వర్తమానం – ఒక అద్భుత బహుమానం!

Spread the love
Like-o-Meter
[Total: 0 Average: 0]

అప్పలసామి ఈ ఇంట్లోనే (పార్కుకు ఎదురుగా కనిపించే చక్కని డుప్లెక్స్ ఇల్లు అది) నలుగురు పిల్లలనూ తనకున్న చిన్న జీతంలో చదివించి ప్రయోజకుల్ని చేసాడు. ఆఖరి సంతానం కొడుకు. ముగ్గురు కూతుళ్ళూ .  అందరూ వాళ్ళ తెలివితో మంచి ఉద్యోగాలు సంపాదిచాకనే వాళ్ళకు పెళ్ళిళ్ళు చేసాడు.  అమెరికా మోజు అందరికి ఉంటుంది కదా  వాళ్ళ భర్తల తో కలసి వాళ్ళూ అమెరికా వెళ్ళిపోయారు .

ఇద్దరికి  గ్రీన్ కార్డు కూడా ఉంది.  అప్పల సామి వాడి భార్య ఒక్కసారి కూడా అమెరికా వెళ్ళలేదు.  రమ్మనమని చాలాసార్లు అన్నా వెళ్ళలేదు.  ఏమైందో తెలియదు, పోయిన దసరా తరవాత వాళ్ళ పిల్లలందరూ కూడబలుక్కున్నట్లు అమెరికా విడచి హైదరాబాద్ కి వచ్చేసారు .
 
రాగానే వాళ్ళు స్వంతం గా ఒక్కొక్క అపార్ట్మెంట్ కూడా కొనుక్కున్నారు. ఒక్కొక్కళ్ళూ ఒక్కొక్క చోట సిటీలో ఉంటారు. వీడి కొడుకు కూడా ఒక అపార్ట్మెంట్ కొనుక్కొని అక్కడే ఉంటున్నాడు. పోయిన దీపావళి రోజు రాత్రి ఈ అప్పలసామి ఒక అద్బుతమైన ఉపన్యాసం ఇచ్చాడు అంతే మొత్తం మారిపోయింది.

“ఏమా ఉపన్యాసం ఏది మారిపోయింది?” అని ఉత్సుకతో రాయుడు అడగ్గా …

**********

“చాల సంతోషం పిల్లలూ మీరంతా తిరిగి హైదరాబాద్ రావడం తో మాకు ఎంతో ఆనడం కలిగింది. నా వయసు అరవై ఎనిమిది మీ అమ్మ లేక అత్త వయసు అరవై రెండు. ఇంకా మేము మా పనులు  మేమే చేసుకుంటూ నేనొక  పదేళ్ళు తనొక పదిహేనేళ్ళు బతుకుతాం అని అనుకుంటున్నాము. అంటే మే మిద్దరం కలసి ఒక పదేళ్ళు మీముందు ఉంటాము.
ఈ ముసలి వాళ్ళ కు ఒక చిన్న కోరిక మీరు నేరవేరుస్తారని చెబుతున్నాను.”

“చెప్పండి నాన్నగారు!” – అని పెద్ద కూతురు అనడంతో,

“నాకు భగవంతుడి దయవల్ల ఎనిమిది మంది మనవలు. ఇంకో ఏడు గడిస్తే బహుశః తొమ్మిది మంది మనుమలు. మా  ఇద్దరకూ మా అందరి మనుమల పుట్టిన రోజులు, పండుగలు, ఇక్కడే ఈ ఇంటిలోనే జరుపుకోవాలని ఉంది.  మా వియ్యలవారిని కూడా వారి వారి మనుమల పుట్టిన రోజులకు సాదరం ఆహ్వానిస్తాము. మీకు మా పై ప్రేమ ఉన్నది అని చెప్పడానికి మీరు మా ఈ చిన్ని కోరికను తీర్చాలి.

నాకు వస్తున్నా వడ్డీ డబ్బులు ఈ పుట్టిన రోజులు జరుపునేలా చేస్తాయి. నా తదనంతరం మీ అమ్మకు నా ఎఫ్.డీ ల పై వడ్డీ లు నాకు వచ్చే పెన్షను మీ అమ్మకు వస్తుంది. తన తదనంతరం ఉన్న సొమ్ము అంతా  మీ అందరకూ సమానంగా చెందుతుందని మీ అమ్మ  నేను సంతకం పెట్టిన రెండు వీలునామలు ఇవిగో. ఎందుకంటే ఎవరం ముందు పోతామో తెలియదు కదా అందుకని లాయర్నఅడిగి  మరీ  వ్రాసాము.

