జోక్ పాల్ బిల్లు కోసం, చిన్నాహజారే చేపట్టిన నిరాహార దీక్ష, మూడోరొజుకల్లా మూణ్ణాల ముచ్చటగా ముగిసిపోవడంతో, ప్రభుత్వం వూపిరి పీల్చుకుంది.,
ఐతే, మళ్ళీ వూపిరి వదిలే సమయంకూడా ఇవ్వకుండా, ప్రముఖ యోగా గురువు ఢాందేవ్ బాబా ‘నల్లధనం దీక్ష’ రాంలీలామైదానం లో అట్టహాసం గా మొదలైంది.
వేలాది యువతరంగాలు తిరంగ పతాకాల్ని పతంగాల్లా ఎగరేస్తూ గుమికూడారు.
వేదిక మీదినుంచి, జనసందోహాన్ని చూసిన ఢాందేవ్ బాబా బక్క శరీరం గాలూదిన బెలూన్లా వుబ్బింది. ప్రక్కనే వున్న శిష్యుడితో, “ఆ చిన్నాహజారే కంటే మనకే ఫాలోయింగ్ ఎక్కువగా ఉన్నట్టుంది. వారికంటే ముందుగా మనమే పొలిటికల్ ఎంట్రీ ఇచ్చేసుకుంటే ఎలా వుంటుందంటావ్” అన్నాడు.
జోక్ ఆఫ్ ది ఇయర్ విన్నట్టు, బళ్ళున నవ్విన శిష్యుడు ” గురువు గారూ.. ఇలాంటి దీక్షల్ని,ధర్నాల్ని ఏ ఐ.పి.యల్. సీజన్లోనో, ఇండియా పాకిస్థాన్ వండేమ్యాచులున్నపుడో పెట్టి చూడండి. ఈ జెండాలూ, జనాలూ ఏమౌతారో అప్పుడు వీక్షించండి” అని చెప్పాడు.
“అంతేనంటావా..? సరే ఐతే.. ఇక దీక్ష మొదలు పెడ్దాం” అంటూ మైక్ చేతికి తీసుకుని, ” అందరూ వాటర్ బాటిల్, బెడ్ షీట్ తెచ్చుకున్నారా?!” అని జనాల్ని అడిగాడు.
గాభరా పడ్డ శిష్యుడు, ఢాందేవ్ బాబా చేతిలోని మైక్ లాక్కుని, ” గురువుగారూ.. ఇక్కడికి మనమొచ్చింది యోగా శిక్షణా శిభిరానికి కాదు. దీక్ష చెయ్యడానికి!” చెప్పాడు.
“ఓ అవును కదా..!!” అనుకుంటూ , తలక్రింద పెట్టి, రెండుకాళ్ళూ పైకి లేపి, శీర్షాసనం తో తన ‘నల్లధనం దీక్ష’ ప్రారంభించాడు బాబా. అలా తలక్రిందులుగా వుండటంతో, ఫైజామా మోకాళ్ల క్రిందికి జారింది, బాబా గారి బవిరి గడ్డం మొత్తం ముఖాన్ని కప్పెయ్యడంతో అపరచితుడు హీరో విక్రం లా వున్నాడు ఢాంబాబా.
ఆశ్చర్యపడ్డ మీడియా వారంతా, “బాబాగారూ.. మీ నిరశన ఇంత వెరైటీగా ఎందుకు చేస్తునారో చెబుతారా..?” అని అడిగారు.
ఐదు, పది నిమిషాలు గడిచాయి, బాబా నోట్లోంచి ఎలాంటి సమాధానం బయటకు రావడం లేదు. సౌండ్ రావాలంటే గడ్డం అడ్డంగా వుందని గమనించిన ఓ శిష్యుడు, గురువుగారి నోటి మీద నుంచి, వెంట్రుకల్ని ప్రక్కకి లాగి పట్టుకున్నాడు. ఆ శిష్యుడికి ఢాందేవ్ బాబా ఒక విషయం చెప్పాలనుకున్నాడు. వినడానికి వీలుగా ఆ శిష్యుడు కూడా శీర్షాసనం వేసాడు. అతడి చెవిలో బాబా ఏదో చెప్పాడు.
“ఇక్కడ శీర్షాసనం తెలిసిన విలేఖర్లు ఎవరైనా వుంటే చెప్పండి. బాబా వారికి మాత్రమే సమాధానం చెబుతారట”!! శిష్యుడు మీడియా వారిని అడిగాడు.
అందరూ తల అడ్డంగా వూపారు. ఒక్కడు మాత్రం “భుజంగాసనమైతే” లిటిల్ బిట్ మైంటేన్ చేస్తానని చెప్పి, బాబా తల దగ్గరగా బోర్లా పడుకుని, భుజంగాసనంలో ఇంటర్వ్యూ మొదలుపెట్టాడు.
