థాంక్స్

Spread the love
Like-o-Meter
[Total: 0 Average: 0]

అంత పెద్ద సరోవరంలో ఒకే ఏనుగు నీళ్ళు తాగుతోంది. చిన్ని కళ్ళతో పెద్ద శరీరంతో అమాయకంగా కనిపిస్తోన్న దాన్ని చూడ్డం గమ్మత్తుగా ఉంది – ఒడ్డున నిలబడ్డ నాకు. నీళ్ళలో మొదలైన చిన్న సంచలనం కాస్సేపటికి మొసలి రూపంలో బయటపడింది. 
 
ఏనుగు కాలిని మొసలి పట్టుకుంది. ఏనుగు ఘీంకరించడం తప్ప మరేమీ చేయడం లేదు. బహుశా పద్యం మర్చిపోయుంటుందని అందిస్తూ – ‘లావొక్కింతయు లేదు – ధైర్యము విలోలంబయ్యె’ అంటూ పెదాలు కదిలించాను.
 
కానీ, ఆలోగా ఏనుగు కాలిని మొసలి కొరికి వేరు చేసింది. అంత రక్తం – పక్కన ఒంటరిగా నేను. ఏం చెయ్యాలో పాలుపోలేదు. చేతిని కదిలించాను. పక్కనున్న వ్యక్తి కళ్ళజోడు తగిలింది. మెడ చుట్టూ చేతులు వేసి, గట్టిగా కావలించుకున్నాను.

‘పిచ్చి కన్నా, భయపడ్డావా?’

‘ఊ… ‘ వణికాన్నేను.

ఆ మూర్తి నన్ను దగ్గరకు తీసుకుని జోకొట్టింది. ఆవిడ మా అమ్మమ్మ. అప్పుడు నా వయసు ఏడేళ్ళు.

000
‘ఏమిటయ్యా, మాకు పార్టీ అదీ లేదా ఏమిటి? మీ అబ్బాయేమో స్కూలు ఫస్టొచ్చాడు. కనీసం స్వీటు ముక్కైనా మా ముఖాన రాసి ఉందా, లేదా?’ దబాయిస్తున్నాడు, ఆ వచ్చినాయన.

నాన్నారు సంతోషాన్నంతా ముసి ముసి నవ్వుల్లో కూడా బయట పడనీయకుండా అణిచివేయడానికి విఫల ప్రయత్నం చేస్తున్నారు. నేను స్కూలు ఫైనల్లో ఫస్టు కావడం ఆయనకు అమితానందాన్ని కల్గిస్తుందని నాకు తెలుసు.

నా పరీక్షా ఫలితాల విషయం ఏదో చర్చిస్తున్నారని తెలిసి, వంటింటి లోంచి, చేతిలో గరిటతో అలాగే వచ్చింది అమ్మ. ‘చూడు శారదా, నీ కొడుకు ఫస్టొచ్చేట్ట’ సన్నగా నవ్వేరు నాన్నారు.

‘మా నాయనే’ అమ్మెంత సంతోషించిందో ఆ ఉచ్ఛారణలోనే తెలిసింది. వడివడిగా వచ్చి, నన్ను దగ్గరకు తీసుకుని, నా నుదుటిపై ముద్దు పెట్టుకుంది. పిల్లలు సాధించిన ఎంత చిన్న విజయమైనా తల్లులకు గొప్ప ఆనందాన్ని కల్గిస్తుందేమో! అందుకే అంటారు ‘పిచ్చి తల్లు’లని.

ప్రేమకీ, పిచ్చికీ ఆట్టే తేడా లేదనుకుంటాను. ఎప్పుడో నేను అనువదించిన ఆంగ్ల కవిత గుర్తొచ్చింది.

‘ దేవుడు అమ్మల్ని సృష్టించింది – ప్రేమను పంచడానికే అందుకే, అమ్మల దగ్గర ప్రేమ ఎక్కువగా ఉంటుంది. ప్రత్యేకంగా మా అమ్మ దగ్గరలా’

000
 
‘ఎప్పుడూ ఆ దరిద్రపు కాగితాలు ముందేసుక్కూర్చోడమేనా, ఇంటి బాధ్యతేదైనా పట్టించుకునేదుందా?’ వంటింటి లోంచి అరుస్తోన్న సుభద్ర కేకలకు – వ్రాస్తున్న నేను ఈ లోకంలోకి వచ్చాను.

