కాంగ్రేస్ “ప్రభంజనం”!

Spread the love
Like-o-Meter
[Total: 0 Average: 0]

“హల్లో ఆల్! నేను ఉల్లి వెంకట్…మీరు చూస్తున్నారు టీవీ జీరో “పాంచ్ కా పంచ్ “….నాన్ స్టాప్ కవరేజ్ ఆఫ్ ఫైవ్ స్టేట్ ఎలెక్షన్స్. కమలాలు విరిసాయి తుళ్ళి తుళ్ళి, చీపుర్లు చెలరేగాయి మళ్ళి మళ్ళి, కాంగ్రేసు పని అయింది హళ్లి కి హళ్లి అని మా స్క్రిప్ట్ రైటర్ మిస్ బుచ్చెమ్మ చాలా ఆశువుగా తన అభిప్రాయాన్ని వెలిబుచ్చింది. బుచ్చెమ్మకి సెవెరల్ థౌజండ్ హగ్స్ అండ్ కిసెస్ తెలియజేసుకొంటూ ఇప్పుడు ఢిల్లీలో కాంగ్రేస్ ప్రధాన కార్యాలయం దగ్గరున్న మా రిపోర్టర్ డప్పు రాజయ్యను పలకరిద్దాం….

హల్లో డప్పూ…హల్లో హల్లో….వింటున్నారా?”

“హల్లో…ఉల్లి…ఆ( ఆ(….వినబడ్తోంది…చెప్పండి!”

“డప్పూ నువ్వే చెప్పాలి. ఎలెక్షన్లు జరిగిన ఐదు రాష్ట్రాల్లో నాలుగు చోట్ల కాంగ్రేసు పార్టీ పరిస్థితి విస్తరి దొరకని కుక్కుటంలా మారిపోయిందని మా ఇన్-హౌస్ అనలిస్టులు చెప్పుకొస్తున్నారు. నిజానికి కాంగ్రేసు ఆఫీసులో ఎలాంటి వాతావరణం ఉంది?”

“హల్లో…హా…ఉల్లి….నిజానికి ఈ ఎలెక్షన్సులో కాంగ్రేసు పరిస్థితి చాలా ఇదిగానే ఉంది కాబట్టి ఆఫీసులో కూడా చాలా దయనీయ పరిస్థితులే ఉంటాయని ఆశిస్తున్నాను. ఆ….అదిగో గేట్లు తెరిచారు…ఇప్పుడు మేం లోపలి కెళ్తున్నాం…”

“ప్రేక్షకుల్లారా! మా టీవీ సిబ్బంది కాంగ్రేసు మైన్ ఆఫీసులోకి వెళ్తున్నారు. గుండెనొప్పులు, నరాల బలహీనతలు, గర్భిణులు, చిన్నపిల్లలు ఈ లైవ్ ను చూస్తుంటే వెంటనే టీవీల ముందునుండి లేచెళ్లడం మేలని చెబ్తున్నాం. ఎందుకంటే లోపల కనబడబోయే దృశ్యాలు చాలా డిస్టర్బింగా ఉండొచ్చును.

“వెల్….డప్పూ…లోపలికెళ్ళారా?”

“ఎస్…ఎస్…ఉల్లి…జస్ట్ ఇంకొక్క డోర్ దాటేస్తే మేము పూర్తిగా లోపలున్నట్టే…హోల్డ్”

@ @ @ @ @ @

“డప్పూ…డప్పూ…ఉన్నావా?”

“…….”

“డప్పూ….ఏమైంది? నాకు కొన్ని విజువల్స్ కనబడుతున్నాయి బట్ నీ గొంతు వినబడ్డం లేదు. ప్లీజ్ స్పీక్ డప్పూ’

“వెల్….ఖళ్…ఖళ్…ఉల్లి…కిచ్ కిచ్”

“డప్పు…చెప్పు…చెప్పు…అసలు లోపల పరిస్థితి ఎలావుంది?ప్రేక్షకుల్లో బీపీ షుగర్లు పెరక్కముందే చెప్పెయ్”

“ఉల్లి….ఇక్కడ….అంటే లోపల…అంటే ఢిల్లిలోని కాంగ్రేసు ప్రధాన కార్యాలయం లోపలి వాతావరణం చాలా….చాలా….పండగలా ఉంది!”

“వ్వాట్? హౌ కెన్ ఇట్ బీ? ఆర్ యూ ష్యూర్ డప్పు?”

“ఎస్ ఉల్లి…ఇదిగో కెమరాను ప్యాను అండ్ జూమ్ చేస్తున్నాం…చూడండి.”

కెమరా తిరగడంతో ఉల్లి వెంకట్ ముందున్న పేద్ద స్క్రీను పైన దృశ్యాలు కనబడ్డం మొదలయ్యాయి. అందులో….

