వెళ్ళి అమ్మేవారు ఆ పదార్థాలు. తాగుతున్నవాళ్ళు లేచి మా కొట్టు దగ్గరకి రావడానికి బద్దకమూ, విసుగూ వేసి, ఆ బుట్టల్లోవే కొనుక్కునే వారు. కొంతమంది మాత్రం ముందరే మా దగ్గర బజ్జీలు కొనుక్కుని, అప్పుడు గ్రౌండ్‌లోకెళ్ళేవారు తాగడానికి.

నాకు అన్నింటి కన్నా ఆశ్చర్యం కలిగించిన విషయం ఆడవాళ్ళు కూడా వచ్చి గ్రౌండ్లో కూర్చుని తాగడం. వాళ్ళని ఏ సినిమా థియేటర్ దగరో చూస్తే, ఇలా ఇక్కడకి వచ్చి, కూర్చుని తాగుతారని ఎవరన్నా చెప్తే నమ్మేవాడిని కాదు. ఎక్కువ మంది ఆడవాళ్ళు మగవాళ్ళతో కలిసి వచ్చేవాళ్ళు. రాత్రి పదింటికి ఆ గ్రౌండ్‌లోంచి ఇంటిదారి పడితే, విపరీత మైన కంపు కొడుతూ వుండేది కల్లూ, సారా, మాంసాల వాసనలతో.

మా నాన్న చెప్పింది వినగానే అవాక్కయిపోయాను. అసలు నమ్మలేకపోయాను ఆయన అలా అన్నాడని. కాలేజీలో బి.యస్సీ చదివే కొడుకుని, తాగుబోతుల దగ్గరకి వెళ్ళి బజ్జీలు అమ్మమన్నాడా ఈయన అని ఆశ్చర్యం, బాధా వేశాయి.

‘నాకిష్టం లేదు నాన్నా వాళ్ళ దగ్గరకెళ్ళి అమ్మడం. వాళ్ళే ఇక్కడ కొచ్చి కొనుక్కుంటారులే!’ అన్నాను అయిష్టంగా. అంతే నాన్నకి కోపం వచ్చేసింది.

‘నీ బోడి బి.యస్సీ చదువుకి ఫోజులు కొడుతున్నావా? మనవసరం కొద్దీ మనం పని చేసుకోవాలి. ఒకళ్ళ సొమ్మేం దోచుకోవడం లేదు. మన కష్టం మనం పడుతున్నాం. ఎంత చదువుకుంటే ఏం ప్రయోజనం? పొగరుమోతుతనం తప్ప తెలివితేటలుంటేగా! నోరు మూసుకుని చెప్పిన మాట వినూ గట్టిగా తిట్టాడు.

నోరెత్తకుండా భయంతో తిట్లన్నీ తిన్నాను. ఏం చేయడానికీ పాలుపోక అలాగే కాసేపు కూర్చున్నాను. అప్పుడు లేచి, నా మనసులో రేగుతున్న దుఃఖాన్ని అదిమి పెట్టుకుంటూ, ఆ తాగుబోతుల దగ్గరకెళ్ళాను.

‘వేడి వేడి పచ్చి మిరపకాయ బజ్జీలున్నాయి తీసుకురానాండీ నంచుకోవడానికి?’ అని మొదటిసారి గద్గదస్వరంతో అడిగితే ఆ కస్టమరుకి అర్థం కాలేదు నేనేమన్నానో. గొంతు సవరించుకుని మళ్ళీ చెప్పాను. అప్పుడు ఇచ్చాడు ఆర్డరు.వాళ్ళ దగ్గరకు వెళ్ళి పని చేస్తుంటే ఎక్కువ కంపు కొట్టేది.

నాన్న చెప్పింది నిజమే! ఆ తాగుబోతుల దగ్గరకెళ్ళి అమ్మితే ఎక్కువ బజ్జీలు అమ్ముడయ్యాయి. అయితే చాలా సార్లు అటూ ఇటూ తిరగాల్సి వచ్చేది నాకు.

మొదట ఆర్డరు తీసుకునేవాడిని. తరువాత డెలివరీ చేసేవాడిని. ఆ తరువాత రిపీటెడ్ ఆర్డర్స్. ఇంకో రెండుసార్లు తిరగాల్సి వచ్చేది.

చివరగా డబ్బులు కలెక్టు చేసుకునేటప్పుడు వచ్చేది అసలు కష్టం. ఓ పట్టాన ఇచ్చేవారు కాదు.

