“2008 లో వచ్చిన రెసిషన్ పుణ్యమా ఎన్నో కుటుంబాలు మళ్ళీ సంతోషంగా ఉన్నాయి రా రాయుడూ!” అని పార్క్ బల్లపై కూర్చొంటూ అన్నాడు నరసింహులు.
“మొన్నటికి మొన్న అప్పలసామి కొడుకూ కోడలు వాళ్ళ బుడ్దొణ్ణి వేసుకొని చక్కగా తిరిగి హైదరాబాద్ కి వచ్చేసారు. బిక్కూ బిక్కూ మంటూ అప్పలసామి వాడి భార్య ఉండే వాళ్ళు. ఇప్పుడు చూడు కార్లో మనవాడి తో చక్కగా తిరుగుతున్నారు. “
“ఔనూ వాళ్ళది ఉమ్మడి కుటుంబం కదా, అప్పలసామి తమ్ముల్లిద్దరూ విడిపోయారా?”
“విడిపోయి సంవత్సరం అయింది. వాళ్ళు ఉన్న ఇల్లు అమ్ముకొని ఆ డబ్బుతో మూడు ఫ్లాట్లు కొనుకున్నారు. అప్పల సామి మాత్రం ఇక్కడే వాళ్ళ మావగారు ఇచ్చిన ఈ ఇంట్లోనే ఉంటున్నాడు. వాడి పేరు మీద ఉన్న ఫ్లాటు అద్దెకిచ్చి ఆ అద్దె డబ్బు తన కొచ్చే వడ్డీ డబ్బులతో హాయిగా గడిపేస్తున్నాడు.”
“వాళ్ళ కూతుళ్ళూ కూడా హైదరాబాదే వచ్చేసారటగా?”
“ఔను పోయిన దసరా తరవాత అందరూ హైదరాబాద్ కి వచ్చేసారు. ముగ్గురు కూతుళ్ళు ఒక కొడుకూ మొత్తం 8 మంది మనవలు.”
ఇంతలో అప్పలసామి కూడా అక్కడకే వచ్చాడు. వస్తూనే
“ఏమిటి విషయాలు చాల సేరియస్ గా మాట్లాడుకుంటున్నారు?” అన్నాడు.
నీ గురించేరా అని నరసింహులు అనడంతో…”నా గురించా నాకంత చరిత్ర ఉందా?”
“ఉందిరా నీకు నువ్వు నీ జీవితాన్ని మలచుకున్న విధానమే ఒక చరిత్ర.” అని అప్పలసామి చేతిలోని డబ్బా లాక్కున్నాడు రాయుడు. “ఏమి తెచ్చావు?”
“వాము ఏసిన జంతికలు మా అమ్మాయి తెచ్చింది మనకందరకూ!”
“నీదిరా కుటుంబమంటే!” అని ఒక జంతిక తీసుకో ని అస్వాదించాడు నరసింహులు.
“నేను నమ్ముకున్న దైవం ఆయనపై మాకున్న విశ్వాసం నన్నూ నా భార్యను ఇప్పుడు సంతోషంగా ఉంచుతున్నాయి. పైగా నా భార్య విసుగెరగని ప్రయత్నం, సహాయం మా కుటుంబాన్ని ఈనాడు ఇలా సుఖ సంతోషాలతో ఉంచాయి.” చాల గంభీరంగా చెపాడు అప్పలసామి.
“రాయుడు మన వృద్ధ సంఘానికి కొత్త కొంచెం వివరంగా నేనే చబుతాను” అని మొదలుపెట్టాడు నరసింహులు.
**********