మనసు కోతిలాంటిదని బుచ్చిబాబు ప్రగాఢ నమ్మకం.
ఏది ఆకర్షణీయంగా కనబడితే అటుకేసి పరుగెడుతుంది – అంటాడతను. అలాగని బుచ్చిబాబు ఏ విషయం మీదా వెంటనే ఓ నిర్ధారణకు రాడు, ఎన్నో పరిశోధనలు, అనుభవాల తరువాత తప్ప.
* * * * * * *
“ఒరేయ్ బుచ్చీ”
అమ్మ పెట్టిన జంతికలు పక్కింటి చిట్టి కోసం లాగూలో దాచిపెట్టుకుని వెళుతూన్న ఏడేళ్ళ బుచ్చిబాబు వెనక్కి తిరిగాడు,
“ఛఛ – ఈ బాబాయికి బొత్తిగా మర్యాద తెలీదు” అని విసుక్కుంటూ బుచ్చి గదిలోకి రాగానే బాబాయి గది తలుపులు మూసేసాడు.
బుచ్చిని ముద్దు చేస్తూ “ఇహిహి…ఇహీ” అని నవ్వేడు. “మా బంగారు కొండ కదూ. మా బుజ్జి కన్న కదూ..” అని కూడా అన్నాడు.
ఏదో కుట్ర జరుగుతూందని బుచ్చి గ్రహించేసాడు. “మరీ నస పెట్టకుండా చెప్పు నాకసలే టైం లేదు” కోపంగా అన్నాడు. “మరేమో…నీకు ఎదురింటి సీత తెలుసుకదమ్మా” అడిగేడు బాబాయి. “తెలిస్తే..”
“అంటే…అదీ….నేనిప్పుడు నీకో లెటరిస్తానన్న మాట. మరీ…నువ్వేమో అది నేరుగా తీసికెళ్ళి సీత కిస్తావన్న మాట. ఇంకానేమో…ఆవుత్తరం సంగతి మరెవ్వరెకీ చెప్పవన్న మాట” మరీ అంత అమాయకుడేం కాదు బుచ్చి. ఆ మాటకొస్తే బాబాయి కంటే తెలివయినవాడు. పని సక్రమంగా చేసింతరవాత ముట్టే లంచం కథా కమామీషు ముందే మాట్లాడుకుని, మాట తప్పకుండ ఒట్టేయించుకుని, ఉత్తరం నిక్కర్లో దాచుకుని వీధిలోకి పరుగెట్టాడు.
సీత ఇంట్లోనే ఉంది. వాళ్ళ నాన్న లేడని కూడా బుచ్చికి తెలిసిపోయింది. ఏదో వారపత్రికలో శృంగారానికి సంబంధించిన కధ చదువుతూంది గామోసు! మంచమ్మీద బోర్లా పడుకుని కాళ్ళాడిస్తూంది. బుచ్చి రావడం చూసి “దామ్మా-దా” అంది లేస్తూ.
దేశాల మధ్య ఆర్థిక, సామాజిక సంబంధాల గురించి చర్చించే నాయకుడిలా కుర్చీలో కాలు మీద కాలేసుకుని కూర్చున్నాడు బుచ్చిబాబు.
“నీతో ఓ పనుంది” సీరియస్ గా అన్నాడు.
“నాతోనా?” హాశ్చర్యంగా చూసి ఫక్కున నవ్వింది సీత. దానిమ్మగింజల్లాంటి పలువరుస తళుక్కుమంది.
జేబులోంచి లెటర్ తీసి, సీత చేతికిచ్చాడు. అందులో ఇలా ఉంది.
“డియర్ సీతా,
ఐ లవ్ యూ. నిన్ను కలవాలనుకున్నప్పుడల్లా మీ ఫాదరాసురుడు లంక ముందు లంకిణిలా, మీ ఇంటి అరుగు మీద కూర్చుని వుంటే, గుండె గాభరా పడ్తుంది. అయినా ప్రేమ వీటన్నిటినీ లెక్క చేయకూడదని మా మేష్టారు “లైలా-మజ్నూ” పాఠం చెప్తూ అన్నారు. ఈ లెటర్ చదివిన వెంటనే చించెయ్. మళ్ళీ లెటర్ రాస్తాను. ప్రేమతో నీ—“
కింద సంతకం లేదు.