కాంగ్రేసు వారి గూడుపుఠాణీ గది (మీటింగ్ రూమ్) చాలా గోల గోలగా, గందరగోళంగా, హడావిడిగా ఉంది. పొడవాటి టేబిల్ మీద చాలా రకాల తినుబండారాలు గుట్టలు గుట్టలుగా పొసివున్నాయి. ఆ టేబిల్ చుట్టూ ఉన్న కుర్చీల్లో కాంగ్రేసు వారి ప్రముఖ ముఖాలన్నీ నవ్వులతోను, తుళ్ళింతలతోనూ మిలమిలా మెరిసిపోతూ ఉన్నాయి. మరీ ముఖ్యంగా మేడమ్ సోనియా గాంధీ, ఆమె కుమార రాజా వారైన రాహుల్ గాంధీ ముఖాలైతే పట్టలేని ఇదితో అదై పోతున్నాయి.

“హల్లో డప్పు రాజయ్యా….ఉన్నావా?” నమ్మకం పోయిన గొంతుతో అడిగాడు ఉల్లి వెంకట్.

“హల్లో…ఉన్నాను…ఉల్లి…లోపలే ఉన్నాను” అంటూ నూతి నుండి మాట్లాడినట్టుగా పలికాడు డప్పు రాజయ్య.

“వాటీజ్ హాపెనింగ్?”

“ఉల్లి….నిజానికి కాంగ్రేసు ఆఫీసులో ఉండబోయే పరిస్థితిని వర్ణించడానికి నేను చాలా కష్టపడి గూగుల్ చేసి కొన్ని మంచి మంచి తెలుగు పదాల్ని రాసుకొచ్చాను.”

“ఈజిట్? ఏమిటా పదాలు డప్పు!”

“దయనీయమైన పరిస్థితి, విచార విషణ్ణ వదనాలు, వాడిపోయిన ముఖాలు, చెదరిన ఆశలు, సడలిన నమ్మకం, కుదేలైపోయిన కాంగ్రేసు పెద్దలు…”

“చాల్చాలు…చాలా పెద్ద లాంగ్వేజు రీసెర్చే చేసావు గానీ ఇంతకీ ఈ కేరింతలు, తుళ్లింతలు ఎలా జరుగుతున్నాయి? ఆ టేబిల్ మీద వడ్డించిన పదార్థాలేమిటి? కనుక్కో డప్పు!”

“ఒక్క నిముషం ఉల్లి….జస్టే మినిట్ ప్లీజ్….హల్లో…సార్…నమస్తే దిగ్విజయ్ గారు….”

“హే….హాయ్…హల్లో” తుళ్ళిపోతూ అన్నాడు దిగ్విజయ్ సింగ్.

“సర్….నిజానికి ఇక్కడి పరిస్థితి…” (జేబులోని పేపరులోకి తొంగి చూస్తూ) చాలా ఆందోళనకరంగానూ, చింతాజనకంగానూ ఉంటుందని మొత్తం మీడియా భావించింది. కానీ….(మళ్ళీ జేబులోకి చూస్తూ) ఇక్కడి పరిస్థితి తద్విరుద్ధంగా చాలా సంతోషకరంగా ఉంది. ఇక్కడేం జరుగుతోంది?”

“హే మ్యాన్…వెయిట్ ఎ మినిట్ ఫర్ సిక్ట్సీ మినిట్స్….చిలిపి!” అని డప్పు రాజయ్య బుగ్గను పుణికి కులుక్కుంటూ వెళ్ళిపోయాడు దిగ్విజయ్.

డప్పు వెర్రి మొహం స్క్రీను నిండుగా కనబడుతుండగా అరవై నిముషాల కమర్షియల్ బ్రేక్ తీసుకొన్నాడు ఉల్లి వెంకట్.

@ @ @ @ @ @

బ్రేక్ తర్వాత…..

“వెల్….వ్యూయర్స్….ఇప్పుడు మనం మళ్లీ లైవ్ లోకి వెళ్ళబోతున్నాం. మేము అడ్వైజ్ చేసినట్టుగా ఆక్సిజన్ సిలిండర్లు రెడీగా పెట్టుకోండి. కొన్ని ఊపిరాడని సంఘటనలు చూసే అవకాశాలున్నాయి.”

కాంగ్రేస్ ప్రధాన కార్యాలయం చాలా హడావిడిగా ఉంది. టేబిల్ మీద అనేక ఇటాలియన్ తినుబండారాలు ఉంచబడివున్నాయి. టేబిల్ కు ఆవైపున ఉన్న రెండు కుర్చీల్లో సోనియా, రాహుల్ పడిపడి నవ్వుతున్నారు. మిగతా కాంగీయులు కూడా ఒకరి భుజాల్ని ఒకరు పొడుచుకొంటూ, గిలిగింతలు పెట్టేసుకొంటున్నారు.

అహమ్మద్ పటేల్ కులుకుతూ లేచి “మిత్రులారా! మనమంతా ఇలా ఎందుకు సెలబ్రేట్ చేసుకొంటున్నామో అర్థం కాక ఇప్పటికే వంద మంది భారతీయులు హరీమన్నారని న్యూసు వచ్చింది. ఆంధ్రా నుండి జగన్ బాబు ఓదార్పు యాత్ర మొదలెట్టేలోగా మనం పండగ ఎందుకు చేసుకొంటున్నామో అమాయక భారతీయులకు చెప్పేయ్యాల్సిన గురుతర బాధ్యత మన మీద వుంది. ఆ భారాన్ని డిగ్గీరాజాను మొయ్యాల్సిందిగా అమ్మగారి ఆజ్ఞ!” అని కూర్చొన్నాడు.

