భాగ్యనగరంలో గణేశ నిమజ్జనం అను గణపతి-శంకరుల సంవాదం

Spread the love
Like-o-Meter
[Total: 0 Average: 0]

సంధ్యాకాలం కావస్తుంటే శంకరుడు హైదరాబాద్ మీదుగా శ్రీశైలం వైపుకు వెళుతూ నిన్న జరిగిన గణేశ నిమజ్జన కోలాహలం చూసి ముసిముసి నవ్వులు నవ్వుకొంటూ ఒక్క సారి గణపతిని తలచుకున్నాడు. మరుక్షణం గణపతి శంకరుని ముందు ప్రత్యక్షమై ప్రణామం చేసి తండ్రీ ఏమి ఆజ్ఞా అని వినయంగా భక్తితో అడిగాడు. అందుకు మహా శివుడు సంతుష్టుడై 
 
“వత్సా! కలియుగంలో మీ ముత్తాతగారైన శ్రీ మహా విష్ణువు తో పాటూ  మీ తాతమ్మను (శ్రీ మహాలక్ష్మిని) శ్రీమన్నారాయణ స్వరూపమైన ఆదిత్యుని, నన్ను, నీ తల్లి యైన పార్వతిని, నిన్ను, నీ సోదరుడైన సుబ్రహ్మణ్యుని పూజించడం మనం గమనిస్తూనే ఉన్నాం.  మహారాష్ట్రలో నిన్ను అధికంగా పూజించడం కద్దు. కాని ఈ భాగ్యనర వాసులు గత కొన్ని దశాబ్దాలుగా నిన్ను విచిత్రమైన భక్తి తో పూజించడం వలన
నాకు ఆ కలి ప్రభావం ఈ మన్వంతరంలో విచిత్రంగా గోచరిస్తున్నది.  అందుకే కాబోలు మా తండ్రి గారైన బ్రహ్మ గారు తనకు పూజ లేకుండా చేసికొని ధన్యులయ్యారు. ఆయన జీవోత్తముడిగా మిగిలి ఈశ-దాస భావనకు ప్రతీక అయ్యారు. ఆద్యంతం విచిత్ర భక్తిని వెల్లడించే నీ నిమజ్జన కార్యక్రమం కలి ప్రభావానికి పరాకాష్ట సుమీ” అని పరమేశ్వరుడు తెలుపగా
 
మహా గణపతి – “తండ్రీ ఈ కలియుగంలో భక్తి విపరీత కలి స్వభావాన్ని పొంది మా ముత్తాత గారు ఇష్టపడే శుద్ధ సాత్విక భక్తి పారవశ్యం కేవలం మీ దయవల్ల కొద్దిమందికి మాత్రమే దక్కి అల్లా దక్కిన వారిలో చాల కొద్దిమంది మాత్రమే ఈశ్వరుడైన శ్రీ మహా విష్ణువు యొక్క తత్త్వం అవగతమై శుద్ధ సాత్విక భక్తులై ఆ శ్రీమన్నారాయణుని వారి వారి సాధనకు తగ్గ రీతిన దర్శించి ధన్య జీవులగుచున్నారు.  తండ్రీ! మీరు చూసిన దృశ్యాలలోని కొన్ని మచ్చుతునకల్ని మన సంవాద పాఠకులకై మరోమారు చెప్పుకొస్తాను:
 
౧. మద్యం సేవించి, ఢమరుకాల్లాంటి వింత వింత వాయిద్యాలను మెడలో కర్ణేంద్రియాలను ఘోరహింసకు గురిచేస్తూ, అసహ్యకరమైన రీతిలోధ్వనులు చేస్తూ ఉంటే అదే మద్యం సేవించి విచిత్రమైన రీతిన శరీరాన్ని ఒకచో అసభ్యకర భంగిమలో గణేశ ప్రతిమకు ఎదురుగా ఊగిస్తూ వింత నృత్యం (అది నృత్యం కాదు) చేస్తూ వీధుల వెంట ఒకరకమైన గందరగోళంతో నిమజ్జనానికి సాగిపోతున్న విచిత్ర భక్త గణం.
 
౨. చవితి రోజున పెట్టిన లడ్డూని నా చేతిలో ఈ తొమ్మిది రోజులూ ఉంచి దానిని ప్రసాదంగా వేలం వేసి, డబ్బు సంపాదించి, ఆ ప్రసాదాన్ని (కలుషితమై పాచి పట్టి, రంగు, రుచి మారి పోయిన దానిని నా ప్రసాదం గా) నా భక్తులు ఒక విధమైన శంకతో స్వీకరించడం.
 
౩. అయ్యో గణపతి చూస్తుండగా మనం అలాతాగి తందనాలు వేయడం భక్తి కాదు అని తెలిసీ, తెలియక, తెలిసీ-తెలియక, అసలు ఏ విధమైన భక్తి భావమే లేక వెర్రి పట్టిన రీతిన ఊగిపోయే ఆ భక్తులు కాని భక్తులు చేస్తున్న వింత చేష్టలు.
 
౪. నన్ను ఆవాహనం చేసిన విగ్రహంలో నేనున్నానని తెలిసో తెలియకో ఒక వాహనంలో నిమజ్జనానికి తరలిస్తుంటే ఒక కరెంటు తీగ లేదా ఒక చెట్టు కొమ్మో తగిలి నా విగ్రహం నేల పై పడితే మరలా నన్ను ఎత్తి ఆ వాహనం లో కూర్చోపెట్టి తీసుకొని పోవడం.
 
౫. నాకే అంటే నా విగ్రహానికి వింత రంగులు పులిమి, అవైదికమైన అశుచితో కూడిన పూజలు చేసి నన్ను నడివీధిలో తొమ్మిది రోజులు ఉంచడం.
 