సీతకీసారి నిజంగానే హాశ్చర్యం వేసింది.
JOIN ANVESHI MEMBERSHIP – WATCH EXCLUSIVE VIDEOS
బుచ్చిని గారాబం చేస్తూ, “ఎవరు రాసారమ్మా?” అంది. ఆ వంగడంలో సీత వేసుకున్న రెండు జడలూ ముందుకు పడ్డాయి. బుచ్చి కళ్ళకు ఆ జడలు రెండూ ఉయ్యాలకు రెండు పక్కలా వుండే తాళ్ళలా కనిపించేయి. అప్పుడాలోచించాడు.
“ఇంత అందమైన సీతని బాబాయి పెళ్ళి చేసుకుంటాడా? ఛ – వీల్లేదు. హాయిగా నేనే చేసేసుకుంటాను. ఆ పక్కింటి చిట్టి కంటే సీత యెంతో బావుంది. ఎంచక్కా ఎత్తుకుని తిప్పుతుంది. ఎప్పుడూ శుభ్రంగా వుంటుంది. చిట్టిలా కాదు – ఎప్పుడూ కారుతోన్న ముక్కుతో. మధ్యమధ్యలో పావడాతో తుడుచుకుంటూ…ఛీ ఛీ!”
ఇంతలో సీత మళ్ళీ లాలనగా అడిగింది. “ఎవరు రాసారు బుచ్చీ?”అని.
“నేనే” చెప్పాడు బుచ్చి. ఆ షాక్ లోంచి సీత తేరుకునేలోపు బుగ్గ మీద చిటికేసి వీధిలోకి పరుగెత్తుకెళ్ళాడు. అది ప్రధమ ప్రేమ ప్రహసనం..బుచ్చి జీవితంలో.
* * * * * * * * * *
మేష్టార్లింకా రాలేదు. దాంతో ట్యూషనంతా గోలగోలగా వుంది. అమ్మాయిలు ప్రపంచమంతా వాళ్ళదేనన్నట్టూ క్లాసురూములోనే అల్లరి చేస్తూ పరుగెడుతున్నారు. అంత గొడవలోనూ బుచ్చిబాబు ఏకాగ్రతతో చదువుకుంటున్నాడు. నూనూగు మీసాల వయసు అతనిది. క్లాసులో ఆ సమయానికి మరో మగపురుగు లేదు.
చదువుతూన్న బుచ్చిబాబు మధ్యలో యధాలాపంగా కళ్ళెత్తి చూసేడు. క్లాసురూమంతా రంగురంగుల సీతాకోకచిలుకలతో నిండిన తోటలా అనిపించింది. అమ్మాయిలంతా తన తపస్సుని భంగం చేయడానికి దేవేంద్రుడు పంపిన అప్సరసల్లా కనిపించేరు.
అదే సమయానికి క్లాసురూము బ్యూటీ అంజలి బుచ్చిబాబు వైపు చూసింది. ఇద్దరి కళ్ళూ కలుసుకున్నాయి. అంజలి కళ్ళలో ఆరాధన కొట్టొచ్చినట్టూ కనిపించింది బుచ్చికి. చిన్నగా నవ్వేడు. బదులుగా అంజలి కూడా నవ్వింది. బుచ్చికి నిశ్చయంగా తెలిసిపోయింది అంజలి తనని ప్రేమిస్తోందని.
అంతలో “కెవ్వ్…” మన్న అరుపు వినిపించింది. అదిరిపడి ఈలోకంలోకి వచ్చాడు. ఆ అరుపుకి మరి కొన్ని తోడయ్యాయి. అమ్మాయిలందరూ బుచ్చి ముందు నిలబడి -“పా…బుచ్చీ…కెవ్వ్…ము…లేయ్” అని అరవసాగారు. ఆ గోలలో బుచ్చికేమీ అర్థంకాలేదు.
“హూ(…ఏవిటో ఈ ఆడపిల్లలు – ఏ విషయమూ స్పష్టంగా చెప్పి చావరు” మనసులోనే విసుక్కున్నాడు.
వెనకాతలే ఎవరో రహస్యంగా పిలుస్తున్నట్టూ “…స్స్” మన్న శబ్దం వినిపించడంతో తిరిగి చూశాడు. అరడుగు దూరంలో ఆరడుగుల పొడవున్న పామును చూడ్డాంతో షాక్ తిన్నాడు. ఆ షాక్ లోనే నిమ్మకు నీరెత్తినట్టూ కూర్చుండిపోయాడు.
