నిన్న ఎన్.డి.టీవి బర్ఖాదత్ మన మంత్రదండాల డిగ్గీరాజాను ఇంటర్వ్యూ చేసింది. ఆ ఇంటర్వ్యూలో డిగ్గీరాజా మంత్రదండంతో తెలిసిన రహస్యాలను లాజికల్ గా కూడా పరిష్కరించేసారు! అన్నాహజారే, రాందేవ్ బాబాలను వెనకుండి నడిపిస్తున్నది ఆరెస్సేస్సే అని ఎలా తెల్సిందని అడిగితే ఆయన తార్కిగంగా చెప్పిన విషయం విన్న వాళ్ళకి ఒళ్ళు గగుర్పొడిచే ఉంటుంది.
అన్నాహజారే నిరాహార దీక్ష చేసిన వేదిక మీద “భారత మాత” చిత్రపటం ఉందిట. అలానే, రాందేవ్ బాబా దీక్షా సమయంలో చేసిన ప్రసంగాల్లో పదే పదే “భారత్ మాతాకి జై” అని నినాదాలు చెసాడట. ఒక్క ఆరెస్సెస్ వాళ్ళు తప్పించి మరెవరూ భారతమాత చిత్రపటాన్ని ప్రదర్శించటం కానీ, భారత్ మాతాకి జై అనే నినాదాలు కానీ చేయరని.. కాబట్టి అన్నా, బాబాల వెనుక ఆరెస్సెస్సే ఉన్నదని తీర్మానించారు. నిజమే, ఎక్కడో అంగారక గ్రహం మీద నుంచి ఊడిపడ్డ మతోన్మాద ఆరెస్సెస్ కు అవినితీ మీద అందోళనలు చేసే హక్కు మనం ఎందుకివ్వాలి.
అసలైన సందేశాన్ని మాత్రం కాకులు పలురకాలుగా విశ్లేషిస్తున్నాయని సమాచారం. ఆ విషయాలేమిటంటే, మన రాజకీయ నాయకులకు పంతాలు పట్టింపులపై ఉన్నంత ఆసక్తి ఫలితాలపై ఉండదు. ఇక నుంచి దేశంలో ఎవరు ఏ ఉద్యమం జరపాలన్నా అక్కడ ఓ గాంధీ తాత ఫొటో పెడితేనే ఆ ఆందోళనకు ఓ అంథెంటిసిటి వస్తుంది. ఇంకా గట్టిగా చెప్పాలంటే, సోనియా మాత ఫొటో, రాహుల్ బాబా ఫొటో పెడితే, ఉద్యమం ఫలించి తీరుతుంది. ముఖ్యంగా ప్రతిపక్షాలన్నీ ఈ విషయాన్ని గ్రహించాలి.
* * *
డిగ్గీరాజా ఏమైనా అంటే అన్నాడని విలవిల్లాడిపోతా కానీ, ఆయన మాటల్లో నిజం ఎందుకని గుర్తించలేకపోతున్నాం? ఢిలీ పోలీసులు రాందేవ్ బాబాను తన్ని తరిమేస్తే, భా.జ.పా. అదో పండుగలా జరుపుకోవటం ఏమిటి? పెళ్ళి ఊరేగింపుల్లోలా డాన్సులు చేయటం ఏమిటి? అందులోను, బాపూజి సమాధి దగ్గర! గాంధీజీ ఆత్మ ఎంత క్షోభించి ఉంటుంది? సమయం, సందర్భం, స్థలం పట్టించుకోకపోతే ఎలా?
ఇదేమైనా ఎన్నికల సీజనా ఎక్కడపడితే అక్కడ గానాబజానాలు మొదలేయటానికి, తొడలు గొట్టి మీసాలు మెలేయటానికి? పోనీ, చేసే డాన్సైనా సక్రమంగా ఏడ్చిందా అంటే అదీ లేదు. పాటైనా షీలాకి జవానీనో, మున్ని బద్నామో అయినా కాదు. పోనీ ఇందిరాగాంధి లాగా నెత్తిన కడవలో కుండలో పెట్టుకొని చేసారా అంటే అదీ లేదు. కనీసం సోనియాలానో మిచెలీ ఒబామాలానో సక్రమంగా స్టెప్పులైనా ఉన్నాయా అంటే అదీ లేదు. దేని కోసం ఇంత సంబరం చేసుకోవటం? మన్మోహన్ పిలక గుప్పిట్లోకొచ్చిందనేగా ఈ హడావుడీ అంటా. మరి, నీ పిలక నా చేతిలో ఉందని వెక్కిరిస్తే చిన్న పిల్లోడికైనా కోపం రాదా ఎంటి?