క్యా హోగా కాలియా?

Spread the love
Like-o-Meter
[Total: 0 Average: 0]

గబ్బర్ సింగ్ గడ్డం దువ్వుకొంటున్నాడు. సాంబా మాక్ డోనాల్డ్ తాగుతున్నాడు. మిగతా చోటామోటా డాకూలంతా తుపాకుల్ని పిసుకుతున్నారు. అంతలో, హటాత్తుగా…

“అబ్ క్యా హోగా కాలియా?” అని అరిచాడు గబ్బర్.

అప్పుడే కునుకులోకి జారుకొంటున్న కాలియా ఉలిక్కిపడి “స్స..స్సర్కార్! కిస్కా క్యా హోనా?” అన్నాడు కంగారుగా.

“అబే కాలియా! ఐపిఎల్ గురించి అడుగుతున్నానురా! ఏం జరుగుతోందో అర్ధం కావడంలేదు. నిన్ననే అక్కడి ఖజానా చూసుకొచ్చావు కదా, నీకేమైన అడిషనల్ ఇన్ఫర్మేషన్ చిక్కిందా?”

“జీ జీ! సర్కార్! ఉంది. దొరికింది.”

“గూట్లే! చెప్పు మరి. లేకుంటే…తేరే హాథ్ దే కాలియా…తేరే హాథ్ దే!”

“వద్దు సర్కార్! చేతుల్నిచ్చి కాళ్ళతో తుపాకీ పేల్చలేను. నిన్న విన్న సమాచారమంతా ఇప్పుడే చెప్పేస్తాను.” అన్నాడు కాలియా తుపాకీ గొట్టంలోకి చెమట కార్చుకొంటూ!

“హహా..హహా! బోల్ కాలియా బోల్” అన్నాడు గబ్బర్ పిచ్చిగా గడ్డం గోక్కుంటూ.

“సర్కార్! నిన్న రాత్రి, ఠీక్ మిడ్ నైట్, నేను ఐపిఎల్ హెడ్డాఫీసులోకి దూరాను. సీసీ కెమరాల్ను, గుర్రెట్టుతున్న సెక్యూరిటీలను, మోషన్ సెన్సార్ లైట్లని తప్పించుకొంటూ…”

“అబే కాలియా! నీ గుండులో తుపాకీ గుండు దిగడం ఖాయం!”అన్నాడు గబ్బర్ తన రివాల్వర్ గొట్టాన్ని నోట్లో పెట్టుకొని.


“హుషారు సర్కార్! మీ ఉంగిలీ ట్రిగ్గర్ పైనే ఉంది” అన్నాడు సాంబా.

“అరేవో సాంబా! తూ బహుత్ హోషియార్ హై రే” అన్నాడు గబ్బర్ హుషారుగా. ఈసారి రివాల్వర్ గొట్టాన్ని కాలియా వైపు గురిపెట్టి.

“స్స…స్సర్కార్! డిస్క్రిప్షన్లు ఆపి ఇన్ఫర్మేషన్లోకి వస్తాను. నేను ఐపిఎల్ హెడ్డాఫీసులో ఉన్నప్పుడు శరద్ పవార్ అండ్ రాజీవ్ శుక్లాలు గూడుఫుఠాణీ రూములో ఉన్నారు. అంటే డిస్కషన్ రూంలో! వాళ్ళిద్దరూ ఐపిఎల్ ను జాతీయం చెయ్యాలని మాట్లాడుకొంటున్నారు.”

“సాంబా! మన భాషలో జాతీయం చెయ్యడమంటే…..”

“దొబ్బేయ్యడమే సర్కార్”

“అంతేనా కాలియా?”

“కాదు సర్కార్! వాళ్ళ భాషలో జాతీయం చెయ్యడమంటే ప్రభుత్వమే తీసేసుకోవడం.” అన్నాడు కాలియా.

“హా…హా..హా..వాళ్ళ భాషకీ, మన భాషకీ కొంచెమేలే తేడా కాలియా! ప్లీజ్ గో ఆన్” అన్నాడు గబ్బర్.

కాలియా కొనసాగించాడు –

శరద్ పవార్: “శుక్లాజీ! మనం ఐపిఎల్ ను నేషనలైజ్ చేస్తే ఎట్లా ఉంటుంది”

శుక్లా: “బేషక్ చెయ్యొచ్చు పవార్జీ!”

పవార్: “ఎలా చెయ్యొచ్చో మీరే చెప్పండి శుక్లాజీ!”

శుక్లా: “సింపుల్ పవార్జీ. మన ఇందిరమ్మలా ఇరవై సూత్రాల పధకాన్ని ప్రకటిద్దాం.”

పవార్: “వహ్వా! ఒక్కొక్క పాయంటే చెప్పండి లాప్ టాప్లో టైప్ చేసిపెట్టుకొంటా”

శుక్లా: “ఓకే! రాసుకోండి.

1. ఐపిఎల్ కమీషనర్గా ఒక ఐఏఎస్ అధికారిని వేద్దాం. బలహీన వర్గాలకు, మైనార్టీలకు ప్రాముఖ్యతను ఇద్దాం.