పాపం! బుచ్చి కళ్ళలో కనిపించిన భానికే దయతల్చిందో, ఆరోజు వ్రతంలో వుందో తెలీదు గానీ, తలదించుకుని గోడవారగా వెళ్ళిపోయిందా పాము.
వెంటనే ఆ షాక్ నుండి తేరుకుని ఉపన్యాసం దంచసాగేడు బుచ్చి. “ఛ, నేను ఒడుపుగా పట్టుకునే లోపు అది తప్పించుకుంది. దొరికుంటేనా? చంపేసుండేవాణ్ణి. అసలు మా తాతగారైతే పాము మంత్రంలాంటివి బాగా నేర్చుకున్నార్ట. అవకాశం రాలేదుగానీ సర్పయాగం కూడా చేసేంత…”
బుచ్చిబాబు వంశవీరుల గాధల్ని కళ్ళు పెద్దవి చేసుకుని వినసాగేరు అందరు.
మేష్టార్లు వచ్చాక అంజలి గోరంతని కొండంత చేసి (ఉన్నదున్నట్టూ?) వర్ణించింది. అంజలి మెచ్చుకోవడం విని, బుచ్చిబాబు పరమవీర చక్రా సాధించినవాడిలా పొంగిపోయాడు.
అప్పుడిక అనుమానానికి ఆస్కారమే లేకుండాపోయింది-“నూటికి రెండొందల పాళ్ళూ అంజలి తనతో పీకల్దాకా ప్రేమలో కూరుకుపోయింది.”
వారంరోజుల్లో ఫ్రెండ్సునందరినీ అడిగి, నవలల్నించి, సినిమాల్నించీ కాపీకొట్టి కొండవీటి చేంతాడంత ఉత్తరం తయారు చేశాడు బుచ్చిబాబు. ఓరోజు సాయంత్రం ట్యూషన్ లో అంజలితో చెప్పేడు. “నీతో పెర్సనల్ గా మాట్లాడాలి. ట్యూషన్ ఐపోయాక కాస్త వెయిట్ చెయ్” అని ట్యూషనయ్యాక వీధి మొదట్లో కలుసుకున్నాడు.
అక్కడ అంజలి మాత్రమే కాక మరో స్నేహితురాలు కూడా ఉంది. బాడీగార్డును చూడగానే నీరుకారిపోయాడు.
అంతలోనే అనుకున్నాడు “ఈరోజు కాకపోయినా రేపైనా తెలియకపోదు ప్రపంచానికి. పోనీలే!” అని. ఆ అమ్మాయి ముందే అంజలికి లవ్ లెటర్ అందించాడు. అరగంటసేపు ఆ లెటర్ చదివి బుచ్చి కళ్ళముందే దాన్ని చించి పడేసింది అంజలి.
బుచ్చికి ఆపక్కనే నిలబడ్డ స్నేహితురాలు అందంగా కనిపించసాగింది. అతని జ్ఞానానికి అందని విషయమేమిటంటే అంజలి ఆపాటికే ఓ కుర్రమేష్టారితో తలమునకలయ్యేంత ప్రేమలో ఉందనీ, భారతీయుల్లో ఆయన మినహా, మిగతా అందరూ తన సహోదరులని ప్రతిజ్ఞ చేసిదనీనూ (ఈ గొడవంతా ఆ మేష్టారుకి తెలీదు. అది వేరేసంగతి).
* * * * * * * *
అన్వేషి ఛానెల్ – మరుగున పడిన చరిత్రను వెలికి తెచ్చే డాక్యుమెంటరీలు
“బుచ్చిబాబూ!నిన్ను నేను ఓ ఫ్రెండ్ గా భావించానే తప్ప ఎప్పుడూ ‘ఆ’ భావంతో చూడలేదు. ఓ ఆడదాని జీవితంలో ఇద్దరు మగాళ్ళకి స్థానంలేదు. ఒకే ఒరలో రెండు కత్తులు ఇమడవు. గుడ్ నైట్” అని చెప్పి స్నేహితురాలితో కలిసి వెళ్లిపోయింది.
