చిటపటలు-09 “డిగ్గీ మంత్రదండం రాజా”

Spread the love
Like-o-Meter
[Total: 0 Average: 0]

మంత్రి పదవి లేకపోయినా, తన దగ్గర మంత్రదండం ఉన్నదని నిరూపిస్తూ డిగ్గీరాజా ఇప్పటిదాకా ఎన్నెన్నో మహిమలు చూపించారని మనకు తెలుసు కదా! ఇప్పుడు లేటెస్టుగా, బాబా రాందేవ్ అనుచరుడు బాలకృష్ణ దగ్గర చట్టవ్యతిరేకంగా పాస్ పోర్టులు ఉన్నాయని, అతను భారతీయుడు ఎంతమాత్రం కాదని, నేపాల్ నుంచి పారిపోయి వచ్చిన నేరస్థుడని, అతని దగ్గర తుపాకి కూడా ఉన్నదని దండ మహిమతో డిగ్గీరాజా నిన్న ప్రెస్ కాంఫరెన్సులో ఓ రీలు వేసేసారు. అంతకు ముందు అలానే, కాషాయంలో ఉన్న బాబా రాందేవ్ ఓ వ్యాపారస్తుడని, చట్ట వ్యతిరేకంగా కోట్ల డబ్బు కూడబెట్టాడని, హరిద్వార్ లో ఉన్న ఆశ్రమం కూడా ఆక్రమించి కట్టిందని ఓ రీలు చూపించారు.

ఇలా సీరియల్సులా కాకుండా ఒక్కసారే డిగ్గీరాజా ప్రభుత్వానికి సినిమా చూపిస్తే ఓ పనైపోతుందిగా! ఈయన మంత్రదండ మహిమలకు చెవులు వాచిపోయినవాళ్ళు మాత్రం డిగ్గీరాజాకో మంత్రి పదవి పడేస్తే మంత్రదండం మూసుకు కూర్చుంటుందనే అభిప్రాయం వ్యక్తం చేస్తూ కాకుల్లా నోరుపారేసుకుంటున్నారుట.

* * *

ఈ నిర్వాకంలో కేంద్ర ప్రభుత్వానికే కాక, ఢిల్లీ పోలీసులకు కూడా మంత్రందండం అవసరం చాలా ఉన్నదని తెలుస్తుంది. రాంలీల మైదానంలో దాడి చేసిన రోజు, బాబాకు అనుమతి ఇచ్చింది రాజకీయ ఒత్తిడివల్ల అని, ఇప్పుడు కూడా రాజకీయ ఒత్తిడివల్లే భగ్నం చేసామని పోలీసులు చెప్పారు. ఆ మర్నాడు బాబా ప్రాణాలకి ముప్పు పొంచి ఉన్నదనే కారణం చెప్పారు. ఇప్పుడేమో, విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా ప్రసంగాలు చేస్తున్నందు వల్ల ఆపేసామని చెబుతున్నారు. ఈ “చిదంబర” రహస్యం కాకులకెలా తెలుస్తాయి, కపిల్ సిబ్బల్ కూడా చెప్పకపోతే!

* * *

కపిల్ సిబ్బలీయం మరో కొత్త ప్రశ్న సంధించింది. కాషాయం వేసుకొని కాసుల కోసం కక్కుర్తిపడే సన్యాసికి రాజకీయాలెందుకు అని. బాబా మీద దాడి వల్ల తాము హిందువులకు వ్యతిరేకమని పడబోయే ముద్ర నుంచి తప్పించుకోవచ్చని ఊహించి ఆమేరకు పూరీనో ద్వారకానో శంకరాచార్యను కలిసి, ఆయనతో కూడా అదే ప్రశ్న వేయించింది. ఆ ప్రశ్నే శంకరాచార్యులవారికి వర్తించదా అని కాకులు గోల పెట్టటం విశేషం. యోగా చేసుకునే సన్యాసికి రాజకీయాలు అనవసరమైనప్పుడు, రాజకీయ సన్నాసులకి సత్యసాయిబాబాలతోను, శంకరాచార్యులతోను పనేముంది అని అడుగుతాననుకున్నారా? నేను అడగనంటే అడగను. ఆ విషయమేదో మంత్రదండాన్నే అడిగేయండి.

Your views are valuable to us!