చిటపటలు-18 “తుగ్లక్ ల చేత, తుగ్లక్ ల కొరకు, తుగ్లక్ ల వలన…”

Spread the love
Like-o-Meter
[Total: 0 Average: 0]

ఏకు మేకవ్వటం మనకు తెల్సిందే. కొన్ని నెలల క్రితం కొన్ని వందలమందితో జంతర్ మంతర్ దగ్గర అన్నా నిరాహార దీక్ష చేసారు అవినీతికి వ్యతిరేకంగా. దేశవ్యాప్తంగా వేలాదిమంది ఆయనకు బాసటగా నిల్చారు. ప్రభుత్వం దిగొచ్చింది. లోక్ పాల్ బిల్లు ముసాయిదా కమిటీలో చోటు కల్పించింది. అప్పటికే మహారాష్ట్రలో మహామహులనదగ్గ నేతలను అవినీతి కారణంగా మట్టి కరిపించిన అన్నాను తక్కువ అంచనా వేసి, కేంద్ర ప్రభుత్వం తీరిగ్గా పొగ బెట్టింది. ఢాక్కాముక్కీలు తిన్న అన్నా అక్కడితో వదిలేస్తే మేకు ఎలా ఔతాడు… బాబా రాందేవ్ ఔతాడు కానీ…

ప్రభుత్వం ప్రతిపాదించిన ముసాయిదా వల్ల వీసమెత్తు ఉపయోగం లేదని గాండ్రించాడు. డేటు, టైము, ప్లేసు అన్నీ చెప్పి మరీ ఆమరణ దీక్ష చేస్తానని ప్రభుత్వాన్ని హెచ్చరించాడు. మళ్ళీ, ఇదేదో రాందేవ్ వ్యవహారమేలే అని ప్రభుత్వం మరోసారి తక్కువ అంచనా వేసి, బురిడీ కొట్టేసింది. ఇక్కడో కధ చెప్పుకుందాం.

అక్బర్ తో ఒకసారి యాధాలాపంగా బీర్బల్ అంటాడు “ఒక్కోసారి తప్పు చేయటం కన్నా, ఆ తప్పుకు ఇచ్చే సంజాయిషీ అపాయకరంగా ఉంటుంది జహపనా” అని. నిరూపించకపోతే తల తీస్తానంటాడు అక్బర్. సీను మారింది. అక్బర్ పూలతోటలో విహరిస్తూ ఉంటాడు. వెనక నుంచి బీర్బల్ వచ్చి పాదుషా పిర్ర గిల్లుతాడు. ఏదోలే పొరపాటేమో అని కొంచెం ముందుకు వెళ్తాడు అక్బర్. మళ్ళీ గిల్లుతాడు బీర్బల్. ఆగ్రహంతో ఊగిపోతాడు అక్బర్. ఎందుకు గిల్లావని అడిగితే, “క్షమించండి జహపనా, మీరనుకోలేదు, మహారాణి వారనుకున్నాను” అంటాడు.

ఇప్పుడు ప్రభుత్వం పరిస్థితి కూడా దాదాపు ఇదే. ఏకులా ఏదో నిరాహార దీక్ష చేస్తా అంటున్నవాడిని గిల్లింది ప్రభుత్వం. ఆనక, ఆయన శాంతిభద్రతల సమస్యగా పరిణమిస్తాడని అరెస్టు చేసామని సంజాయిషీ ఇచ్చింది. మొన్నటిదాకా వేలల్లో వెంట నడిచిన ప్రజలు ఒక్కసారిగా లక్షల్లో మద్దతుగా నిలుస్తున్నారు అన్నాకు. అడకత్తెరలో పోకచెక్కలా ఉన్న ప్రభుత్వం పరిస్థితి చూస్తుంటే, యాభై ఏళ్ళకు పైగా దేశాన్ని పరిపాలించిన కాంగ్రెస్ ఇంతటి దివాలాకోరు రాజకీయాలు నడుపుతున్నదా అని ఆశ్చర్యం కలుగుతున్నది.

అన్నాను అరెస్టు చేయమన్న దద్దమ్మలెవరు? ఆ పని చేసి ఆనక సంజాయిషీల మీద సంజాయిషీలు ఇప్పించిన చవటలెవరు? చివరికి వదిలేయమని చెప్పిన తుగ్లక్ లెవరు? చూస్తుంటే, తుగ్లక్ ల చేత, తుగ్లక్ ల కొరకు, తుగ్లక్ వలన మనం పరిపాలించబడుతున్నట్లుంది.

అయ్యా తుగ్లక్ మోహన్ సింగ్ గారు…. కపిల్ సిబల్సు, చిందంబరాలు, అభిషేక్ సింఘ్వీలు పదవులు పోయినా ప్రాక్టీస్ చేసుకు బతుకుతారు. వీళ్ళ సలహాలతో తమరు చరిత్రలో జోకర్ గా నిలబడటమే కాకుండా అమ్మకు, యువరాజుకు భారత్ లో బఠాణీలు అమ్మే పరిస్థితి కలిగిస్తున్నట్లున్నారు. జర భద్రం.

Your views are valuable to us!