చిటపటలు-20 “దున్నపోతులు – వడగళ్ళ వానలు”

Spread the love
Like-o-Meter
[Total: 0 Average: 0]
  yasr-loader

ఈమధ్య రాష్ట్రంలో మద్యం సిండికేట్ల మీద ఎ.సి.బి. దాడులు చేస్తున్నది. అందులో భాగంగా అరెస్టైన ఓ మద్యం వ్యాపారి రాష్ట్ర ఎక్సైజ్ శాఖా మంత్రి మోపిదేవి రమణతోపాటుగా తెలుగుదేశం, సి.పి.ఎం, సి.పి.ఐ., సి.పి.ఐ (న్యూ డెమొక్రసి), భా.జ.పా. నేతలకు కూడా లక్షల్లో లంచం ఇచ్చినట్లుగా వాంగ్మూలం ఇచ్చాడట!

 

రోజుకో కొత్త కుంభకోణాన్ని తవ్వి తలకెత్తుకొని అవినీతిలో రోజుకో కొత్త లోతుని చూపిస్తున్న కాంగ్రెస్ చేసే ఎదురుదాడి చూడ ముచ్చటగా ఉంటుంది. ముందుగా ఇవన్నీ ఆరోపణలే అని అవహేళన చేస్తారు. పైగా వైరిపక్షాల కుట్ర అని కూడా తీర్మానిస్తారు. అంతేకాదు, ఫలానా సంవత్సరం, పలానా దుర్ముహూర్తంలో ఫలానా పార్టీ నాయకుడు చేసింది కూడా ఇదే అని ఆధారాలు చూపిస్తారు. అస్సలు ఇవ్వనేలేదని ఆరోపణలు తిప్పికొట్టే బేరం మొదలేస్తారు. ఆ తర్వాత, ఇచ్చినా తీసుకోలేదంటారు. ఒప్పుకోకపోతే కొంప కొల్లేరౌతుందన్న పరిస్థితి వస్తే, ఎవడో కార్యకర్తనో, లేదంటే కల్మాడినో, సరిపోకపోతే మరెవరో అధికారినో ముందుకు తోసి, వీడే పార్టీ గౌరవాన్ని భంగపరిచాడు, డబ్బు కోసం కక్కుర్తి పడ్డాడని వాడి బండారం బట్టబయలుచేసామని దరువులు వేసుకుంటారు. ఈ రంగంలో ఢక్కాముక్కీలు తిన్న కాంగ్రెస్, అనుభవం నేర్పిన పాఠాలతో అద్భుతమైన నైపుణ్యాన్ని ప్రదర్శిస్తూ ఎవరికీ అందనంత లోతుల్లో పవిత్రంగా ముక్కిపోతూ ఉంటుంది. కుళ్ళి కంపుకొట్టేది కార్యకర్తలే కానీ, పార్టీ కాదని ముక్కు చీదుకుంటుంది.

 

చేతివాటం చేతకాక కక్కుర్తిపడే కొన్ని పార్టీలు మాత్రం పరువుని బజారులో పాతరవేసుకుంటాయి. ఆ కోవలోదే రాష్ట్రంలో కమ్యూనిస్టుల ప్రస్తుత పరిస్థితి. ఈ ముడుపుల భాగోతంలో భంగపడ్డ ఈ పార్టీలు తాము తీసుకున్నది లంచం కాదని, పార్టీ కోసం, పార్టీ మహాసభ కోసం తీసుకున్న చందాలని చెవుల్లో పూలు పెట్టుకుంటున్నాయి. గతంలో బంగారు లచ్చన్న భా.జ.పా. ప్రెసిడెంటుగా ముడుపులు తీసుకుంటు, దొరికిపోయి పాడిన పాత పాటే ఇది. ఆ తర్వాత భా.జ.పా. కూడా కాంగ్రెస్ లెవెల్లో కొత్త రాగాలు, సరికొత్త పాటలు నేర్చుకుంది. మొత్తానికి తర తమ బేధాలు లేకుండా పార్టీలన్నీ దున్నపోతులే అని తీర్మానించేయొచ్చు. వాన పడితే ఏం, వడగళ్ళు పడితే ఏం, సుబ్బరంగా తుడిచేసుకొని మన మీదే ముక్కు చీది పోతారు!

Leave a reply

  • Default Comments (0)
  • Facebook Comments