2. కార్పొరేట్ కంపెనీలకు బదులుగా గుర్తింపు పొందిన జాతీయా పార్టీలకు, పెద్ద పెద్ద ప్రాంతీయ పార్టీలకు ఫ్రాంచైజీలిద్దాం. ఉదాహరణకు సోనియా బ్రిగేడ్. కమల్ దళ్, సైకిల్ సైక్లోన్స్, సన్ నెట్ వర్కర్స్ వగైరా వగైరా.”

పవార్: “సారీ ఫర్ ది ఇంటర్ప్షన్. పార్టీలు చీలిపోతే చీలికలు కూడా ఫ్రాంచైజీలు తీసుకోవచ్చా? ఫరెగ్జాంపుల్ డిఎంకే ఎస్ డిఎంకే (స్టాలిన్ డిఎంకె), ఏజిడిఎంకే (అళగిరి డిఎంకే) గా చీలిపోతే ఏం చెయ్యాలి?”

శుక్లా: “మంచి ప్రశ్న పవార్జీ. ఇది మీ రాజనీతి పరిణితి నిదర్శనం. అలా ఒక పార్టీ విడిపోయినప్పుడు మనం మళ్ళీ బిడ్డింగ్ పెడదాం. ఏ చీలిక ఎక్కువ బిడ్ చేస్తుందో ఆ చీలికకు ఫ్రాంచైజీ దక్కుతుంది. మరి పాత బిడ్డింగ్ డబ్బులేమౌతాయని మీరడగొచ్చు. ఆ డబ్బుల్లో 50% ఐపిఎల్ దగ్గర ఉండిపోతుంది. మిగతా 50% చీర్ లీడర్స్ వెల్ఫేర్ ఫండ్ లోకి వెళ్ళిపోతుంది.”

పవార్: “వెరీ గుడ్ ఐడియా! పూర్ గాల్స్ పిచ్చిపిచ్చిగా ఎగిరి ఎముకలు విరగ్గొట్టుకొనే అవకాశలున్నాయి. వాళ్ళకి వెల్ఫేర్ ఫండ్ చాలా అవసరం. నెక్స్ట్ పాయంట్స్ చెప్పండి.”

శుక్లా: “4. ఫ్రాంచైజీలు కాకుండా ప్లేయర్సే తమ రేటును తామే కోట్ చేసి బిడ్డింగ్ మొదలు పెడ్తారు. ఫ్రాంచైజీలు ఆ బిడ్డింగును తగ్గిస్తూ పోతాయి. ఎక్కడైతే ప్లేయరు మరియు ఫ్రాంచైజీలు ఒక అంగీకారానికి వస్తారో ఆ బిడ్డింగును మన సుత్తిగాడు సుత్తితో కొట్టి ఫైనలైజ్ చేస్తాడు.”

పవార్: “ఫెంటాస్టిక్”

శుక్లా: “5. స్ట్రటీజిక్ టైమౌట్లో కమర్షియల్ యాడ్స్ కు బదులు పొలిటికల్ యాడ్స్ పెడదాం.”

పవార్: “గ్రేట్ ఐడియా బట్ డేంజరస్ గా కనబడ్తోంది. ఎగస్పార్టీలకు ఎక్కువ మైలేజీ వస్తే?”

శుక్లా: “డోంట్ వర్రీ పవార్జీ! స్ట్రటీజిక్ టైమౌట్ బిడ్ మన పార్టీకే వస్తుంది. ఎందుకంటే మనం జస్ట్ వన్ రుపీ బిడ్డింగ్ చేస్తాం, in the interest of the national integrity. మన స్కీం తెలియని ప్రతిపక్షాలు లక్షలు, కోట్లలో కమర్షియల్ బిడ్డింగ్ చేసి ఓడిపోతారు.”

పవార్: “వామ్మో శుక్లాజీ! మీ బుర్ర అగ్గిపుల్ల.”

శుక్లా: “ఇప్పుడు చెప్పబోయే పాయంట్లు చాలా మహత్తరమైనవి…

6. టీం ప్లేయర్స్ లో కనీసం 33% స్త్రీలు ఉండాలి.

7. స్త్రీ ఆటగాళ్ళు 22 గజాలకు బదులుగా 14.74 గజాలు మాత్రమే పరుగెడతారు.

8. బలహీనవర్గాల ప్లేయర్స్ కు 10 సంవత్సరాల వయోపరిమితి సడలింపు ఉంటుంది.

9. మైనార్టీలకు 5 సంవత్సరాల సడలింపు ఉంటుంది.

10. బలహీన వర్గాల మగ ఆటగాళ్ళు 18 గజాలు మాత్రమే పరుగెడతారు.

“11. స్త్రీలకు, బలహీన, మైనార్టీ ఆటగాళ్ళకి రనౌట్లు వర్తించవు. నోబాల్స్ ఉండవు.

