“గురూ!”
“వెర్రోహం! ఏమి శిష్యా?”
“అంతా కన్ఫూషన్గా ఉంది గురూ?”
“అంటే నువ్వు సిసలైన భారతీయుడవేలే శిష్యా!”
“చమక్కులాపి నా చిక్కుముళ్ళను విప్పండి దయచేసి”
“హు..హు..హు…అడుసు కడుక్కోడానికి, అజ్ఞానం అడుక్కోడానికే పుట్టాయి శిష్యా. అడుక్కో, కడుక్కో!”
“ధన్యోస్మి. దేశంలో స్క్యాములు పెరిగాయి, అవినీతి పెచ్చరిల్లుతోంది. చివరకు ఆటల్లో కూడా మన మర్యాద అడుగంటిపోతోంది. ఏమిటో ఇదంతా ఎందుకు జరుగుతోందో? అంతా కన్ఫూషన్గా ఉంది గురూ!”
“వెర్రోహం!”
“నిజమే! వెర్రివాణ్ణే గురూ. జవాబిచ్చి పుణ్యం కట్టుకోండి.”
“శిష్యా! అవధరించుతున్నాను, విని తరించు. నీకు మల్లే కన్ఫూషన్ ఉంటే ఏ.రాజా రెండు లక్షల కోట్ల ఆమ్యామ్యా చెయ్యగలిగేవాడా?”
“లేదు”
“నీకు మల్లేనే అక్కుపక్షి ఐవుంటే దయానిధి మారన్ ఎయిర్ సెల్ శివకుమారన్ నితంబ తాడనం చెయ్యగలిగేవాడా?”
“లేదు”
“నీకు మల్లేనే నిర్భాగ్యపు కన్ఫూషన్ ఛాంపియన్లైవుంటే ఇప్పుడు బైటపడుతున్న మన క్రీడా కంకాళాలకి డ్రగ్స్ పంకిలం అంటుకునేదా?”
“నో!”
“అదే మరి! వారి లేనిది, నీకు పొనిదీ ఈ కన్ఫూషనేరా అర్భక!”
“మీరు నన్ను తిట్టారనే అనిపిస్తోంది కానీ తిట్టినట్టుగా కనిపించడంలేదు గురూ”
“అదేరా నీ గొప్పతనం…సగటు భారత పురుగా!”
“ఇది చాలు గురూ! కానీ నేటి కొటాలో ఇంకో ప్రశ్న మిగిలుంది. అడిగేసి కడిగేసుకుంటా”
“అనంత పద్మనాభుడి అమోఘ సంపద గురించేగా నీ కన్ఫూషను?”
“మహాగురో! మీరు అకాల జ్ఞానులు. ఆ మాయా మతలబును కూడా విప్పి పుణ్యం కట్టుకోండి!”
“హు…హు..హు…అవశ్యంగా శిష్యా. ఇప్పుడు నేనడిగేవాటికి జవాబులివ్వు. నిలబడివున్నవాడు కాళ్ళ కింద ఎంత దాచగలడురా?”
“ఓ అరకాసంత గురూ!”
“బాగు బాగు. మరి కుర్చీలో కూర్చున్నవాడు?”
“ఓ అరకేజీ దాకా గురూ?”
“ఆహా…మరి పడుకొన్నవాడో?”
“కేజీలు కేజీలు దాచొచ్చు గురూ!”
“మరి నించున్న వెంకన్నే నలభై వేల కోట్లు కూడబెట్టగాలేంది, ఇంతపొడవుగా పడుకొన్న పద్మనాభ స్వామి ఐదులక్షల కోట్లు అడుగున వేసుకోవడంలో ఆశ్చర్యమేమిరా?”
“అహో! భలే బాగుగా చెప్పారు. ఈ కథలో గ్రహించాల్సిన సూక్తి కూడా వివరించండి గురూ!”
“ఆ సూక్తి నీలాంటి కన్ఫూషన్ పార్టీలకు ఉపయోగం లేదురా!”
“పోనీ! ఉపయోగపడేవాళ్ళకే ఉపయోగపడనివ్వండి. మీరు మాత్రం చెప్పండి గురూ!”
“రాబోయే రోజుల్లో ఆఫీసుల్లో కుర్చీలకు బదులు పట్టుపాన్పులను వేసి పడుకొని రాజ్యం చెయ్యబోతారు.”
“హబ్బా! మళ్ళీ కన్ఫూషను పాలు చేసారు గురూ! పద్మనాభుని కథకు, రాజకీయ పక్షుల పరుపులకు లింకు దొరికి చావడంలేదు?”
“అదేరా వెర్రి మాయ! ఈ కన్ఫూషనే నీకు శ్రీరామ రక్ష…రాజకీయులకు దోచిందే లక్ష!”
“ఏమిటో ఈ పరీక్ష!”
“ఇక వెళ్ళురా! మాకు అనంతశయనోత్సవం చెయ్యడానికి భక్తులు ఉవ్విళ్ళురుతున్నారు”
“అలాగే గురూ!”
“వెర్రోహం!”
* * * * *