చిటపటలు-13 “కమ్యూనిస్టు శంఖాలు”

Spread the love
Like-o-Meter
[Total: 0 Average: 0]

అవినీతికి వ్యతిరేకంగా అన్నా హజారే, నల్లధనం వాపసు తీసుకురావాలని రాందేవ్ బాబాలు కాంగ్రెస్ ముందు శంఖాలు ఊదుతున్న సంగతి తెలిసిందే. ఆ చప్పుళ్ళకి కాంగ్రెసీయులైతే బెదరలేదు కానీ, కమ్యూనిస్టులకు మాత్రం బల్బులు వెలిగినట్లున్నాయి. జులై 15 నుంచి 21 దాకా ఆ శంఖాలూదే పని ఊరూవాడల్లో తామే చేస్తామని ప్రకటించారు. అవినీతి, నల్లధనంతో పాటు పనిలో పనిగా ఎన్నికల సంస్కరణలు కూడా జరగాలనే డిమాండుతో ఏడు రోజుల ఉద్యమం చేస్తారట! వేసంకాలం ఓ వారం రోజులు సెలవు పెట్టి గుండు కొట్టించుకోటానికి మనం తిరుపతి వెళ్ళినట్లు, పాపం వీళ్ళ మొక్కులు వీళ్ళకి ఉంటాయి కాబోలు.

* * *

మల్కాజ్ గిరి ఎం.పి. సర్వే సత్యనారాయణ, రాష్ట్ర మంత్రి శంకర్రావ్ నీకు పిచ్చంటే నీకే పిచ్చని కిందామీద పడుతున్నారట. ఎవరు పెద్ద పిచ్చోళ్ళో డిగ్గీరాజా మంత్రదండమే చెప్పాలి. అన్నట్లు, రాహుల్ ప్రధానయ్యేదాకా మఠం వేసుకొని మూల కూర్చోమని డిగ్గీరాజాకు బుద్ధి చెబుతూ గడ్డి పెట్టిందట సోనియమ్మ మంత్రదండాన్ని మెడకు చుట్టేస్తూ..

* * *

కాంగ్రెసీయుల పంచెలూడదీసి మరీ కొడతామని మొన్న ఎన్నికల్లో బీరాలు పోయినా, కాంగ్రెస్ పంచె కట్టుకోవటం తనకిప్పుడు గర్వంగా ఉందని చంటబ్బాయ్ ప్రకటించాడు. పంచె కట్టగానే, సమాచార హక్కు, విద్యా హక్కు, ఉపాధి హామీ అన్నీ లభించేసాయని కూడా గర్వించాడు. సమాచార హక్కు వల్ల పంచె సౌకర్యంగా ఉంటుందనే విషయం తెలిసిందని, రెండేళ్ళల్లో నేర్చుకున్నది కూడా పంచెలోని సౌలభ్యం ఎలా ఉంటుందోనని, ఇక జులైలో తనకు కేంద్రంలో ఉపాధి కలగటమే తరువాయి అని సోనియమ్మ మీద అభిమానాన్ని ఆవేశంగా ప్రకటించాడు.

పనిలో పనిగా, జగన్ వెనకాల ఉన్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలు దమ్ముంటే రాజీనామా చేసి మళ్ళీ ఎన్నికవ్వాలని ఎడమ తొడ కొట్టి మరీ ఛాలెంజ్ చేసాడట చంటబ్బాయ్. కుడి తొడ ఆల్రెడీ వాచిపోయినట్లుందిగా కడప, పులివెందుల ఎన్నికల్లో అని టింకర్రావు గొణుక్కుంటున్నట్లుగా కూడా తెలిసింది.

Your views are valuable to us!