“గురూ!”
“ఏమి శిష్యా!”
“నిన్న అవధాని గారు అడ్డరోడ్డు దాటిన నిజాల్ని చెప్పారు. విన్నారా గురూ!”
“కన్నామురా!”
“నా తలలో కొన్ని నాలుకలు మాట్లాడుతున్నాయి. చెవిలో ఊదమంటారా?’
“అక్కు శిష్యపక్షీ! పరోపకారమే మన వ్రతమురా…పబ్లిగ్గానే ఊదరా!”
“అవశ్యం గురూ! మీరు మహాజ్ఞానులు, ఘన విశ్లేషకులు, శ్లేషార్థ కోవిదులు. మీరు చెబితేగానీ నా అనుమానం తీరదు.”
“హుహుహు…కానిమ్మురా!”
“అఫ్జల్ గురూని ఉరి తీయలేదెందుకని అవధాని గారడిగారు. మీరు వివరిస్తే ధన్యుణ్ణౌతాను గురూ!”
“శిష్యా! ఆదిశంకరులేమన్నారురా?”
“అహం బ్రహ్మాస్మి అన్నారు గురూ.”
“అంటే మానవుడే ఈశ్వరుడని గదురా అర్థం?”
“అవును గురూ!”
“గాంధీతాత ఏమన్నాడురా?”
“ఈశ్వర్, అల్లా తేరో నామ్. సబ్ కో సన్మతి….”
“చాలు శిష్యా! ఈశ్వరుడే అల్లా ఐనప్పుడు, అఫ్జల్ గురూ సైతం దేవుడేగా! దేవుణ్ణి ఎవరైనా ఉరి తీస్తారురా?”
“గురూ! ఇదేదో ఘోర, పాతక తాత్పర్యంలా ఉందే. నమ్మమంటారా?”
“మూర్ఖా! నువ్వు నమ్మితే ఎంత? తుమ్మితే ఎంత? సోనియాంబాళ్ మనసా, వాచా నమ్మిన సిద్ధాంతం ఇదేరా.”
“కసబ్ కేసు కూడా డిట్టోనే అనుకోమంటున్నారా?”
“సగటు భారతీయుడా! ఇంత బతుకూ బతికి ఆ మాత్రం పోల్చుకోకపోతే ఈశ్వరులెందుకు, అల్లాలెందుకు?”
“ధన్యుణ్ణి గురూ! సన్మతి ఇప్పుడే దక్కింది! అవధానిగారు మరో చెప్పుదెబ్బ కూడా కొట్టారు. ఉరుమురిమి మంగలం మీద పడ్డట్టు ఈ తీవ్రవాదుల్ని వదిలి గాంధేయవాది అన్నా ను ఎందుకు జైల్లో పెట్టారని?”
“అవధానిగారికి ఆవేశమెక్కువైనట్టుంది శిష్యా! నిత్యానంద సేవా టికెట్టు కొంటే కుదుటబడొచ్చు!”
“గురూ! ఇప్పుడు మార్కెటింగ్ అవసరమంటారా?”
“అక్కు శిష్యా! అదేరా మతలబంటే. సరే నీ సందేహం తీరుస్తాను. అవధాని గారి చేత టికెట్టు కొనిపిస్తావురా?”
“తప్పక కొనిపిస్తాను గురూ! మీరు కానివ్వండి.”
“అన్నా పేరులో గాంధీ ఉందేమిరా?”
“లేదు గురూ. సోనియాకు, యువరాజా వారికీ ఉంది గురూ!”
“బ్రతక నేర్చినవాడివేరా! అలా గాంధీ పేరు పేటెంటైన వాళ్ళకి వ్యతిరేకంగా ఉద్యమాలు లేవదీయడమా? వాళ్ళ పాదసేవకుల్ని నిలదీయడమా? ప్రధానమంత్రిని ఒక ఆర్డినరీ మంత్రితో పోల్చడమా? ఇదేనా గాంధేయవాదం?”
“హే రామ్!”
“ఆయాసమొస్తోందా శిష్యా?”
“హా రామ్!”
“అదిగో అవధాని గారొస్తున్నారు. ఇదిగో నిత్యానంద సేవా టికెట్. విజయోస్తు!”
“మర్…గయా రామ్!”
* * * * *