అడపాదడపా కథల్రాస్తుంటానని తెలిసిన మిత్రుడొచ్చి ‘కథల పోటీ ఉంది. వ్రాయకూడదూ-‘ అనడిగితే, మొహమాటం కొద్దీ ‘నేనేమిటి? పోటీలకు వ్రాయడమేమిటీ?’ అన్నాను. అందులో అతను నన్నింకా పొగిడి,
ప్రోత్సహిస్తాడని ఆశ కూడా ఉందేమో, ఎందుకంటే నా భార్యామణి నాకు కలిగించే నిరుత్సాహమే ఎక్కువ.

‘నీ గురించి నాకు బాగా తెలుసు. వ్రాయగలవు. ప్రొసీడ్’ అని చెప్పి నాలో కొండంత ధైర్యాన్ని నింపి వెళ్ళాడతను. ఆ ధైర్యంతోనే వ్రాస్తున్న నేను, ఆవిడ కేకలకు జావకారిపోయాను.

అటుపై, ఆవిడ ఆదేశమ్మీద కార్డుచ్చుకుని, రేషన్ షాపుకు బయలుదేరాను.

000
 
నేనెంతో కాలంగా సమాధానం వెతుకుతూనే, పొందలేకపోయిన ప్రశ్న – ‘సుభద్ర నాపై ఎందుకు విరుచుకుపడుతూంటుంది?’ మెల్లగా నా జ్ఞాపకాల దొంతరలో పుటకు గుర్తుకు రాసాగాయి.

టీనేజ్ లో నేను కృష్ణశాస్త్రినీ, నండూరి వారినీ ఎక్కువగా చదివే వాణ్ణి. సుభద్రను మొదటిసారి చూసింది పెళ్ళి చూపుల్లోనే. అమాయకంగా, అందంగా ఉన్న తనను చూడగానే సుబ్బారావుగారు గుర్తొచ్చారు.

‘కళ్ళెత్తితే చాలు కనకాభిషేకాలు, ఒక్క నవ్వే చాలు వజ్ర వైఢూర్యాలు!’

మిత్రబృందంలో జరిగే చర్చల్లో ఎప్పుడూ కాబోయే భార్యలకు ఉండాల్సిన లక్షణాలపై వాదోపవాదాలు జరిగేవి. తనను చూడగానే, గ్యారంటీగా మా వాళ్ళంతా నా అదృష్టాన్ని చూసి అసూయపడతారనిపించింది.

‘ప్రేమకు పునాది తప్పకుండా ఆకర్షణే. కానీ, ప్రతీ ఆకర్షణా ప్రేమకు దారి తీయాలనేం లేదు.’ – ఇది నాకు అనుభవం నేర్పిన పాఠం.

శోభనం రాత్రి చాలా గొప్పగా ఉంటుందని ఊహించుకున్నాన్నేను, అందరిలాగే. ఆ రోజే తెలిసింది – తనకి మగాళ్ళంటే అయిష్టమని. మితిమీరిన ప్రేమను ప్రదర్శించుకోవడానికి కేవలం భార్యాభర్తలకుండే అదనపు సౌకర్యం – సెక్స్ బహుశా. చెయ్యి వెయ్యబోతే విదిలించి కొట్టింది తను.

 
అప్పుడు మాత్రం , ‘జీవితంలో వసంతం వెళ్ళిపోయింది. గ్రీష్మం ప్రవేశించింది. అయినా ఇది తాత్కాలికమేలే’, అనుకున్న నాకు, అది శాశ్వతమని తెలిసింది – ఆలస్యంగా. పుష్పించడానికీ, ఫలించడానికీ ఋతువులతో సంబంధం లేదు. ఆ విధంగానే, అనుభూతులూ, ఆప్యాయతలూ లేని మా దాంపత్యానికి ఫలితం – ముగ్గురు పిల్లలు. ఇద్దరబ్బాయిలూ, ఓ అమ్మాయీ!
000
‘నువ్వు చాలా అదృష్టవంతురాలివి. మీ ఆయన కథలు బాగా రాస్తారు. అంత గొప్ప రైటర్…’ ఏదో చెప్తోంది పంకజాక్షి.

