పాపం మన రాజకీయ నాయకులు!
వీళ్ళ బ్రతుకులు అరిటాకులైతే, బంధువులు మాత్రం ముళ్ళే. పకడ్బంది ప్రణాళికలతో ఎన్ని ముందు జాగ్రత్తలు తీసుకున్నా అవినీతి ఆరోపణలు వీళ్ళ వీపు విమానం మోత మోగిస్తూనే ఉన్నాయి. ఆదర్శ్ సొసైటీ కుంభకోణంలో మరో కోణం ఈ చేదు నిజాన్ని మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి అశోక్ చవాన్ కు అరటిపండు వొలిచి చేతిలో పెట్టినట్లుగా వివరించింది.
ఈయనెప్పుడో మహారాష్ట్ర రెవెన్యూ మంత్రిగా ఉన్న సమయంలో, ఈయన అత్తగారు ఓ ట్రాఫిక్ పోలీసు కమిషనరు నుంచి అక్షరాలా అరవైఐదు లక్షలు అప్పు తీసుకున్నదిట.. అదీ ఆదర్శ్ సొసైటీలో ఓ ఫ్లాటు కొనుగోలుకు. విచిత్రం కాకపోతే మరేమిటి, అత్త తీసుకున్న అప్పుకు అల్లుడిని బాధ్యుడినెలా చేస్తారని కదూ మీ ప్రశ్న. అప్పిచ్చిన ఆ పోలీసు అధికారికి ఆదర్శ్ సొసైటీలో ఫ్లాటు కేటాయింపబడేట్లుగా ఈ రెవెన్యూ మంత్రిగారు చొరవ చూపించారట!
అరవైఐదు లక్షలు అప్పు తీసుకున్న అత్తగారు బానే ఉన్నారు… అరవైఐదు లక్షలు అప్పు ఇచ్చిన పోలీసు అధికారి బానే ఉన్నాడు… మధ్యలో నా ఉద్యోగానికి ఎసరొచ్చిందని చిటపటలాడిపోతు తలపట్టుకు కూర్చున్నాడట అరిటాకు సారీ.. అశోక్ చవాన్.