ఒక్కసారిగా వాసుదేవ శాస్త్రి గతంలోకి వెళ్లి సేద తీరారు.
“అమ్మాయి లక్షణంగా ఉంది. లక్ష్మిలా ఉంది. సరళ అనే పేరుకు సరిగ్గా సరిపోయింది ఈమె మన రాఘవకు తగ్గ భార్య!”
“సరే నన్నారు!” అని టక్కున జవాబు వచ్చింది.
“సరే, నాన్నగారితో ఈ విషయం మాట్లాడతాను.” అని చెప్పి వాసుదేవ శాస్త్రి ఉన్న వరండా లోకి వెళ్ళాడు రాఘవ శాస్త్రి.
“ఇప్పుడే వచ్చాను నాన్నగారు.”
“మీరు చెప్పింది అక్షర సత్యం నాన్నగారు. ఇందు నా తప్పు చాల ఉంది. నేను మీ కోడలితో ఆధ్యాత్మిక విషయాలు లోతుగా చర్చించా లేదు ఆమె కూడా నన్ను వివిరణలు అడుగనూ లేదు. కాని నాకు ఆమె అడిగినా అడుగక పోయినా కొన్ని ముఖ్య మైన విషయాలు చెప్పవలసిన బాధ్యత నాకు ఉంది. అది నేను సరిగా నిర్వర్తించలేదు.” అని మౌనం వహించాడు.
ఈలోగా సరళ ఈ సంభాషణలో తన మామ గారు భర్త చూపిన పరిపక్వత శాంతంగా తమ తప్పులను ఎంచుకోవడం అబ్బుర పరిచింది. ఈ విధమైన సంభాషణ ఇంట్లో ఎప్పుడూ జరుగ లేదు. ఇంత మంచి మనుషులున్న ఈ ఇల్లు కదా స్వర్గం అని ఒక్కసారిగా అనిపించింది. తనకు తెలుసు పిల్లయాక ఇప్పటికి ఒక్క సారి కూడా తన అత్త మామలు పల్లెత్తు మాట అనలేదు. ఎంతో అభిమానం ప్రేమ చూపడమే వారికి తెలుసు. తన భర్త శ్రీరాముడే మాటకు ముందు కట్టిపాడేసే మందస్మితం. ఏ భేషజమూ ఎరుగని ప్రవర్తన మాట తీరు. ఒక్క సారి వర్తమానం గుర్తొచ్చి “ఇది నాజీవితం మరి నా పిల్లలో? వారికి ఇలా జరగాలని లేదు కదా? అందుకే ప్రణాళికాబద్ధంగా వారి భావి జీవితానికి తగ్గ పునాదులు వేయాలి!” అని మరొక్క సారి అనుకుంది.
“సరే జరిగిందేదో జరిగింది ఏమీ కలత పడనవసరం లేదు నేను చెప్పినట్లు అన్ని సమస్యలకు ఈ కాలమే సమాధాన్ని ఇస్తుంది ఓపిక పడదాం. సరే నువ్వు రేపటి గ్రహణానికి గ్రామం లో అందరి ఇళ్ళకూ దర్భలు పంపించే ఏర్పాట్లు పూర్తి చేసావా?”
“చేసేసాను నాన్నగారు. ఇక మనం బయలు దేరదామా” అని తన తండ్రి ఉత్తరీయాన్ని పక్కనున్న దండెం పై నుంచి తీసి వాసు దేవ శాస్త్రి కి అందించాడు. ఇద్దరూ బయలు దేరి ముందుగా అనుకున్నప్రకారం గ్రామ పంచాయితీ కార్యాలయానికి వెళ్ళారు వారి భూమి తాలూకు పత్రాలు సరిచేయించడానికి.