‘ఆ… అదీ ఒక అదృష్టమా, పాడా? ఇంటి పనులస్సలు పట్టించుకోడు.’ తీసిపారేసింది సుభద్ర. తను నన్నెప్పుడూ ఏకవచనంలోనే సంబోధిస్తుంది.

పేపర్ చదువుతున్నట్టు నటిస్తున్న నేను వాళ్ళ మాటలు వింటూ గతుక్కుమని మళ్ళీ పేపర్లో తల దూర్చేశాను.

సుభద్ర, పంకజాక్షి భర్తలోని ప్లస్ పాయింట్లేవో చెప్తోంది. వెంటనే వెళ్ళి అతనితో మాట్లాడి, కొంతకాలం పాటు (కాదు కాదు శాశ్వతంగా) భార్యల్ని మార్చేసుకుందామనిపించింది. మళ్ళీ నాకే సిగ్గేసింది – సుభద్ర మరీ అంత దుర్మార్గురాలు కాదేమో!

ఇంతలో కాఫీ పెట్టడానికి సుభద్ర కిచెన్ లోకి వెళ్ళింది. ఆ కాఫీ వెనుకటి ఆలోచన – తను ఈ మధ్యనే కొన్న పట్టు చీర పంకజాక్షికి చూపించడమూ – ఆ పంకజాక్షి లోలోపల అసూయపడుతుందని తను లోలోపల
సంతోషపడ్డమూను.

‘ఎలా భరిస్తున్నారండీ ఇలాంటి భార్యని?’ మెల్లగా వినిపించిన మాటలకి తలెత్తాను నేను. ఎదురుగా… పంకజాక్షి!

నేనేం మాట్లాడలేదు. ‘మీరేమీ బాధపడకండి…’ అదే స్వరంతో అని నా చెయ్యి పట్టుకుని నొక్కింది తను.

పెళ్ళి కాని వ్యక్తుల మధ్య ప్రేమ ‘ఆకర్షణ’ వల్ల పుడుతుందిట. పెళ్ళయిన స్త్రీకీ, మరో పెళ్ళయిన మగాడికీ మధ్య ప్రేమ ‘అసంతృప్తి’ వల్ల పుడుతుందిట. మరి ఈవిడ ప్రేమ(?)కి కారణం ఆకర్షణా, అసంతృప్తా?

ఈ ఆలోచనల్లో నేనుండగానే, సుభద్ర వంటింట్లోంచి వచ్చింది – రెండు కాఫీ గ్లాసులతో – ఒకటి తనకీ, మరొకటి పంకజాక్షికీ కాబోలు! ఆవిడ అడుగుల చప్పుడు విని పంకజాక్షి సర్దుకుంది. ‘రా వదినా రా! మీ ఆయన కొత్తగా ఏ కథ వ్రాస్తున్నారో అడుగుతున్నా’

 
సుభద్ర ఏ మాత్రం ఆసక్తి చూపించలేదు. అప్పుడనిపించింది నాకు. ఇంతకు ముందు పంకజాక్షితో ఏదైనా వెకిలిగా మాట్లాడి వుండాలని.
 
000
 
నన్ను కథ రాయమన్న మిత్రుడు వచ్చి అడిగాడు ‘ఎందాకా వచ్చింది?’ అని. నిస్పృహగా నవ్వేను.

‘గడువు పూర్తి కావస్తూంది’ చెప్పి వెళ్ళేడు.

ఆ తర్వాత ఆలోచించాను.

ఏదేనా కథ వ్రాయాలీ అన్నప్పుడు, వ్రాయబోయే విషయమ్మీద మంచి అవగాహన ఉండాలి. అమ్మమ్మలో శతాంశమో, అమ్మలో సహస్రాంశమో ప్రేమ చూపించే భార్య నాకు లభించి వుంటే నేను గొప్ప ప్రేమ కథలు వ్రాసి వుండే వాణ్ణేమో! కానీ, నేను ప్రేమ కథలు వ్రాయలేదు. నా కథల్లో మెటీరియలిజం ప్రతిబింబిస్తూ వుంటుంది.