బుచ్చికి అంజలి మాటల్లో ఒక్క ముక్కా అర్థం కాలేదు. అంజలి వెళ్లిపోయాక కిందపడ్డ ఉత్తరం ముక్కల్ని ఏరుకుంటూ అనుకున్నాడు “దుర్మార్గురాలు! మరీ చించి పడేయాలా? ఇష్టం లేకపోతే ఆ మాట చెప్పేడవచ్చుగా. ఉత్తరం తిరిగిచ్చేసుంటే నేనింకో అమ్మాయికి ఇచ్చుకునే వాణ్ణిగా”అని.
* * * * * * * * * *
ఆ సాయంత్రం బుచ్చి చాలా హుషారుగా ఉన్నాడు.
డిగ్రీ ఐపోవస్తూంటే కాస్త బాధా వున్నా వార్షికోత్సవం ఆరోజే కాబట్టి సంతోషంగా వుంది. బుచ్చి తన మిత్రబృందంతో కలిసి డ్రామా వేయాలని నిర్ణయించుకున్నాడు. అనుకున్నదే తడవుగా నెలరోజుల పాటు రిహార్సల్ అన్నీ పర్ఫెక్టుగా చేసి, సరిగ్గ ఫంక్షన్ రోజు తయారైపోయాడు.
నాటకంలో బుచ్చిబాబు విప్లవనాయకుడు. పేరులోనే కాదు, మనిషిలో కూడా కరుకుదనం కనిపించదు కాబట్టి నిజం మీసాల్ని తీసేసి పెట్టుడు మీసాల్ని పెట్టేరు బుచ్చికి. రిహార్సల్స్ కారణంగా అలిసిపోయి, నిద్రనాపుకుని – నాటకంలో విజృభించి నటించేడు. నాటకం ముగిసాక గ్రీన్ రూమ్ నిజీగా వుండడంతో పక్కనే వున్న క్లాసురూమ్ లో పడుకుని నిద్రపోయాడు. పదింటికి వాచ్ మన్ నిద్రలేపాడు. హడావుడిగా లేచి వాచ్ మన్ ఏదో చెప్పబోతుంటే వినకుండా ఆఘమేఘాల మీద ఇంటికి వచ్చి పడ్డాడు.
ఇంట్లో పక్కింటి చిట్టి కూర్చుని ఏదో చదువుతోంది. బుచ్చిని చూడగానే టక్కున చేతిని నోటికడ్డు పెట్టుకుని అటుపై తట్టుకోలేక పడిపడి నవ్వసాగింది. బుచ్చి ఉక్రోషంతో అరిచాడు. “కారణం లేకుండా నవ్వడాన్ని పిచ్చి అంటారు” అన్నాడు.
ఈ గొడవంతా విని బుచ్చి అమ్మ వచ్చి అమె కూడా నవ్వసాగింది. “ఏంటమ్మా, నువ్వు కూడా..” అని బుంగమూతి పెట్టాడు బుచ్చి.
“ఒక్క సాయంత్రంలో ఇంత పెద్ద మీసాలు ఎలా వచ్చాయిరా?” అడిగిందావిడ. తడిమి చూసుకున్నాడు. అమ్మ వంక ఇబ్బందిగా చూసి, చిట్టివంక కోపంగా చూసి గబగబా తన గదిలోకి వెళ్ళి తలుపులేసుకున్నాడు.
తన మొహమెలా వుంటే ఈ చిట్టికేం పట్టించి? ఈ మాత్రం దానికి అంతగా నవ్వడమెందుకు? ఛీ ఛీ..ఈ టీనేజీ అమ్మాయిలకి బుద్ధి పెరగదు. అందం తప్ప….”
