ఒక్క పేకాటే కాదు, మన రాజకీయాల్లో కూడా జోకర్ల పాత్ర ఎంతో ప్రభావవంతమైనదే. ముఖ్యంగా ఎస్పీ, బిఎస్పీ, ఆరెల్డీ లాంటి పార్టీలు పేకాటలో జోకర్లకన్నా ప్రతిభావంతమైన పాత్రను మన రాజకీయాల్లో పోషిస్తున్నాయి. చిల్లర వర్తకంలో ఎఫ్.డి.ఐ. విషయానికే వస్తే, దీనివల్ల రైతులకు, చిన్నవ్యాపారులకు, సాథారణ ప్రజానీకానికి కలుగబోయే కష్టాలన్నీ అంకెల్లో వర్ణించి మరీ ఎస్పీ, బిఎస్పీలు కన్నీరు కార్చేసాయి. విసిగి వేసారి వాకౌట్ చేస్తున్నామని ప్రకటించాయి.
ఎస్పీ బాబాయిల్ని, బిఎస్పీ, పిన్నులని నిన్నంతా టీవీ ఛానళ్ళల్లో ఇంటర్వ్యూలు చేసారు. సుఖంగా ఉన్న చిల్లర వర్తకులని చూసి ప్రభుత్వం కళ్ళల్లో నిప్పులు పోసుకుంటున్నదని మళ్ళీ కన్నీరుమున్నీరుగా విలపించేసారు. బాబాయిలు, పిన్నులు మరి ఇంత ఛండాలమైన బిల్లును లోక్ సభలో వ్యతిరేకిస్తూ ఓటు వేస్తే బాగుండేది కదా అంటే, అలా చేస్తే భా.జ.పా. లాంటి మతతత్వ పార్టీలకు చేయూత నిచ్చినట్లౌతుందని, అది దేశ లౌకికత్వానికి ముప్పని టీవీ యాంకర్లను, చూస్తున్న ప్రజానీకాన్ని ఉర్రూతలూగించారు!
అసలు విషయం అది కాదని, భా.జ.పా.లాంటి పార్టీల్లోని కాకులు కోళ్ళై కూసాయి. వాళ్ళ అనుమానం ప్రకారం, ములాయం తోక, మాయావతి పిలక అవినీతి రూపంలో కాంగ్రెస్ చేతుల్లో చిక్కుకుపోయింది. అటు కాంగ్రెస్, వాళ్ళిద్దరినీ సి.బి.ఐ. గొలుసుతో కట్టేసి, మార్నింగ్ వాకులకు వెళ్ళినప్పుడు, ఈవినింగ్ వాకులకు వెళ్ళినప్పుడు వెంట తిప్పుకుంటున్నదట!
ఏదేమైనా, ఇటువంటి జోకర్ పార్టీలు మాత్రం, ఒక కాలు వాళ్ళ రాష్ట్రంలో, మరోకాలు పార్లమెంటులో, మూడో కాలు మూడో ఫ్రంటులో పెట్టి, నాలుగో కాలెత్తి ప్రజల మీద పన్నీరు చల్లుతున్నామని పోజులు మాత్రం ఇస్తుంటాయి. వీటిని జోకర్లనాలో, జంతువులనాలో బేతాళ ప్రశ్న!
* * *
జోకర్లంటే గుర్తుకొచ్చింది. నిన్ననే ఓ పెద్ద జోకు మన తెలుగు వార్తాపత్రికల్లో వచ్చింది. అవినీతికి వ్యతిరేకంగా ఉద్యమించాలని, అందుకు గాను మన రాష్ట్రం వేదికగా ఓ భారీ బహిరంగ సభ జరగబోతున్నదట! దేశంలో అవినీతి క్యానసరులా పాకుతున్నదని, దాన్ని వెంటనే వదలగొట్టాలని, కాంగ్రెస్ శ్రేణులకు సోనియా ఇచ్చిన పిలుపుకు అనుగుణంగా ఈ భారీ సభ ఏర్పాటు చేయబోతున్నారట. ఇంకా పెద్ద జోకేమిటంటే, ఆ సభకు గాను పందిళ్ళు వేయటం దగ్గర నుంచి, మందిని తోలుకొచ్చి సభను ఆసాంతం నిర్వహించే బాధ్యత శ్రీ బొత్స గారిదేట!
అసలు ఇటు రాష్ట్రాల్లోను, అటు కేంద్రంలోనూ “అవినీతి మంత్రిత్వశాఖ” ఏర్పాటు చేసి కల్మాడి, చవాన్ లాంటి ప్రబుద్ధులను అందలం ఎక్కించేస్తే అవినీతనేది బయటకు కనపడకుండా చర్యలు తీసుకునే అవకాశం ఉందేమో కదా. ఎవరైనా, ఈ సలహా మన ప్రధానామాత్యులకో, కాంగ్రెస్ పెద్దలకో చేరవేస్తే బాగుణ్ణు.
@@@@@