ప్రేమంటే ఏమిటో తెలియకుండానే ఇంత జీవితం అయిపోయింది. పిల్లల్ని కనడమూ, పదిహేనేళ్ళ కాపురం చేయడమూను! అలాగే జీవితం ముగిసిపోతుంది – చాలా మందిలాగే.

ఒంటరితనపు చీకటి ఆవరించిన గుండె గది సంకోచిస్తూంటే అందులోని ఆలోచనలకి క్లాస్ట్రో ఫోబియా (ఇరుకైన ప్రదేశాలంటే తీవ్రమైన భయం ) కలిగి మరణిస్తాయి. మనసు ‘బ్లాక్ హోల్ ‘ అయినపుడు మనిషి ఫక్తు భౌతిక వాది (మెటీరియలిస్టు) అవుతాడు.

ఆ స్టేజికి అడుగు దూరంలో నేనున్నపుడు జరిగింది ఆ సంఘటన.

 
000
రాత్రి పన్నెండయింది. సుభద్ర ముసుగుపెట్టి నిద్రపోతూంది.

పున్నమి అని గుర్తుకొచ్చింది. ఎవరికీ నిద్రా భంగం కలిగించకుండా లేచి,  బయటికి వచ్చాను. వరండాలో నిల్చుని చూస్తుంటే – వెన్నెల జల్లు చాలా అపురూపంగా వుంది. చల్లగాలికి హాయిగా తలలూపుతున్న తరులూ – ముసుముసి నవ్వులు రువ్వుతూన్న విరులూ…

సుభద్రను లేపుదామనిపించింది. ‘అందమైన శరద్రాత్రి, డాబా మీద కూర్చుని కళత్రం చేత్తో ఏ మిఠాయిలో తింటూంటే’… నవ్వొచ్చింది.

‘చాల్లే పడుకో. అర్థరాత్రి మద్దెల దరువనీ’… దీర్ఘం తీస్తూ అటు తిరిగి పడుకుంటుందని తెలుసు. అయినా, మానవ ప్రయత్నం చేద్దామని లోపలికెళ్ళాను.

పదేళ్ళ కొడుకు, అమ్మ మీద చేయి వేసి నిద్రపోతున్నాడు. స్త్రీలకు పెద్ద కొడుకు పుట్టాకే ప్రేమంటే తెలుస్తుందట… ఫ్రాయిడ్ కాబోలు అన్నాడు. ఫ్రాయిడ్ కి ఇలాంటి సుభద్రల సంగతి తెలీదు పాపం !

మెల్లగా పిల్లాడి చేయి తొలగించాను. సుభద్ర కళ్ళు తెరిచింది. తన మొహంలో విసుగు కనిపించింది. ఎలాగూ ముందే ఊహించాను కాబట్టి అంతగా నిరాశ పడలేదు నేను.

 
తను ఏదో చెప్పబోతే, నోటి మీద వేలుంచుకుని, ‘ ష్ ‘ అని వారించాను.  పిల్లల్ని నిద్రలేపడం ఎందుకనిపించింది.

‘మూడ్ లేదు. ఉదయం నుంచీ ఒళ్ళు నొప్పులు. అందునా పిల్లలు నిద్రలేస్తారు కూడాను…’ అని అటు తిరిగి పడుకుంది.

ఛెళ్ళున చరిచినట్లయింది. అనుమానం ముందుపుట్టి, ఆడది తర్వాత పుట్టిందంటారు. అందుకేనేమో! సిగ్గుతో బిక్కచచ్చిపోయాను. అయినా, ఆశ చావక, మళ్ళీ తట్టి పిలిచి, ‘అందుక్కాదూ అన్నాను. ‘మరి?’ ప్రశ్నార్థకంగా చూసింది తను, కోపాన్ని కూడా ముఖంలో ప్రతిబింబిస్తూ.

కోపంలో స్త్రీలు అందంగా ఉంటారన్నది అబ్సర్డ్. ఎవరేనా అలా అంటే, ఆ క్షణానికి స్త్రీలను కరిగించడానికే. విసుక్కుంటూనే నాతో వచ్చింది. డాబా మీదికి పిల్చుకెళ్ళాను.