ఇంకా క్లుప్తంగా చెప్పాలంటే మరొక్క పది సంవత్సరాలు లేదా మేము బతికి ఉన్నన్ని నాళ్ళు మా మనుమల పుట్టిన రోజులన్నీ ఇక్కడే జరగాలి అలాగే మీ మేరేజి డే లు కూడా మీకు సమ్మతమైతే ఇక్కడే జరగాలి. అలా మన ఇంటిలో సంవత్సరంలో తొమ్మిది పుట్టిన రోజులు, నాలుగు మేరేజి డేలు ఇంకా మాపై ఎక్కువ మీకు ప్రేమ ఉంటే మీ పుట్టిన రోజులు కూడా ఇక్కడే జరగాలి .  అంటే 17 పుట్టిన రోజులు 4 మేరేజి డేలు వెరసి ఒక ఏడాదిలో 21 రోజులు ఇక్కడ మనమంతా కలసి ఉంటాము. 

అలాగే పండుగలు కూడా అంటే ఉగాది, రామ నవమి, మహాశివ రాత్రి,  కృష్ణాష్టమి, వినాయక చవితి, విజయ దశమి, దీపావళి, కేదార వ్రతం ఇక మన పెద్ద పండుగ నాలుగు రోజులూ కలసి మొత్తం 12  పర్వ దినాలు – మీకు వీలుంటే – ఇక్కడ జరుపుకోవాలి. మళ్ళీ చెబుతున్నాను మా వియ్యాల వారిని కూడా ఆహ్వానిస్తాము. ఇలా సం. లో  33 రోజులు పండగ వాతావరణం ఈ మన ఇంట్లో వెలసిల్లాలని  కోరుకుంటున్నాము” అని ముగించాడు అప్పల సామి .

 
అప్పల సామి భార్య చాల తెలివైనది మృదు స్వభావి పైగా చక్కగా మాట్లాడుతుంది.  ఆమె పేరు శారద. ఆమె అందుకొని:
 
“మీ నాన్నగారు/ మీ మామయ్యా గారు కొంచం పేరాశకు పోయారు అని మీరు అనుకొంటే ఈ 33 రోజుల్లో కనీసం 11 రోజులైనా  మీరందరూ మాముందు కdaలాడుతూ ఈ ఇంట్లో సంతోషంగా గడపాలి. ఇది నా ఆశ.  చివరకు మిగిలేవి కలకాలం గుర్తుంచుకోనేవి ఇలా మనం ఆనందంగా గడిపిన క్షణాలే కదా.  పైగా మేము మిమ్మల్ని 365 రోజులలో కనీసంగా 11 రోజులు మాతో గడపమనడం పేరాశ కాదనే అనుకుంటాను. ఏమో ఆయన చెప్పినట్లు ఇంకా మేము కలసి 10 ఏళ్ళు ఉంటె ఆ 110 రోజుల కోసం  ఈ పది ఏళ్ల కాలం గడిపేస్తాము. ఒక వేళ ఇంకా ముందుగానే వెళ్ళిపోతమేమో !! కనీసం మీతో గడిపాము అనే సంతోషం మిగులుతుంది.” అని ముగించింది.
 
పెద్దల్లుడు వాసు కలగజేసుకొని “అత్తయ్య! మీరు, మామయ్య గారు ఇంతగా చెప్పాలా మాకు. కాని మీరు లెక్కల్లో ఒక పొరపాటు చేసారు. మొత్తం 33 కాదు 36 – మీ ఇద్దరి పుట్టిన రోజులు మీ పెళ్లి రోజు కలుపుకొని.  దేనికి వీలు కాక పోయినా ఈ మూడు రోజులకు తప్పక వస్తాను నేను. ఇక మీ మనుమల పుట్టిన రోజుల పై మీకు పూర్తి అధికారం ఉంది. వాళ్లకు మీ దగ్గిరే  జరుపుకోవాలి ఉంటుంది. మీ ఆశీస్సులు మాకు కావాలి కనుక మా పెళ్లి రోజున మిమ్మల్ని కలవకుండా ఉండం.  ఇంకొక్క మాట. మీ ఆలోచన నాకు చాల బాగా నచ్చింది. మాకు ఇది మార్గదర్శకం కూడా.”

“తాతయ్య! నేను ఫస్ట్ రాంక్ తెచ్చుకున్నాక కూడా ప్రతి సారి ఇక్కడే పార్టి చేయాలి!” అని పెద్ద మనుమరాలు అంటే…
చిన్న మనుమడు కాశీ “ఇక్కడే ఎప్పుడూ ఉండిపోతే పోలా  ఇక్కడే హ్యాపీ గా ఉంటుంది” అని అన్నాడు.   అందరూ గొల్లుమని నవ్వేసారు.

శారద కళ్ళు వత్తుకుంది…మనుమడిని అక్కున చేర్చుకుంది.

**********

Your views are valuable to us!