‘ఏంటీ తొందర? మల్లా ఆర్డరిత్తామేమో! పోయి మల్లారా!’ అనేవాళ్ళు.

ఫిజిక్స్ లాబ్‌లో రీడింగులు కూడా అంత కష్టపడి గుర్తుంచుకునేవాడిని కాదు!

మొదట్లో గుర్తుండక, కాగితమూ, పెన్సిలూ జేబులో పెట్టుకుని పని చేసేవాడిని. కొన్నాళ్ళకి కాగితం అవసరం లేని చాకచక్యం వచ్చేసింది.

ప్రతీ రోజూ గండమే!

ఎక్కడ ఈ విషయం కాలేజీలో తెలిసిపోతుందో అనే భయం ఒక పక్క!

రోజు రోజుకీ సహనం చచ్చి పోసాగింది. ఏమీ చెయ్యలేని నిస్సహాయ పరిస్థితి.

ఆ రోజు మామూలుగానే ఆర్డర్ బుకింగ్‌లూ, డెలివరీలూ, కలెక్షన్లూ చేస్తున్నాను మనసులో యేడ్చుకుంటూ. రాత్రి పదవబోతోంది. ఆఖరి కలెక్షన్ చేసేస్తే, ఇంక నాన్న ఇంటికి పొమ్మంటాడు. జీవితంలో ఇంకో రోజు అయిపోతుంది మరొక్కరోజు మొదలవ్వడానికి!

‘ఏమండీ! డబ్బులివ్వండీ వెళ్ళిపోతానూ అన్నాను మూడోసారి, ‘పదహారేళ్ళ వయసూ సినిమాలో చంద్రమోహన్ లెవెల్లో వెర్రిమొహం వేసుకుని ఈ ఆఖరి ఇద్దరు కస్టమర్లలో ఒకరు ఆడా, ఒకరు మొగా. చాలా సేపటి నించీ తాగుతున్నారు. బాగానే బజ్జీలు తిన్నారు కూడా. ఆ ఆడావిడ వుండుండి ఆ మగమనిషి మీదకి ఒరిగి ఏదో అంటుంది. ఆ మగమనిషి ఏదో పెద్ద జోకయినట్టు వెకిలిగా నవ్వుతాడు.

నాకు భరించశక్యంగా లేవు వాళ్ళ వేషాలు.

‘వుండబ్బా పంతులూ! ఇత్తాం లే!’ అందావిడ ఓరగా నావేపు చూస్తూ.

నేనేమీ మాట్లాడలేదు. నేనింకా అక్కడే వుండగానే వాళ్ళిద్దరూ నెమ్మదిగా సరసాలు మొదలుపెట్టారు. అది చూడగానే నాకు భయం మొదలయింది.

‘మా నాన్నగార్ని పంపిస్తాను లెండి డబ్బుల కోసం. నేను వెళ్తున్నానూ అని ముందుకు కదిలాను. ‘వుండు పంతులూ! ఏం తొందరా అంటూ ఆ ఆడమనిషి నా చెయ్యి పట్టుకుని ఒక్క గుంజు గుంజింది.

అలా జరుగుతుందని అనుకోక పోవడం వల్ల, ఏమరుపాటుగా వున్న నేను, బాలన్స్ తప్పి, తూలి ఆవిడ మీద పడ్డాను. వెంటనే జరిగింది అర్థం అయి లేచి నించున్నాను. వాళ్ళిద్దరూ ఒకటే నవ్వసాగారు. బాగా తాగి వళ్ళు తెలియకుండా వున్నారు. అవమానంతో వళ్ళూ, మనసూ రెండూ దహించుకుపోయాయి. కళ్ళలోంచి నీళ్ళు కారిపోయాయి ఆగకుండా.

ఏమనుకున్నాడో ఆ మొగమనిషి నా చేతిలో డబ్బు పెట్టాడు. పరుగులాంటి నడకతో కొట్టు దగ్గరకొచ్చాను.

‘ఆలస్యం అయిందేంరా? ఇంటికెళ్ళవూ?’ అన్నాడు నాన్న.

నేనేమీ మాట్లాడలేదు. నా తడి కళ్ళు ఆయనకి కనబడకుండా బుర్ర తిప్పుకుని, సామానులు సర్దుకున్నాను.

