అప్పన్న: ఒరేయ్ రాజన్న మొన్నీమద్దెన ఒక శవ పూజ చూసా. నాకైతే శవానికి పూజ ఏటీ అని ఒకటే ఆలోచన కాని ఆ పంతులు గారు నా మనసులో దూరి నట్లు నేను ఏవి అనుకుంటున్నానో అదే సేప్పాడు.
రాజన్న: ఏవి జెప్పాడు ?
అప్పన్న: పేణం బోయాక ఆ శవాన్ని అగ్నికి అప్పజేప్పాలంటే దాన్ని కడిగి ఒక పూజా సామానుగా సేయాలట. అప్పుడే అగ్గి దేవుడు దాన్ని కాలుత్తాడట.
రాజన్న: నీ మొహం. అగ్గి లో లో ఏది పాడేసిన కాలిపోద్ది శవం ఇంకా బాగా. అయన్నీ డబ్బులు గుంజడానికి ఈ పంతుళ్ళు సేత్తారు.
అప్పన్న: కాదురా ఎర్రి మొహమా నాకు నీలాగే అనిపించిది కాని ఆ పంతులోరు ఒక మాట సేప్పాక నేను ఇక గుడ్డిగా నమ్మేసాను.
రాజన్న: ఏంటా మాట?
అప్పన్న: మన పెట్టుకున్న రివాజు బట్టి తెల్ల కార్డు ఉన్నోల్లకే బియ్యం ఇత్తారు గదా మరి ఆ దేవుడు పెట్టిన రివాజు బట్టి కొన్ని పనులు సేయ్యాలంటే ఎందుకు మనం నమ్మం ?
రాజన్న: ఆ దేవుడు పెట్టాడని నీకు రుజువు ఏది?
అప్పన్న: దాహానికి నువ్వు ఒక లడ్డు పుచ్చుకో మరి
రాజన్న: పితలాటంగా మాట్టాడతవే!
అప్పన్న: పితలాటంగాదు దేనికి అదే అని సెప్పుతున్నాను. పిట్టకి గూడు కట్టే తెలివి ఎవడిచ్చాడు? ఆ పిట్టను పుట్టించినోడె కదా మరి మనల్ని పుట్టిన్చినోడు కొన్ని మన పెద్దలకి సెప్పాడు ఆ పెద్దలు అందరికీ సెప్పారు అలా ఎప్పట్నుంచో వత్తున్న దాన్ని కాదనకూడదు. నువ్వు, నేను సచ్చాక ఎమౌద్దో నీకు నాకు తెలుత్తాది కాబట్టి నేను మాత్రం మా సంటోడికి నన్ను మంచిగా పంతులుగారని పిలిసి తగలేట్టమనే సెబుతా.
రాజన్న: ఏంటో ఈడు ఈయాల తేడా గా పేలతన్నాడు
అప్పన్న: తేడా కాదు నిజంగా సెబుతున్నా సచ్చాక మనం పది రోజులు మన ఇంటి పట్టునే ఉంటా అన్నే సూత్తం కాని ఏమీ సేయ్యలెం. మన బుడ్డోడు మనకి రోజూ ఒక ముద్ద పెడితే మనం, మనం పోవాల్సిన లోకాలకు పోతాం లేదంటే మనకు పుట్టగతులు ఉండవట.
రాజన్న: సచ్చాక ఏమౌతానో అనే బెంగ ఎందుకురా బాబూ. ఉన్నప్పుడు నువ్వు సేయ్యాల్సినవి బాగా సెయ్యి సాలు.
అప్పన్న: ఉన్నప్పుడు నేను సేయ్యాల్సినవి బాగా సేయ్యాలి సచ్చాక మా సంటోడూ సక్కగా సేయ్యల్సినవి సేయ్యాలి అది నాకు తెల్సింది. నీకు తెలవక పొతే నీ కర్మ!! ఇదే మాట రాములోరు రావణుడి కర్మలు సేయను అని ఇబీసనుడు అంటే నువ్వు సేయ్యకపోతే నేను సేత్తాను అన్నాడు నువ్వు రామాయణం ఇన్నావా లేదా అసలు ?