కాకి దాహం

Spread the love
Like-o-Meter
[Total: 0 Average: 0]

అనగనగా ఓ ఆంధ్రా కాకి. దానికి దాహం వేసింది.

నీళ్ళకోసం తెలంగాణా, కోస్తా, రాయలసీమ జిల్లాలన్నీ వెతగ్గా, వెతగ్గా చివరకు మహారాష్ట్ర  సరిహద్దుల్లో ఒక కుండ కనిపించింది.

కానీ, అందులో నీళ్ళు కాకికి అందనంత అడుగున వున్నాయి. ఆలోచించగా ఆలోచించగా కాకికి ఒక మెరుపులాంటి ఆలోచన తట్టింది.

వెంటనే ఎగురుకుంటూ రాయలసీమ వైపుకు వెళ్ళి, చిన్న చిన్న రాళ్ళు (బాంబులు కాదు) ఒక్కోటి తీసుకువచ్చి, కుండలో వేయసాగింది. క్రమంగా నీళ్లు పైకి వస్తున్నాయి. ఇక ఒక రాయి వేస్తే చాలు, కుండలోని నీళ్లు కాకికి అందుతాయి.

కాకి రివ్వుమంటూ ఉత్సాహంగా వెళ్ళి, చివరి రాయి తీసుకొచ్చేసరికి, ఆ కుండ మీద మరో కాకి కూర్చుని వుంది. అది పెద్ద ముక్కుతో బాగా బలిష్టంగా వుంది.

ఆంధ్రాకాకి దగ్గరకు వెళ్ళేసరికే ఆ కొత్త కాకి కుండలో నీళ్ళను బాగా సిప్ చేసి, తడి ముక్కుని తన రెక్కలకేసి తుడుచుకుంటూ వుంది.

ఆంధ్రా కాకి ఉస్సూరుమని కూలబడి, ఎదురుగా వున్న ఆ పెద్ద కాకిని ఏమీ చెయ్యలేక కుమిలిపోతూ.. “నీ దాహం తీరింది కదా? నాకూ ఒక చిన్న ఛాన్స్ ఇవ్వొచ్చుగా”‘ అని, దీనంగా అడిగింది.

“అమ్మో ఇంకేమైనా వుందా? ఈ మిగిలిన నీళ్లు నా బిడ్డక్కూడా కావాలి” అందా పెద్ద కాకి.

“నీ బిడ్డా? ఎక్కడున్నాడు” అంటూ చుట్టూ చూసింది ఆంధ్రాకాకి.

“ఇక్కడ లేడు, భవిష్యత్తులో రావొచ్చు!” గడుసుగా అందా బలిసిన కాకి.

“అంటే?!!”

“అంటే ఏముంది, అర్ఠం కాలేదా? నాకు ఇంకా పెళ్ళి కాలేదు !” సిగ్గుపడ్తూ అంది ఆ కాకి.

“మరి నీ పెళ్ళెప్పుడు జరుగుతుంది?” ఆంధ్రాకాకి నీరసంగా అడిగింది.

“అప్పుడేనా? మాకులంలో మంచి సంబంధం దొరకొద్దూ?” చెప్పిందది.

“ఇంత అతి తెలివిగా మాట్లాడుతున్నావు! ఇంతకీ నీ పేరేంటి?” అడిగింది తెలుగు కాకి.

“ముద్దుగా, బొద్దుగా వుంటానని నన్ను అందరూ ‘బాబ్లీ’ అంటారు!!” వయ్యారాలు పోతూ చెప్పిందది.

@@@@@ 

Your views are valuable to us!