*** *** *** ***
సన్ టీవి లో “నల్ల తంగం” సినిమాని ఆసక్తిగా చూస్తూ, అప్పుడప్పుడూ కేరింతలు కొడ్తూ, హీరో ని విలన్ చితక బాదుతున్నపుడు, “అడిడా అడి” అని చేతులు చరుస్తూ ఎంజాయ్ చేస్తున్నాడు ఆర్థికమంత్రి ‘ఆడంబరం’.
ఇంతలో ఆయన సెక్రటరి ‘కారిముత్తు’ లోపలికొచ్చి, ‘ఢాందేవ్ బాబా ‘ దీక్ష గురించి చెప్పాడు.
పగలబడి నవ్వుతూ “తలక్రిందులుగా తపస్సు చేస్తే ఏమౌతుంది ముత్తూ.. మహా ఐతే, కడుపులో పేగులు నోట్లోకొస్తాయేమో! అంతేగానీ, స్విస్ బ్యాంక్ లో వుండే నల్ల ధనం, గోడకేసిన సున్నం అట్లాగే ఎలా వస్తుందట? ఇదెల్లా పెద్ద జోకు” అన్నాడు ఆడంబరం.
“బ్లాక్ మనీ దాచుకున్న వారి లిస్ట్ చెప్పేస్తే పోలేదా సారువాడూ..” అడిగాడు కారిముత్తు.
“స్విస్ బ్యాంక్ లో దాచుకోకుండా వున్న వాళ్ళ లిస్టయితే ఈజీగా చెప్పేయ్యొచ్చు. ఆ పార్టీ, ఈ పార్టీ అని లేకుండా, దొంగలందరి సొత్తూ అక్కడే మూలుగుతోందాయె. ఒకరి పేరు చెబితే, తమ పేరు ఎందుకు చెప్పలేదా అని, మిగతావాళ్ళు అలగొచ్చు. ఆ పేర్ల లిస్టు కనీసం కిలోమీటర్ పోడవైనా వుంటుంది కారిముత్తూ., ఎవరికీ చెప్పొద్దు. నేను కూడా ఓ వందకోట్లతో చిన్న ఖాతా మొన్ననే ఓపెన్ చేసాను” అన్నాడు ఆర్థికమంత్రి చిలిపిగా నవ్వుతూ.
“ఐనా వీళ్ళ అమాయకత్వం కాకపోతే, ఇంకా అక్కడ నల్లధనం ఎట్లా వుంటుంది. మనం దాచుకున్న సొత్తుని, ఆ బ్యాంకు వాళ్ళు తిరిగి మనకే అప్పులిచ్చి, వడ్డీలు పుచ్చుకుంటుంటారు కదా..? అప్పుడంతా వైటే కదా..?” చిదంబర రహస్యాన్ని వెళ్ళడించాడు ఆడంబరం.
“ఐతే మరి ఇలాంటి దీక్షలవల్ల మనకేం కాదంటారా సార్?” కారిముత్తు అనుమానంగా అడిగాడు.
“ఏమౌతుంది ముత్తూ.. మొన్నటికి మొన్న ఆ ముసలి చిన్నాహజారే మూడో రోజుకంతా కడుపుమాడి, నిరాహారదీక్షకు మంగళం పాడలేదా..? ఈ ఢాందేవ్ బాబా కూడా మూడ్రోజులు ఇట్లాగే శీర్షాసనం వేసాడంటే, తర్వాత పర్మినెంటుగా శవాసనం వేసుకోవాల్సి వస్తుంది..! ‘నల్లతంగం’ సినిమా క్లైమాక్స్ జరుగుతోంది. డిస్ట్రబ్ చెయ్యొద్దు.!!” అంటూ టీ.వి చూడ్డంలో మునిగిపోయాడు ఆడంబరం.
*** *** *** ***
“ఆ లిస్ట్ మొత్తం నా దగ్గరుంది. త్వరలోనే బయటపెట్టేస్తా.. నా సంగతేంటో చూపిస్తా..” శీర్షాసనంలోనే శివమెత్తిన నందీశ్వరుడిలా రంకెలేస్తున్నాడు ఢాందేవ్ బాబా.
“లిస్ట్ మీ దగ్గరే వుంటే, అందరికీ చెప్పెయ్యొచ్చు కదా..? ఈ దీక్షలతో టైంవేస్ట్ చేసుకోవడం ఎందుకు బాబా గారూ..?” భుజంగాసనంలో వున్న విలేఖరి అడిగాడు.