అందం…అందం…
బుచ్చి ఆలోచనలు టక్కున ఆగిపోయాయి. చంకలో గిర్రెపిల్ల నుంచుకుని ఊరంతా వెతికినందుకు తనను తానే తిట్టుకున్నాడు. పక్కీంట్లో చిట్టినుంచుకుని ఎవరో అమ్మాయి కోసమ్ కాలేజీలో వెదకడమెందుకు? అందునా చిన్నప్పటినుంచీ పరిచయం. “యురేకా” అని అరవాలనిపించింది. అటుపై చీటికిమాటికీ చిట్టిని కలిసి మాట్లాడేవాడు. అలా కలవడానికి ఏ నెపం దొరుకుతుందా అని ఆలోచించడం మొదలు పెట్టాడు. తనకున్న సినీ పరిజ్ఞానంతో, కంట్లో నలుసు పడ్డా తీయించుకోడానికి చిట్టి దగ్గరికే వెళ్ళేవాడు. ఓ శుభముహూర్తాన ఏకాంతంలో ధైర్యం చేసేసాడు – “చిట్టీ, నీతో ఓ మాట చెప్పాలి” “ఏమిటది?”ఊహించి కూడా అడిగింది “ఐ లవ్ యూ చిట్టీ” “ఐ టూ బుచ్చీ” “చిట్టీ..” “బుచ్చీ….” “….” “….” అలా వారిద్దరి హృదయాల్లో ప్రేమ బీజాలు మొలకెత్తాయి. కానీ విని వాళ్ళ ప్రేమ మొలకల్లో అవకాశాలనే నీళ్ళు పోయడానికి బదులు వియోగమనే నిప్పులు పోసింది. చిట్టి నాన్నకు వేరే వూరికి బదిలీ అయింది. రెండ్రోజుల పాటు “కల యిదనీ, నిజమిదనీ తెలియదులే…” పాట వింటూ గడిపి – చిట్టిని మర్చిపోయాడు బుచ్చి. ఆ కథ అలా సుఖాంత(?)మయింది. ఈ సంఘటన తర్వాత ఓ గొప్ప వేదాంతం అలవడింది బుచ్చిబాబుకు. “జీవితమనే ప్రయాణంలో ప్రతి అమ్మాయి పరిచయమూ ఓ మజిలీ మాత్రమేననీ తాను కేవలం బాటసారి అనీ-పెళ్ళి అనే గమ్యం చేరుకునేలోపు వీలయినన్ని మజిలీలు దాటాలనీ”. * * * * * * * * “బుచ్చీ! ఎవరొచ్చారో చూడూ” అంది అమ్మ. బుచ్చిబాబు కొత్తగా వచ్చిన ముఖావంక చూస్తూ – ఆ ఆగంతుకులెవరో ఊహించడానికి విఫలప్రయత్నం చేసాడు. “బుచ్చిబాబా? ఎప్పుడో చిన్నప్పుడు చూసాను. ఎంతగా ఎదిగిపోయాడో?” అన్నాడాయన. బుచ్చిబాబు వంక చూస్తూ “ఏరా బావున్నావా?” అని కూడ అడిగేసాడు. యాంత్రికంగా తలాడించి ఆయన్నీ ఆయన పక్కనున్నావిడనూ చూడసాగాడు. అంతలోకి ఓ మెరుపుతీగ కళ్లముందు కదిలినట్టైంది. వచ్చిన వాళ్ళ కూతురు కాబోలు – ఓ ఇరవై, ఇరవైరెండేళ్ళుంటాయి కాబోలు, లగేజీ మోసుకొస్తూ కనిపించింది. వీళ్ళెవరైవుంటారా అన్నట్టు అమ్మ వైపు చూసాడు. “వరసకి నాకు అన్నయ్య అవుతార్రా. ఎప్పుడో నార్తిండియాలో సెటిలైపోయారు” అందావిడ. ఈయన అమ్మకు అన్న ఐతే తనకు మామయ్యేగా. అంటే వెనకాలే వచ్చిన మెరుపుతీగ వరసకి మరదలన్న మాట. ఓ క్షణం పాటు బుచ్చి గుండె ఆగినట్టైంది. అప్పుడనుకున్నాడు “మనసు కోతి లాంటిది!” అని. “ఏ అమ్మాయైనా కనబడితే లవ్వాడేస్తుందని”. ఆ వచ్చిన వేలువిడిచిన మామయ్య చదువు కోసమని అమ్మాయిని బుచ్చి వాళ్ళింట్లోనే వదిలి వెళ్ళాడు. అటుపై తనకు తెలీకుండానే సాయంత్రాలు అందంగా తయారవడం మొదలెట్టాడు