౬. కొందరి భక్తి వెర్రి పుంతలు తొక్కి నా తండ్రిగారైన మీ విగ్రహాన్ని లేదా మీ లింగాకారాన్ని సైతం నాతో పాటూ అనుచితమైన స్థానాన్ని కల్గించి తీసుకొని పోవడం.
 
౭. కేవలం ధూప దీపాలతో వైదికమైన ప్రసాద నివేదన తో ఒక పద్ధతిలో నిర్మించిన ఆలయంలో నన్ను సమంత్రకంగా, సశాస్త్రీయంగా ప్రతిష్ట చేసి నిత్య పూజ నివేదనలతో సేవించే ఆ కొద్దిమంది భక్తులకు వీరికి ఉన్న వ్యతాసాన్ని తెలుసుకోకపోవడం.
౮. నాకు అభిముఖంగా కళ్ళు చెదిరిపోయే రీతిన భయంకరమైన కాంతిని వెదజల్లే లౌకిక దీపాల నడుమ నన్ను వీధులలో గోల చేస్తూ తీసుకొని వెళ్ళడం.
 
౯. పవిత్రతకు , మంగళకరమైన విధానానికి ప్రతీకమైన నా పూజా విధానాన్ని చిత్తం వచ్చినట్లు మార్చి అమంగళకరంగా చేసి స్తూనే విఘ్నాలు రాకుండా చూడమని నన్ను ప్రార్థించడం.
 
౧౦. తుట్ట తుదకు నన్ను బహుశః మీరు పానం చేసిన హాలాహలం కంటే భయంకరమైన మురుగునీటి సరస్సులలో నన్ను నిమజ్జనం అనే పేరుతొ ముంచి నా విగ్రహాన్ని వివిధ జల, భూ ఆకాశ జీవులకు వదలి వెళ్ళడం.
 
తండ్రీ, ఇది కేవలం కలి ప్రభావం. మీరు నా యందు దయుంచి మీ నా భక్తులకు జ్ఞానబిక్ష పెట్టి సన్మార్గాన్ని చూపండి మీరు జగత్తుకే శ్రీ మహావిష్ణువు యొక్క సర్వోత్తమాన్ని తెలిపే ఆది శంకరులు, మహా గురువులు! మా తల్లి ద్వారా ఎన్నో విషయాలు శ్రీ మహావిష్ణువు గురించి తెలిపినా అవి ఈ కలియుగంలో విచిత్రార్ధాలకు దారి తీసి శుద్ధ సాత్వికభక్తి వినా జీవులకు మార్గము లేదనే విషయాన్ని తెలుసుకోనీకుండా చేసాయి. తండ్రీ వచ్చే సంవత్సరం నుంచి ఈ మార్పును చూసే భాగ్యాన్ని నాకు ప్రసాదించండి” అనే వేడుకున్నాడు.
 
జ్ఞానప్రదాత అయిన మహా శివుడు ప్రసన్న వదనంతో “తథాస్తు” అన్నాడు.  ఈ సంవాదాన్ని చదివిన వారి ద్వారా ఈ మార్పుకు అంకురార్పణ జరుగుతుందని అభయమిచ్చాడు.
 
ఈ వరాలతో శాంతచిత్తుడైన మహాగణపతి “తండ్రీ! మరొక్క వరం ప్రసాదించండి.  నా విగ్రహారాధనకు ఈ కలిలో పట్టిన గతి మీకు నానమ్మ అయిన ఆ శ్రీ మహాలక్ష్మికి దేవీ నవరాత్రి పూజలో జరుగకూడదని మా ముత్తాత అయిన శ్రీ మహా విష్ణువును వేడుకోవాలని ఉంది దానికి మీ అనుమతి కావాలి. “
 
మహా శివుడు “వత్సా! అవశ్యం. కాని ఒక్కటి గమనించు, ఎక్కడ అలక్ష్మి ఉండే రీతిన పూజాదికాలు జరుగుతాయో అక్కడ ఆ శ్రీ మహాలక్ష్మి ఉండదు. కనుక నీవు చింతించవలదు! ఈ సూత్రం ఏ దేవతా మూర్తి పూజకైన అన్వయమౌతుంది.  కనుక కలిలో పూజలు నిజానికి కలి తనకు తానె నిర్వహించుకొనే పూజలు.  అందుకే అవి విపరీతంగాను, మనుష్య మేధను తత్తర పరచేలానూ ఉంటాయి.  ఈ విషయం నీకు తెలియనిది కాదు. కనుక నీవు దీనిపై చింతించవలదు.” అన్నాడు.
 
ఆ మాటలకు హర్షచిత్తుడైన గణేశుడు వైకుంఠంలో ఉన్న లక్ష్మీసమేత శ్రీమన్నారాయణుని దర్శనార్థమై ఎలుక వాహనాన్నెక్కి బయల్దేరాడు. అతను వైకుంఠప్రియదర్శనానంతరం వచ్చే సంవత్సరం భాద్రపద శుద్ధ చవితి నాటికి భూలోకానికి వస్తాడు. ఈలోపు ‘జీవ వైవిధ్య సభలు’ మన హైదరబాదులోనే జరగబోతున్నాయి. కనీసం ఆ సభల పుణ్యమాయని ప్రజల్లో కొంచెమైనా మార్పులు వచ్చి పర్యావరణంతో బాటు గణేశుణ్ణీ ప్రేమతో స్వాగతిస్తారని ఆశిద్దాం.
 
స్వస్తి .
 
@@@@@ 

Your views are valuable to us!