‘చూడు సుభద్రా! వెన్నెల ఎంత బావుందో! ఏదైనా మాట్లాడుకోవటానికి ఇంతకంటే మంచిసమయం ఎప్పుడు దొరుకుతుంది చెప్పు?’ అన్నాను.’

‘ఏం మాట్లాడుకుంటాం?’ అంది తను, నిద్ర కళ్ళతో నవ్వుతూ.

అనునయంగా అన్నాను – ‘మన జీవితాలు మరీ యాంత్రికంగా తయారవుతున్నాయి. పదిహేనేళ్ళ మన దాంపత్య జీవితంలో ఎప్పుడైనా మనసులు విప్పి మాట్లడుకున్నామా? ఉట్టినే బ్రతకడానికీ, జీవించడానికీ
అదే తేడా. బ్రతకడం జంతువులకీ, చెట్లూ చేమలకీ కూడా చేతనవును.

మరి మనిషికీ, వాటికీ తేడా ఏముంది? ఆర్తీ, అనుభూతీ ఇవేవీ ఉండవు వాటికి. ఇంతకీ నాలో నీకు నచ్చని గుణమేదో చెప్పు. మార్చుకోవడనికి ప్రయత్నిస్తాను. దురలవాట్లంటావా? సిగరెట్లూ, తాగుడా – ఏదీ లేదు.
పేకాట, గుర్రప్పందాలూ ఇవేమీ లేవు. అంతగా నువ్వు నన్ను కోప్పడటానికి, కనీసం నేన్రాసే కథలు కూడా నీకు వినిపించను కదా?’ నవ్వేను. చాలా కాలం తర్వాత… సుభద్ర నవ్వింది. నిద్రమత్తు పూర్తిగా
వదలని, స్వచ్ఛమైన కళ్ళతో.

మళ్ళీ నేనే అన్నాను. ‘మనిద్దరం ఎప్పుడూ పోట్లాడుకోలేదు, కనీసం పిల్లల ముందు. అయినా, బయటికి కనిపించని అగాధమేదో మన మధ్య పెరిగిపోతూంది. నేనిది తట్టుకోలేకపోతున్నాను. జీవితం , అన్నీ ఉండి కూడా, తోక తెగిన గాలిపటంలా, చుక్కాని లేని నావలా, గమ్యం లేని… లేని…’ నేను మరి మాట్లాడకుండా తను అంది.

‘ఇదే నచ్చదు నీలో నాకు’

‘ఏది?’ ఆశ్చర్యంగా అడిగాను.

‘అర్థం కాకుండా మాట్లాడ్డం’

గతుక్కుమన్నాను. నా తత్తరపాటును కప్పిపుచ్చుకుంటూ, ‘ఇంతేనా?’ అనడిగాను.

‘ఊ…’ అని, తను చెప్పసాగింది.

000
 
‘నీ కథలూ, కవిత్వాల విషయానికొస్తే నాకంతగా వాటితో పరిచయం లేదు. ఎప్పుడో నా చిన్నప్పుడు – బహుశా, పదో తరగతిలో అనుకుంటా… సెలవుల్లో చదువుకోవడానికి కౄష్ణశాస్త్రి ‘మంగళ కాహళీ తెచ్చుకుంటే, అమ్మ మందలించింది – ‘ఇవన్నీ ఎందుకే చదువుతావు?’ అని. అటుపై మళ్ళీ కాలేజ్ చదువు ముగిశాక, శ్రీనాథుని ‘శౄంగార నైషధమూ తెచ్చుకున్నాను. అమ్మ తిట్టింది ‘పనికొచ్చేవేవైనా నేర్చుకోకుండా ఇవెందుకే నీకు?’ అని. ఆ రోజుతో మొదలు – వంట నేర్చుకోవడం ‘

ఇంకా చాలా చెప్పింది సుభద్ర.