డిగ్గీ మొహమంతా నవ్వే నవ్వుగా లేచి, మైకును దాదాపు నోట్లో కుక్కేసుకొని “ఫ్రెండ్స్ అండ్ పూర్ ఇండియన్స్! లెట్ మీ టెల్ యూ ద రియల్ స్టోరీ! ఈ రోజు నాలుగు రాష్ట్రాల్లో మట్టిగొట్టేసుకుపోయిన మనం ఎందుకు సెలెబ్రేట్ చేసుకొంటున్నామని కదూ అందరి అనుమానం! దీన్ని పటాపంచలు చేసే అపూర్వ అవకాశాన్ని నాకిచ్చిన మేడమ్ గారికి, యువరాజుకు పాదాభివందనాలు…” అంటూ మైకుతో సహా ముందుకు వంగాడు డిగ్గీ. మైకు ముక్కుకు గుద్దుకొనే ప్రమాదముందని పసిగట్టిన సూక్ష్మబుద్ధి రాహుల్ డిగ్గీని మధ్యలోనే ఆపేసాడు. “మాట్లాడు” అన్నట్టు సైగ చేసాడు.

గొంతు సవరించుకొన్న డిగ్గీ – “వెల్! మిత్రులారా! మనమనుకొన్నంతా అక్షరాలా జరిగిపోయింది. మనకు ఇండిపెండేన్సు వచ్చిన రోజు నుండి కూడా ఏనాడు, ఏ ఎన్నికల్లోనూ మన అంచనాలు ఇంత కరెక్టుగా నిజమవ్వలేదు. ఇన్నాళ్ళకి అమ్మగారి దయవల్ల ఇది జరిగింది. మరీ ముఖ్యంగా మన యువరాజా గారి గొప్ప మాటకారితనం, ప్రత్యర్థుల్ని తికమకపెట్టడంలో నేర్పరితనం మొదలైన అభూతపూర్వ నాయకత్వ లక్షణాలు మన పార్టీని నిలువునా ప్రశంసల్లో తడిపేసినాయి. చిన్నపిల్లవాడు సహితం మిస్టర్ బీన్ చూడ్డం మానేసి మన యువరాజు గారి ప్రసంగాల్ని వినే స్థితిని కలిగించింది మన ప్రచారం. ఈ రోజు నాలుగు రాష్ట్రాల్లో భా.జ.పా. ను ప్రజల కోపాగ్నికి గురయ్యేటట్టుగా తంత్రం రచించి మనల్ని ఐదేళ్ళ పాటు హాయిగా గడిపే అవకాశాన్ని ఇప్పించిన మన యువరాజుకు నా అభినందనలు” అని మళ్లీ వంగాడు డిగ్గీ.

సోనియా చాలా మురిపెంగా ఇంటాలియన్ పాకును కొడుకు నోట్లోకి తోసింది.

డిగ్గీ మళ్లీ మొదలెట్టి – “ఇక మిగిలింది ఆంధ్రప్రదేశ్. అక్కడ నిలువునా, అడ్డునా, ఏటవాలుగా – ఇలా ఎలా పడితే అలా కోసేసిన గొప్ప సర్జను మన మేడమ్. అమ్మగారి గొప్పదనానికి కళ్ళు తిరిగిన ఆంధ్రులు వచ్చే ఎన్నికల్లో మనకు ఎనెన్నో ఘనతల్ని కట్టబెట్టడం గ్యారెంటీ. వైయెస్సారు పేరు చెప్పుకొని ఓదార్పు యాత్రలు చేసే జగన్ వచ్చే ఎన్నికల్లో ప్రజాగ్రహానికి గురై గద్దె ఎక్కడం గ్యారెంటీ. ఇలా అమోఘమైన రాజకీయ చతురతతో మన ప్రత్యర్థుల్ని గద్దె నెక్కించి కాకులకు, గద్దలకు ఎరగా వేసిన మహ ఘన నాయకులకు మనమందరం కృతజ్ఞతలు తెలపాలి. లెండి…తెలపండి…” అంటూ మైకుతో సహా జోరుగా వంగాడు డిగ్గీ. ఇటాలియన్ పాకు, ఇటాలియన్ బోండా, ఇటాలియన్ పొంగలి తినడంలో బిజీ ఐపోయిన యువరాజు గారు జాగ్రత్తపడేలోగా…….

మైకుతో సహా పారిపోతున్న డప్పు రాజయ్య వీపును చూపిస్తున్న కెమెరామ్యాన్ ను “కట్ కట్ కట్” అంటూ అరుస్తూ కుర్చీలో విరుచుకు పడిపోయాడు ఉల్లి వెంకట్.

కంగారు పడిపోయిన టీవీ జీరో MCR “జప్ఫా” సినిమా ప్రొమోల్ని అదేపనిగా వేయసాగారు.

@ @ @ @ @

Your views are valuable to us!