అంతలోనే కొంత మంది వ్యక్తులను – చూడడానికి మంచి వృత్తం ఉన్న వాళ్ళలా ఉన్నారు – వెంట బెట్టుకొని రామనాథం గారు ఇంటి లోకి వస్తూ “నమస్కారం వాసుదేవ శాస్త్రి గారు!” అంటూ వాకిలి దాకా వచ్చారు. కంగారుగా సరళ బయటకు వచ్చి “నమస్కారం రామనాధం గారు, మావారు, మామగారు పంచాయితీ కార్యాలయానికి వెళ్ళారు ఇప్పుడే వచేస్తారు కూర్చోండి అని వసారాలో ఉన్న కుర్చీలు సరి చేసింది.
“అమ్మా! మీ మామ గారి లక్షణాలన్నీ పుణికి పుచ్చుకున్నారు మీ వారు. చూసారా వారిని గురించి ఎవరికీ గొప్పగా ఎవరినీ చెప్పనీయారు. కాని సూర్య తేజస్సుని దాయగాలమా? వీరు ఎస్.వి.బి.సి నుంచి వచ్చారు. వీరు మహతి ఆడిటోరియంలో ఒక ఐదు రోజులు సాయంకాలం ఆరు నుంచి ఎనిమిది గంటల వరకు “సనాతన ధర్మం – అనుష్టానం” అనే శీర్షికన మీ ఉపన్యాసాలు ఏర్పాటు చేయమని అభ్యర్ధించడానికి వచ్చారు. ఇతఃపూర్వం వీరు మన గోపాల స్వామి గుడి నిర్వహణ పై ఒక డాక్యుమెంటరీని నిర్మించి ప్రసారం చేసారు తద్వారా మన గుడికి చాల ప్రాంతాల నుంచి భక్తులు వస్తున్నారు ఈ విషయం మీకు తెలిసిందే వీరి ఛానల్ వల్ల మన ఊరి గుడికి, దాని పూజారులైన మీ మామగారికి, వారి కుమారుడైన రాఘవ శాస్త్రి గారికి ఎంతో పేరు వచ్చింది. వీరిని ఆదర్శంగా తీసుకొని గుడిని నిర్వహించాలని ఎందఱో వారి యధామతి ప్రయత్నాలు మన రాష్ట్రం చేస్తున్నారు. శాస్త్రి గారికి ఉన్న శాస్త్ర జ్ఞానం వారు ఇచ్చిన చిన్న ఇంటర్వ్యూ ద్వారా అవగతమై వీరి చానల్ అధినేత అయిన రమణ గారు స్వయం గా వచ్చారు. ఆయనే వీరు!” అని కుర్చీలోఒదిగి కూర్చున్నఒక మధ్యవయస్కుణ్ణి చూపారు.
ఈలోగా చానల్ పాత్రికేయుడొకరు “అమ్మా! మీరు ఈ స్త్రీ జాతిలో అతి కొద్దిమంది భాగ్యశాలులలో ఒకరు. మీ భర్త వంటి వారు మీ మామ గారి వంటి పండితులు మీ సేవని స్వీకరిస్తూ ఉండడం మీకు ఎంతో అదృష్టం. పునాదులు కదలిపోతున్నాయా అన్నంత రీతిలో సదాచారం భ్రష్టు పట్టి పోతుంటే మీరు ఇక్కడ ’లేదు దాని పునాదులు చాల బలంగా ఉన్నాయ్ అని’ చెప్పేలా జీవితాన్ని కొనసాగిస్తున్నారు. మీ కుటుంబం చాలామందికి ఆదర్శం. అమా ఒక్క ప్రశ్న మీరు ఈ మధ్య నివృత్తి చేసుకోన్న మీకు నచ్చిన ఒక ధర్మ సందేహం ఒకటి చెప్పండి అని అడిగాడు.
ఈ ప్రశ్నకు సరళ విస్తుపోయింది. తను ఎప్పుడూ ఆధ్యాత్మిక విషయాల పట్ల తన భర్త తో చర్చ చేయలేడు ఏదో ఆయన చెప్పింది వినడం తక్క. అలాగే తన మామగారిని ఏనాడు ఏ ధర్మ సందేహం అడగలేదు.
