రాష్ట్ర కాంగ్రెస్ ను యువరక్తంతో నింపే దిశగా రాష్ట్ర పి.సి.సి. అధ్యక్షుడు ప్రయత్నాలు చేస్తున్నాడట. యువరాజును మోయటానికైనా, యువనేతను తోయటానికైనా ఇప్పుడున్న నేతల్లో చేవ చచ్చిందని, అందుకే వారి వారసులకు వల వేస్తున్నాడని గిట్టనోళ్ళు కోళ్ళలా కూస్తున్నట్లు సమాచారం.
కేంద్రంలో కూడా కాంగ్రెస్ నేతలు ఆ దిశగానే పావులు కదుపుతున్నట్లు భోగట్టా. అందులో భాగంగానే, నిన్నటి దాకా గాలిపటాలు ఎగరేసిన నలభై ఒక్క ఏళ్ళ యువరాజు చేత ఈసారి జెండా ఎగరేయిస్తారట.
* * *
కాంగ్రెస్ పంచలో చేరి, కాంగ్రెస్ పంచె కట్టి సోనియా పెట్టే శఠగోపం కోసం ఆర్నెల్లుగా ఇంట్లోనే గర్వంగా ఎదురుచూస్తున్న చంటబ్బాయికి మొత్తానికి ముహూర్తం కుదిరినట్లుంది. ఈ నెల ఇరవైన యువరాజు ఇచ్చే తీర్ధం పుచ్చుకోటానికి మరోసారి గర్వంగా ఎదురుచూస్తున్నాడట కాంగ్రెస్ గేట్ల వంక, గొళ్ళేల వంకా.! ప్రసాదంగా దద్ధోజనమే దక్కేనో, చక్రపొంగలే దక్కేనో!
* * *
చెడు అనవద్దు, చెడు వినవద్దు, చెడు కనవద్దు అనే గాంధీ మూడు కోతుల సూత్రాలని మన ప్రభుత్వాలు అవినీతి పరంగా ఎంత చక్కగా పాటిస్తున్నాయో చూడండి.
మన్ మోహన్ సింగ్ – మాట్లాడమన్నా మాట్లాడడు*
యడ్యూరప్ప – వినమన్నా వినడు
కరుణానిధి – చూడమన్నా చూడడు.
గాంధీ చెప్పని నాలుగో కోతి, మరిచిపోతుంది కూడా!
*(ఇంటర్నెట్ మెయిల్స్ ఆధారంగా…)
* * *