“చెప్పెయ్యొచ్చు సోదరా.. ముందుగా వారు చెబితే, వారి లిస్టూ, నా లిస్టూ ఒకటేనా లేక వేరు వేరా అని కంపేర్ చేసుకొవాలి. అందుకే వాళ్ళనే బయటపెట్టమని డిమాండ్ చేస్తున్నాను.” అని ఢాందేవ్ బాబా సెలవిచ్చాడు.
“ఐనా బాబా గారూ! నల్లధనం అంటే మీకెందుకంత ఆసక్తి?” పరమాసక్తితో అడిగాడు విలేఖరి.
రెండు నిమిషాలు సుదీర్ఘంగా శ్వాసను లోపలికి లాక్కుని ఇలా అన్నాడు. “ఎప్పట్నుంచో నాకు నల్లధనం ఎలావుంటుందో చూడాలని తెగ వుబలాటం వుంది. స్విస్ బ్యాంక్ లో వుండే కరెన్సీ నల్లగా వుంటుందా, మరేదైనా రంగులో వుంటుందా? వాటి మీద గాంధీ గారి బొమ్మ వుంటుందా, లేక స్విజర్లాండుకి వెళ్ళగానే అక్కడి ప్రెసిడెంట్ బొమ్మ ప్రింట్ చేసి మార్చేస్తారా..!!”
ఢాందేవ్ బాబా అతితెలివికి, ఆ జర్నలిస్టు ఢాంమ్మని క్రిందకు పడి మూర్చపోయాడు.
ఇంతలో ఒక శిష్యుడు ఐదారు పెద్ద పెద్ద పాలిథీన్ కవర్లు తెసుకువచ్చి గురువుగారి ముందు వుంచి, శీర్షాసనం వేసాడు.
“ఏమిటవి శిష్యా? కొంపదీసి హోటల్నుంచి ఆహారం పొట్లాలు తెచ్చావా ఏంటి? వాటిని చూసి నోరూరిందంటే నా దీక్ష పక్షిలా ఎగిరిపోతుంది!” అనుమానంగా అడిగాడు ఢాందేవ్ బాబా.
“కాదు గురువు గారూ.. పోయిన్సారి ఇలాగే మీరు దీక్ష చేసినపుడు, పోలీసులు అరెస్ట్ చేసారు కదా? అప్పుడు మీరు తప్పించుకోవడానికి, అమ్మయిలా రెండుమూడు చాలీ చాలని పేలికల్ని ఒంటికి చుట్టుకుని, అడ్డంగా దొరికిపోయారు. ఈసారి అలా కాకూడదని మీ మహిళా అభిమానులు కోందరు, మీకోసం లేడీగార్మెంట్లు పంపించారు.” అని శిష్యుడన్నాడు.
“ఎవరెవరు ఏమేమి పంపించారో కాస్త చూపించు శిష్యా!” కూసంత క్యూరియాసిటి తో అడిగాడు ఢాందేవ్ బాబా.
శిష్యుడు శీర్షాసనం నుంచి, పైకి లేచి, ఒక్కో కవర్ మీద వున్న పేరు చదువుతూ, ఆ కవర్లో ఏముందో వరుసగా చూపిస్తున్నాడు.
“ఆంద్రా నుంచి అరుంధతి గారు గద్వాల్ పట్టుచీర పంపించారు, పంజాబ్ నుంచి, ఛార్మికౌర్ గారు సల్వార్ కమీజ్, ఢిల్లీ నుంచి కంగనారునాత్ గారు జీన్స్, టీషర్ట్, చెన్నై నుంచి కష్బూ గారు ఒక హాఫ్ శారీ.. ఇక చివరగా.. ముంబై నుంచి మీ ప్రియాతి ప్రియమైన శిష్యురాలు సాఖీరావంత్ గారు”..అంటూ-
కవర్ ఓపెన్ చేసాడు శిష్యుడు, అందులో బంగారు రంగులో మెరిసిపోతూ మరొక చిన్న గిఫ్ట్ బాక్స్ వుంది.
సాఖీరావంత్ పేరు వినగానే, ఢాందేవ్ బాబాతో బాటుగా అక్కడికి విచ్చేసిన జనసందోహం, యమ ఉత్సాహంతో ఆమె ఏం పంపిందోనని, కళ్ళు నిక్కబెట్టుకుని, చూస్తున్నారు.
శిష్యుడు ఆ బాక్స్ ని ఓపెన్ చేసి మెల్లగా అందులో వున్న గార్మెంట్ ని బయటకు తీసాడు.
అతని చేతిలో.. మట్టిరంగుతో తళతళ లాడ్తూ, చిన్న బ్రా, మరింత కురుచ సైజులో ఫాంటీ వ్రేలాడుతున్నాయి.