ఇంటికి వెళ్ళేసరికి అక్క ఏదో పుస్తకం చదువుతూ కనబడింది. ‘ఎలా వుందిరా చదువు?’ అడిగింది మామూలుగా. ‘ఎలా వుంటుంది? నా మొహంలా వుందీ అన్నాను మండిపడుతూ. అక్క తెల్లబోయింది.

‘ఏమయింది నీకు? అలా తిక్కగా మాట్లాడుతున్నావేమిటీ?’ అంది అక్క కోపంగా. అమ్మ కూడా అయిష్టంగా చూసింది. అంతే! నాకు తెగింపు వచ్చేసింది.

‘కాలేజీ అయినప్పటి నించీ నాచేత కల్లు కాంపౌండ్ దగ్గర తాగుబోతులకి బజ్జీలమ్మిస్తూ వుంటే నాకేం చదువొస్తుందీ? అసలు చదువుకోవాలనే ఇంట్రస్టే చచ్చిపోతోంది. నేనక్కడ బండ చాకిరీ చేస్తూ వుంటే, మీరిక్కడ హాయిగా ఇంట్లో కూర్చున్నారు. ఎప్పుడో విసుగు పుట్టి కొంపలోంచి పారిపోతాను. శని వదిలిపోతుంది అందరికీ!’ గట్టిగా అరిచాను.

అమ్మా, అక్కా నోట మాట రాకుండా అయిపోయారు. నాకు అన్నం ఏమీ తినబుద్దికాలేదు. మాట్టాడకుండా నా పక్క వేసుకుని, దుప్పటి ముసుగెట్టాను.

నిండా మునిగినవాడికి చలేమిటీ! ఆ రోజు చదువుతున్నట్టు నటించక్కరలేదని లోపల్లోపల సంతోషం కూడా కలిగింది. ఒక అరగంట పోయాక నాన్న ఇంటికి వచ్చాడు.

ఆయన భోజనం చెయ్యగానే అక్క అంది. ‘నాన్నగారండీ! రేపటి నించీ వాడిని కొట్టుకు తీసుకెళ్ళకండీ! వాడేమీ చదవటం లేదు సరిగా’

ఇంక నాన్నకి నపాళానికంటుకుంది కోపం.

‘వీడూ, వీడి బోడి బీ.యస్సీ చదువూ! ఏం చూసుకుని మిడిసిపడుతున్నాడు వీడు? ఏం బాగుపడతాడు వీడింక? నాశనం అయిపోతాడు. ముష్టెత్తుక్కుని బతకాల్సి వస్తుంది వీడికి. వీడి బోడి చదువుకి వీడికాపని చేయడం నామోషీ. వీడింకేం ఎమ్మెస్సీ చదువుతాడు? వెధవ బతుకు బతుకుతాడు! నాశనం అయిపోతాడు. అక్కడకీ అంత పనీ నేనే చేసుకుంటున్నాను. ఆ కాస్త పనీ చెయ్యడానికి వీడికింత పొగరా? సర్వ నాశనం అయిపోతాడు. ఏమనుకుంటున్నాడో! బాగుపడే మనుషులు ఇలా ప్రవర్తించరు. ఎంత కాలేజీ చదువు చదివితే యేమిటి? బుద్దీ, జ్ణ్జానం లేకపోయినాక. చావమను వెధవని. రేపటి నించీ మొత్తం పని నేనే చూసుకుంటాను. ఆ వెధవని కొట్టుకి రావద్దని చెప్పండి! ముష్టి వెధవ, ముష్టి వెధవానీ!’ అంటూ తిట్టాడు.

దుప్పటి ముసుగు కదిలించలేదు. ‘వంద తిట్లు తిడితే తిట్టావూ, ఓ బొబ్బట్టు ముక్క పెట్టూ’ అందిట ఒకావిడ. తిడితే తిట్టాడు గానీ, ఇంక కొట్టుకు రావద్దన్నందుకు సంతోషం పట్టలేకపోయాను.

నా పాత శాపనార్థాలు ఏం ఫలించాయో తెలియదు గానీ, ఇంకో నెల రోజులకి నాన్న ఆ కొట్టు మూసేశాడు. మళ్ళీ సంపాదనేమీ లేకుండా ఇంట్లోనే వుండటం మొదలుపెట్టాడు.

అక్క సంపాదన మాకే సరిపోకుండా వుంటే, అమ్మమ్మ కూడా వచ్చింది మా దగ్గర వుండటానికి. అలాగే గడుస్తున్నాయి రోజులు.