నాతో మొట్టమొదటిసారి మాట్లాడే అవకాశం దొరికింది శోభనం రోజేనట. కానీ, తనని మాట్లాడనివ్వలేదు నేను. ‘గుండె గొంతుకలోన కొట్లాడుతున్నాది’ లాంటి మాటలూ, అర్థమయీ, కాకుండా మాట్లాడేనట. అప్పుడు నేనంటే కొద్దిగా జంకు కలిగిందిట. అందులోనూ, ఎవరో తన ఫ్రెండు, ‘పెళ్ళి కొడుకు ఏం చేసినా ఒప్పేసుకోకు. కాస్తయినా బెట్టు చెయ్యి’ అని సలహా ఇచ్చి, పుణ్యం కట్టుకుందిట. ఆ రోజు నన్ను బాగా హర్ట్ చేసినా, సారీ చెప్పడానిక్కూడా ఏదో బెరుకుగా ఫీలయ్యిందిట.

నన్ను ‘మీరు’ అని పిలుస్తూంటే, వాళ్ళమ్మ, అంటే మా అత్తయ్య చెప్పిందిట ‘మరీ అంత మర్యాద ఇవ్వనక్కర్లేదులే ఆ కథల పైత్యానికి’ అని. కథలూ, కవితలూ (వాళ్ళకర్థం కానివి) వ్రాస్తుంటాను కాబట్టి, నేను పిచ్చివాణ్ణిట. అలా పిలవడం సుభద్రకు నచ్చక, నేను వ్రాసే కథలపై ఆసక్తి చూపలేదట. అసలు, నేనివన్నీ అనునయంగా అడగడమే ఆశ్చర్యంట. ఇదీ, స్ఠూలంగా తన మాటల సారాంశం.

మాటలకెంత ఇంటెన్సిటీ ఉంటుందో రచయితనయ్యుండీ, నాకంతవరకూ తెలీదు. మనం అవతలి వైపు నుండి ఆలోచించడం మొదలుపెడితే, అనుమానాలన్నీ దూదిపింజల్లా ఎగిరిపోతాయి. మనిషి జీవితంలో చాలా
గొప్ప ఫిలాసఫీ అది. ఇక సంభాషణ ముగింపుకొచ్చేసరికి, తన పట్ల నా ఉదాసీనత గురించి మాట్లాడుతూ కన్నీళ్ళు పెట్టుకుంది సుభద్ర. నాలోని ప్రేమికుడు నిద్ర లేచాదు.

ఇకపై ఏ పంకజాక్షీ నాలో చిత్త చాంచల్యం కలిగించలేదు. నేను పూర్తిగా సుభద్రకే చెందుతాను. తనూ నా దగ్గరకొచ్చింది.

తన చెక్కిలిపైని కన్నీటిచుక్క పై పడ్డ వెన్నెల మెరుగు విశ్లేషణం చెంది, నా ఆనంద బాష్పాన్ని ముద్దాడింది. వెన్నెల మమ్మల్ని అభిషేకిస్తోంది.

భార్యాభర్తల బంధం కలకాలం నిలవాలంటే నమ్మకం ముఖ్యం. ఆ కలకాలం ఏ అనుభూతులూ లేకుండా జీవించడం హీనం కన్నా హీనం. మరి, అలా కాకుండా వుండాలంటే దంపతుల మధ్య ప్రేమ ముఖ్యం.

000
 

 
‘ఏమ్మా, మీ ఆయన లేడా?’ ఎవరో అడుగుతున్నారు. గొంతు పోల్చుకున్నాను – నా స్నేహితుడే.

‘పూజలో ఉన్నారు. కూర్చోండి. వస్తారు’ చెప్తోంది సుభద్ర. నన్ను బహువచనంలో సంబోధిస్తోంది. నాకు నవ్వొచ్చింది. ఈ మార్పు చూసి.

‘వ్రాసేవా?’ ఆత్రంగా అడిగాడు, నేను బయటికి రాగానే. విశాలంగా నవ్వేను.

‘అడుగుతూంటే నవ్వుతావేంటీ, ఈరోజే ఆఖరు, పంపడానికి’ అన్నాడు ఉడుక్కుంటూ.

పూర్తి చేసిన కథ అతనికిస్తూ ‘థాంక్స్ ‘ అన్నాన్నేను.

నేనెందుకు చెప్పానో అతనూహించలేడేమో- అయినా, అది అప్రస్తుతం !

 
000

Your views are valuable to us!