ఎందుకిలా జరిగింది అని తనలో తానూ అనుకొనే లోపున తన భర్త మామగారు రావడం జరిగిపోయింది.
రమణ మాట్లాడుతూ “అయ్యా! మీలాటి వారు మన ఆంద్ర దేశం లో ఉండడం మా అదృష్టం మీరు దయచేసి మీకు వీలున్న తేదీలు తెలియ చేయగలరు మీ అబ్బాయి గారి ప్రతిభ కూడా మాకు తెలిసింది మీరు అనుమతిస్తే వారినీ ఆలయ నిర్వహణ పై వారికి వీలున్న తేదీలలో ఒక అయిదు రోజుల పాటు మీ ప్రవచానానంతరం వారి ప్రసంగాలను కూడా ఏర్పాటు చేస్తాం అని చెప్పి, అయ్యా! ఇది శ్రీ వేంకటేశ్వర స్వామివారి ప్రసాదం శేష వస్త్రం మీరు స్వీకరించండి!” అని సవినయంగా వాసుదేవ శాస్త్రి గారికి సమర్పించే నిమిత్తం లేచి నిలబడ్డారు.
వాసుదేవ శాస్త్రి ఆర్తి తో చేతులు ముందుకు చాచి “మహాప్రసాదం” అని కళ్ళకు అడ్డుకొని సంతోషం తో వెలిగి పోతున్న మోముతో స్వీకరించారు. ఇదంతా మంత్ర ముగ్ధ యై చూస్తూ నిలబడింది సరళ.
“చాల సంతోషం రమణ గారు మా రామనాథం గారు మిమ్మల్ని తీసుకొని వచ్చినపుడే మీ కార్యక్రమం సఫల మైనట్లే . తప్పక నేను మీకు నాకు నా కుమారునికి వీలైన తేదీలను ఒక వారంలో తెలియజేస్తాము.” అని చెబుతూ “ఈ శీర్షిక కు ప్రేరణ ఎవరు?” అని అడిగారు.
“ఈమధ్య “ఈనాడు” దిన పత్రిక లో పూజారులకు వేదాన్ని అభ్యసించి సనాతన ధర్మంలో తనవంతు పాత్ర పోషించి తృప్తి గా జీవించే చాల మంది బ్రహ్మణ యువకులకు వధువులు దొరకడం లేదని మొదటిపుటలో ప్రముఖంగా ప్రచురించారు దాని పై విస్తృతం గా చర్చ జరుగుతోంది ఇప్పుడు రాష్ట్రంలో మా వంతు కర్తవ్యమ్ మేము నిర్వహించాలి కనుక ఈ ప్రవచనాన్ని ఏర్పాటు చేద్దామని సంకల్పించాం. అప్పుడు దీనికి ఎవరిని ఆహ్వానిద్దాం అని అలోచేస్తూ మా మిత్రులైన రామనాథం గారికి ఫోను చేస్తే ఎవరో ఎందుకు మీరే దానికి సమర్ధులని వారు చెప్పగా, గతంలో మీరు ఇచ్చిన లఘు ముఖాముఖిని మరొక్కసారి చూసి తప్పక మీరే దీనికి న్యాయం చేకూర్చ గలరని మిమ్మల్ని అర్దిద్దామని వచ్చాం.” అని ఎంతో ప్రియంగా రమణ విన్నవించుకున్నారు.