ఆరోజు మలక్‌పేట లైబ్రరీలో వ్యాసరచన పోటీలున్నాయి. కాలేజీ నోటీసు బోర్డులో ఆ పోటీ ప్రకటన పెట్టారు. నాకు వ్యాసరచన అంటే చాలా ఇష్టం.

నల్లకుంట నించీ మలక్‌పేట వెళ్ళాలంటే, బస్సులోనైనా వెళ్ళాలి, లేదా లోకల్ రైల్లోనన్నా వెళ్ళాలి.

రెంటికీ టికెట్ కొనడానికి డబ్బుల్లేవు. విద్యానగర్ స్టేషను ఇంటికి పక్కనే. అక్కడ నించీ పట్టాలు పట్టుకుపోతే ముందర కాచిగూడా స్టేషనూ, తరువాత మలక్‌పేట స్టేషనూ. చక్కగా పట్టాల వెంబడి, ముక్కు తరుచు మూసుకుంటూ, నడుచుకుంటూ మలక్‌పేట లైబ్రరీకి వెళ్ళాను.

తీరా చూస్తే వ్యాసరచన పోటీలు పోస్ట్‌పోన్ చేస్తున్నట్టు బోర్డు పెట్టారు.

ఈసురోమంటూ తిరుగుముఖం పట్టాను.

మలక్‌పేట స్టేషనుకీ, కాచిగూడా స్టేషనుకీ మధ్య ఒక బ్రిడ్జి వుంది. ఆ బ్రిడ్జికి ఒక తాడి చెట్టు దూరం కింద ఒక పెద్ద మురుగు కాలవ ప్రవహిస్తూ మూసీ నదిలో కలుస్తుంది. ఆ బ్రిడ్జి మీద రెండు జతల రైలు పట్టాలు ఎడం, ఎడంగా మధ్యలో పెద్ద గాప్‌తో వున్నాయి. ఆ గాప్‌కి మధ్య పెద్ద స్థంభాలు రైలు పట్టాల లెవెల్ కన్నా ఒక అడుగు తక్కువ లెవెల్లో వున్నాయి. ఏ పట్టాల మీద ఏ రైలు ఎప్పుడు వస్తుందో తెలియదు. వచ్చేటపుడు ఆ సంగతే పట్టకుండా మామూలుగా వచ్చేశాను.

ఇంటికి వెళ్ళేటపుడు బ్రిడ్జి మధ్యలో వుండగా మలక్‌పేట స్టేషన్ నించీ ఒక లోకల్ రైలు ఆ మీటరు గేజ్ మీద బయలుదేరింది. అది నన్ను సమీపిస్తోంది. వెనక్కి మలక్‌పేట స్టేషనుకి వెళ్ళలేను. రైలు కన్నా ముందర స్పీడుగా పరిగెత్తి కాచిగూడా స్టేషనుకీ చేరలేను. అవతల పట్టాల మీదకి వెళ్దామంటే, అవి చాల ఎడంగా వున్నాయి. గెంతలేను అంత దూరం. ఇంక చావు తధ్యమేమో అనిపించింది.

చావు తెలివితేటలంటారే, అలాంటివి కలిగాయి సడన్‌గా. కొన్ని గజాలు ఆ పట్టాల మీద పరిగెత్తి, అక్కడ నించి ఎడంగా వున్న ఒక స్థంభం మీదకి గెంతి, నిలదొక్కుకున్నాను. అప్పటికి ఆ రైలు దగ్గరకొచ్చేసింది. అది నెమ్మదిగా వెళ్ళే లోకల్ రైలు కాదు. ఏదో ఫలక్‌నామా ఎక్స్‌ప్రెస్సో, మరోటో. ఆ స్థంభం మీద ముడుచుకుని కూర్చుని, బుర్ర మోకాళ్ళ మధ్యలో పెట్టుకుని, చెవులు గట్టిగా మూసుకున్నాను. ఆ ఎక్స్‌ప్రెస్ రైలు రెండు, మూడడుగుల దూరం లోంచీ చప్పుడు చేసుకుంటూ వెళ్ళిపోయింది వేగంగా. ఆ గాలి వేగానికి ఒళ్ళంతా కదిలిపోయింది. అక్కడ నించీ జారి కింద కాలవలో పడిపోతానేమోనని దడ పుట్టింది.