బుచ్చి. ఫ్రెండ్స్ పిలిచినా తిరస్కరించి ఇంట్లోనే కూర్చుని కనబడ్డ పుస్తకాన్నల్లా చదవడం మొదలెట్టాడు. ఓరోజు కుతూహలం ఆపుకోలేక – “బావా, నువ్వెప్పుడూ బయటికి వెళ్ళవా?” అడిగిందా అమ్మాయి. “ఎందుకో, అనవసరంగా తిరుగుతూ టైం వేస్టు చేయడం నాకిష్టం వుండదు” అన్నాడు బుచ్చి. ఆ టైం సెన్స్ చూసి ఆశ్చర్యపోయిందామ్మాయి. కాలక్రమేణా అతనో అపురూపమైన వ్యక్తిలా కనిపించసాగాడు. అతనిలోని విశేషాలన్నీ విశ్వరూపంలో కనబడసాగాయి. బాగా హిట్టయ్యే నవలల్లోని కధానాయకుడి లక్షణాలు, చేష్టలూ అన్నీ అతనిలో కనిపించసాగాయి. “బావా, నిన్ను నేను పెళ్ళి చేసుకుంటాను” అంది ఓరోజు. అప్పటి వరకూ తనే అమ్మాయిల వెంటపడ్డం తప్ప మొదటిసారిగా ఓ అమ్మాయి తనకు తానై పెళ్ళి చేసుకుంటాననే సరికి (ఆ అమ్మాయి పేరు వరూధిని అనిన్నీ మరో పేరు లేదనిన్నీ పాఠకులు ఊహించగల్రు). బుచ్చికి నోట మాట రాలేదు. ఆ సంతోషంలోనే ఆ అమ్మాయిని వెంటేసుకుని గుళ్ళకీ, గోపురాలకీ (అమ్మాయి కోరిక మేరకు), పార్కులకీ బీచులకీ (తన కోసం) జా….మ్మని తిరిగేసాడు. ఓ రోజు దేవుణ్ణి ప్రార్ధించాడు “దేవుడా! నేన్నిన్ను ఇప్పటి వరకూ ఏ కోరికా కోరలేదు. ఈ ఒక్క కోరికా తీర్చు. వరూధినితో నా పెళ్ళి జరిగేలా చూడు…”. దేవుడికా మాటలు వినబడినట్టు లేదు. వరూధిని తండ్రి వస్తూ వస్తూ ఓ వరుడి ఫోటోను తెచ్చేడు. బుచ్చి కళ్ళకి వాడు మాయా ప్రవరుడిలా(!) కనిపించేడు. వరూధిని తండ్రిని ఎదిరించి “న్నాన్నా! నేనూ, బుచ్చి ప్రేమించుకున్నాం. ఎవణ్ణి పడ్తే వాణ్ణి చేసుకోను.” అంది. “నీ బొంద. అన్నీ విచారించుకునే ఉన్నాను. వీడు నీకన్నా రెండేండ్లు చిన్న. ఐనా చేద్దామంటే వాడికే ఆయుఃక్షీణం. పద పద” అని కూతుర్ని వెంటబెట్టుకుని చక్కా పోయాడు. కన్న కలలన్నీ భగ్నం కాగా మొదటి ఆటకి పుల్ కౌంటు చూపించి, రెండో ఆటకి రాంగ్ షోతో పట్టుబడి, ఆట పూర్తయ్యేలోగా పర్సును ఇంట్లో మర్చిపోయివచ్చిన పేకాటరాయుడిలా తయారయ్యాడు బుచ్చి. మనిషి జీవితంలో ఆడా, మగా ప్రేమ తప్ప మరేమీ లేదనుకుంటే బుచ్చి అన్నీ కోల్పోయాడు. గజనీ మొహమ్మదులా మళ్ళీ మళ్ళీ విఫలమయ్యాడు. దాంతో ఎక్కడో వేరే వూర్లో గుమాస్తాగా రాజీపడిపోయాడు. ఆఫీసుకు దగ్గర్లోనే గది తీసుకున్నాడు. అఫీసు వేళలు ముగిసాక ఓ శాలువా కప్పుకుని, సిగరెట్లు కాలుస్తూ, శూన్యంలోకి చూస్తూ గడిపేస్తున్నాడు. “మీ గడ్డం ఎంత బాగుందో” అని బుచ్చి మాసిన గడ్డాన్ని అబ్బురంగా చూస్తూ అంది సరళ. ఆమె బుచ్చి ఆఫీసులో కొత్తగా చేరిన మరో గుమాస్తా. ఆమెను వెర్రిగా కౌగిలించుకుని “పూర్ మనసు! నిజ్జంగానే కోతిలాంటిది” అనుకున్నాడు బుచ్చిబాబు. * * * * * *
|