రమణ గారు మీ సంకల్పం చాల హర్షణీయం. మన మూలాలను మన సదాచార సంపత్తిని మనం కాపాడుకొంటూ మన సాధన సాగిన నాడు జ్ఞానం తనంత తాను భాసిస్తుంది మన మనస్సులో. ఎక్కడ ఈ జ్ఞానం భాసిస్తుందో అక్కడకి మకరందాన్ని గ్రోలే తుమ్మేదలలా మరికొందరు సాధకులు వచ్చి కలుస్తారు. ఇక్కడ ఎంత మంది వచ్చారు అనేది ముఖ్యం కాదు. కాని వచ్చిన ఆ కొద్దిమంది అసలైన సాధకుల ద్వారా ఎంతమంది నిజమైన సాధకులుగా తయారై సదాచారాన్ని గౌరవించి అనుష్టించగలుగుతున్నారు అనేది ముఖ్యం. మీ చానల్ ద్వారా మీరు ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ఎన్నో చేయాలి. ఎందఱో మహానుభావులు మన రాష్ట్రంలో ఉన్నారు వారిని మీరు కలవండి వారిని గుర్తించడం అది మీకు వెన్నతో పెట్టిన విద్య అని మా రామనాథం గారు చెప్పరు. వజ్రాలను గుర్తించే పని లో ఉన్నవాళ్ళు ఏది అసలు వజ్రమో ఏది కాదో అనేది యిట్టె పట్టగలరు ఎన్ని మెరిసే రాళ్ళు వాళ్ళ ముందు పోసినా. మాకు తెలిసిన విషయాలు మేము మీ ప్రేక్షకుల మనసు హత్తుకొనే లా చెప్పడానికి ప్రయత్నిస్తాం.
ఈ లోగా ఎప్పుడు చెప్పిందో తెలియదు సరళ, ఇంట్లో ఉన్న పని పిల్ల చక్కని కాఫీ తయారు చేసి అతిధులకు ఇచ్చింది.
“చక్కగా కుదిరాయి అన్నీ మొత్తం పది రోజులు మీ నాన్న గారి, మీ పుణ్యమా అని ఆ వేంకటేశ్వర స్వామిని పది రోజులు రోజూ దర్శించుకున్నాం మన అందరం. మామ గారు చెప్పింది అక్షర సత్యం కాలంలో వచ్చిన సమస్యకు కాలం లోనే సమాధానం దొరుకుతుంది. నాకు అత్తగారు, మామగారు, మీరు చెప్పని విషయాలను మీరు మామయ్యా గారు పది రోజుల పాటు నాకోసం చెప్పారా అన్నట్లు కాకుండా మొత్తం బ్రహ్మణ కుటుంబాలకు కను విప్పు కలిగేలా బ్రాహ్మణ యువతకు ముఖ్యంగా బ్రాహ్మణ కన్యలకు చక్కగా సప్రమాణం గా సెలవిచ్చారు. మామయ్య గారు నా అజ్ఞానాన్ని మన్నించండి మీరు మా అత్తగారు నడచిన బాటనే మీ మనుమడు మీ మనుమరాలు నడుస్తారు.” అని ఉద్విగ్నతతో గద్గద స్వరంతో వాసుదేవ శాస్త్రి గారి పాదాలను తాకింది సరళ .
మనుమడు గోపీనాథ శాస్త్రి “తాతయ్యా! మీకు నేను మనుమడి గా పుట్టడం ఎంతో అదృష్టం మీ మనుమడిగా మీరు గర్వపడేలా నేను నా అనుష్టానాన్ని సాగిస్తాను.” అని మోకరిల్లాడు.
ఇంతలో “తాతయ్యా ఆధునికత అమెరికా మోజులో కొట్టుకుపోయే సమయంలో నాకు ఇలా మీతో నాన్న గారితో కలసి మీ ఈ ప్రసంగాలకు రావడం వినడం ఎంతో అద్భుతం గా ఉంది నా అనుమానాలన్నీ దూరమయ్యాయి మీరు చూసిన మీకు నచ్చిన సంబంధమే నాకు ఒక వరం” అని అక్కున చేరింది.