రైలు వెళ్ళిన కాస్సేపటి వరకూ దడ తగ్గలేదు. ఆ స్థంభం మీద నించీ మళ్ళీ పట్టాల మీదకి గెంతి, అక్కడ నించీ కాచిగూడా స్టేషను వరకూ ఆగకుండా ఒకటే పరుగు!

ఆ భయంకరమైన అనుభవాన్ని తలుచుకుంటూ, నా మీద నేనే జాలి పడుతూ ఇల్లు చేరాను.ఇంట్లో వాతావరణం అర్థం అయిపోయింది.

ఇంట్లో వంట చేసిన దాఖలాలు కనిపించలేదు.

అంటే ఆ పూటకి పస్తుండాలన్న మాట.

ఈ మధ్య కాలంలో ఇలాంటివి అలవాటయిపోయాయి. చేతికందిన ఆర్గానిక్ కెమిస్ట్రీ పుస్తకం తీసుకుని, పెరట్లో ఒక చెట్టు కిందకి చేరాను.

కాసేపటికి అమ్మమ్మ అక్కడికి వచ్చింది. ఆవిడకి బ్రహ్మ చెముడు. అన్నీ సైగలతో చెప్పాలి ఆవిడకి. పాపం అంత పెద్దావిడ కూడా మాతో పాటు పస్తుంది.

‘అవునూ, నాకు తెలియక అడుగుతానూ? మొగాడన్నాక బయటకి వెళ్ళి ఏదో పని చేసి సంపాదించాలి. పెళ్ళాం, పిల్లలని పోషించాలి. ఏం పనీ చేయకుండా ఇంట్లో కూర్చుంటే పిల్లలకి తిండెలా వస్తుందో? ముష్టివాడు కూడా ముష్టెత్తి పిల్లలని పోషించడానికి చూస్తాడు. అంత కన్న కనాకష్టం అయితే ఎట్లా?’ అంటూ తన బాధని వెళ్ళబోసుకుంది.

‘అదంతా మా ఖర్మ!’ అంటూ నా నుదురు కొట్టుకుని సైగ చేశాను.

ఆకలితో విసుగ్గా వుండి, రైలు సంఘటన చాలా చికాకు కలిగించింది.

అదే సమయానికి, ఆ చెట్టుకు కొంచెం దూరంగా వున్న టాయ్‌లెట్ లోంచీ నాన్న బయటకి వచ్చి ఇంట్లోకి వెళ్ళాడు. ఆయన్ని అమ్మమ్మ చూడలేదు చెట్టుకింద పడ్డ ఆకులేరుతూ. నేను చూసి గతుక్కుమన్నాను.

ఇవాళ పొద్దున్నే లేచి ఎవరి ముఖం చూశానో అని ఆలోచించాను.

ఇంక ఇంట్లోకి వెళితే మళ్ళీ నాన్న తిడతాడేమో! తిడితే తిట్టాడులే, మాట్లాడకపోతే సరి. దులిపేసుకోవడమే! మరి కొడతాడేమో? కొడితే వదిలించుకుని పారిపోవడమే! నా అంత స్పీడుగా పరిగెత్తలేడుగా. అయినా పారిపోతుంటే, రోడ్డు మీద వెంటబడి కొట్టడానికి పరిగెత్తుతాడా!?

నా ఆలోచనలకి నాకే నవ్వు వచ్చింది.

అలా భయపడ్డట్టుగా నాకే ఆపదా ముంచుకు రాలేదు. ఆ మర్నాడే నాన్న ఒక వంటలు చేసేవాళ్ళ ట్రూపులో చేరాడు సంపాదించడానికి. అంతే కాకుండా బ్రాహ్మణార్థాలు కూడా చేసి తన కుటుంబాన్ని చేతనయినట్టుగా పోషించడం మొదలుపెట్టాడు. అది నాకెంతో సంతోషంగా అనిపించింది.

అప్పటినించీ ‘మీ నాయన ఏం జేస్తడు?’ అని అడిగిన వాళ్ళందరికీ, ‘మా నాన్న వంటలు చేస్తాడు. బ్రాహ్మణార్థాలు కూడా చేస్తాడూ అని గొప్పగా చెప్పటం మొదలుపెట్టాను. అప్పటినించీ జీవితంలో మళ్ళీ పస్తనేది తెలియలేదు.

‘పిత్రోత్సాహం’ తండ్రి జన్మ నిచ్చినందుకే కాదు…..

 

Your views are valuable to us!