వాసుదేవ శాస్త్రి కి ఆనంద బాష్పాలు ఆగలేదు. శ్రీ హరీ అని దీర్ఘగా శ్వాస తీసి “అంతా వాది దయ మీ అదృష్టం మీ పూర్వ జన్మ సుకృతం” ఇది చూడాలి అని నాకు “వాడు” ఇచ్చిన ఒక అపురూపమైన వరం” అని అక్కున చేరిన మనుమరాలి మూర్ధన్న్య స్థానం పై ముద్దిడి పడక కుర్చీలో కూరున్నారో లేదో ఒక ఫోను. “అయ్యా మిమ్మల్ని కలవాలి. ఎప్పుడు రమ్మంటారు?” అని దేవాదాయ ధర్మాదాయ శాఖ సెక్రటరీ. “సరే, ఇంతకూ మిమ్మల్ని అంతగా ప్రభావితం చేసిన విషయాలు నా ప్రవచనం లో వాడి ప్రవచనం లో ఏవిటి?”
అని వాసుదేవ శాస్త్రి గారు తన కోడలని పిల్లల్ని అడిగారు. వెంటనే సరళ – “జననం జీవి చేతి లో లేదు ఈశ్వరుని చేతిలేదు కేవలం జీవి కర్మల ఫలమే జన్మని నిర్ణయిస్తుంది అని. ఈ వేద భూమిని వదిలి భోగభూములకు మరలిపోయే వారు ఎలాగైతే మనకు “అవుట్ అఫ్ ది కవరేజ్ ఏరియా ” అనే సందేశం మనం నిర్మించుకున్న మొబైల్ ఫోను వ్యవస్థకు నిబంధన ఉన్నట్లు ఆ శ్రీ హరి ఏర్పాటు చేసిన ఈ విశ్వంలో సైతం నిబంధనలు ఉన్నాయి మనం మన భూమిని వదిలి భోగ భూములకు మరలితే మనమూ “వాడి” కవరేజ్ ఏరియా కు అవతలకు వెళ్ళినట్లే. సనాతన ధర్మమలో ఉండడమే ఒక గొప్ప వరం దానిని కాదనుకోవడం స్వచ్చ మైన జలాలను వదలి కలుషిత నీటిని త్రాగడమే. ఈశ్వర కైంకర్యమే పరమావధిగా జీవనం సాగించడం ఒక మహద్భాగ్యం” అని ఇంకా మీరు చెప్పిన విషయాలు చాల ఉన్నాయి నాకు స్పురణకు రావడం లేదు అని చెప్పింది. అలా చెప్పడం లో ఆమె లోని విశ్వాసం నిజాయితీ ఆమె ముఖం లో ప్రస్ఫుటంగా కనిపించాయి.
అంతలో మనుమడు తాతకు ఎదురుగా వచ్చి “సంస్కృత భాష ఔన్నత్యాన్ని మీ వ్యుత్పత్తి, ఇతర శబ్ద, పద విభాగాల ద్వారా వాటి అర్దాల ద్వారా తెలుసుకొని దానిని మీ నుంచి అభ్యాసం చేయాలని నేను సనాతన ధర్మమే నా విలాసం గా మార్చుకోవాలని ఒక నిర్ణయానికి వచ్చేసాను తాతయ్యా. నాన్న దగ్గర మీ దగ్గర సాధన చేసి నేనూ ఒక మంచి పూజారి గా మీ లాగ మా నాన్న గారి లాగ తెలియబడాలి” అని అనర్గళంగా చెప్పాడు.
“చాలు చాలు మీకీ విషయాలపై ఆసక్తత రావడానికేనోమో ఆ శ్రీ హరి ఇంత తతంగాన్ని నడిపించాడు. తద్ద్వార ఎంతో మందికీ ఈ విషయాలు వారి వారి సాధనానుసారం అందచేసాడు ఎంతటి సమన్వయకర్త వాడు” అని కాళ్ళు మూసుకొని ఒక్క సారిగా ధ్యానంలోకి వెళ్ళిపోయారు ఆయన రెండు కళ్ళ నుంచి అశ్రువులు ధారగా కారుతున్నాయి అవి చూసి అందరూ అచేతనం గా ఉండిపోయారు.