12. ఒకవేళ స్త్రీలు, బలహీన, మైనార్టీ ఆటగాళ్ళు థర్ ఎంపైర్ నిర్ణయంవల్ల ఔటైతే వాళ్ళు దాన్ని పాటించనవసరం లేదు.”

పవార్: “శుక్లాజీ! మీరు చెప్పిన పాయంట్లు ముఖ్యమైనవే కాదు విప్లవాత్మకమైనవి కూడా.”

శుక్లా: “ధన్యవాదాలు పవార్జీ.

13. ఐపిఎల్ టికెట్లు ప్రభుత్వ ఖజనాల్లోను, ఆసుపత్రుల్లోను, పోస్టాఫీసుల్లోను దొరుకుతాయి.

14. టికెట్లలో 33% స్త్రీలకు, 7% మైనార్టీలకు, 10% అంగవికలురకు , 25% ప్రభుత్వోద్యోగులకు, 5% రిటైర్డ్ ప్రభుత్వోద్యోగులకు, 5% సైనికులకు, 5% మాజీ సైనికులకు, 5% మాజీ ఆటగాళ్ళకు కేటాయించబడతాయి.

15. మ్యచ్ జరిగే పట్టణంలో లైవ్ టెలికాస్ట్ ఉండదు. బదులుగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన తాత్కాలిక శిబిరాల్లో పెద్ద స్క్రీన్ పైన మ్యాచ్ చూడొచ్చు.”

పవార్: “దీనివల్ల మనకేం బెనిఫిట్ శుక్లాజీ?”

శుక్లా: “చాలా వుంది పవార్జీ. ఆ శిబిరాల్లోకి మనం అడుగు, బడుగు వర్గాలనే అనుమతిస్తాం. వాళ్ళకి అక్కడే మధ్యాహ్న భోజన పధకాన్ని, రాత్రికి రొట్టె-పాలు పధకాన్ని అమలుచేస్తాం. తెరచిన చెయ్యి షేపులో వుండే ప్లేట్లలో తిండిని సప్లై చేద్దాం.”

పవార్: “శుక్లాజీ యూ ఆరే జీనియస్”

శుక్లా:” 16. మ్యాచులైపోయిన తర్వాత నైట్ పార్టీలను నిషేధించుతాం. దానికి బదులుగా సోనియాగాంధి, రాహుల్ గాంధి, ప్రియాంకాగాంధీలతో ఉద్బోధనా దివస్ లు లేక రాత్ లు నిర్వహిస్తాం.

17. ఐపిఎల్ ఆటగాళ్ళు టీవీ కమర్షియల్స్ లో నటించడానికి ప్రభుత్వ అనుమతి తప్పనిసరని చెబుదాం. అలాగే సంవత్సరంలో వారం రోజులు, ఎలక్షన్ల టైంలో పదిహేను రోజులు ప్రభుత్వ ప్రకటనల్లో నటించాలి. అదీ ఫ్రీగా.

18. ఆటగాళ్ళ ఆదాయం పై ఆదాయ పన్ను రాయితీ ఉంటుంది provided వాళ్ళు మన పార్టీ సభ్యత్వం తీసుకొంటే.

19. ఏ రాష్ట్రమూ, ఏ ప్రతిపక్షపార్టీ లేక ఏ ఒక్క పౌరుడైనా తన స్వంత ఫార్మాటును ప్రారంభించలేనట్టు రాజ్యాంగాన్ని సవరిస్తాం.

20. చివరగా మ్యాచులు చూడ్డానికి వచ్చే ప్రేక్షకులకు నిరోధ్ ప్యాకెట్లు, గర్భనిరోధక మాత్రలు, ఓరల్ రీహైడ్రేషన్ ప్యాకెట్లు ఉచితంగా ఇస్తాం.”

పవార్: “—–“

శుక్లా: ” ఛా ఛా ఛా ! లేవండి పవార్జీ! మీరు నాకంటే పెద్దలు…ఇలా నా కాళ్ళు పట్టుకోవడం బాగాలేదు.”

*********

“ఇదీ సర్కార్ నేను విన్నది, కన్నది, గుర్తుంచుకొన్నది” అన్నాడు కాలియా భయభయంగా.

“కాలియా! బహుత్ ఖూబ్! ఏ ఒక్క పౌరుడూ ఐపిల్ ఫార్మాట్ను ప్రారంభించకుండా ఆపుతుందా ఈ ప్రభుత్వము. హా….అరచేతితో సూర్యుణ్ణి, తుపాకీతో విప్లవాన్ని, చట్టాలతో గబ్బర్ను ఎవ్వరూ ఆపలేరు.

అరేవో సాంబా! మహాచోరుడు, సైడు దెబ్బల వీరుడైన మలాన్ సింగును పిలువు. బందిపోటుతనంలో ఆడపెత్తనాన్ని సుస్థాపితం చేసిన తోబుట్టువు ఫూలన్ దేవినీ పిలువు. బులావోరే హమారీ డాకు సాథియోంకో! హమ్ షురూ కరేంగే డాకూ ప్లేయింగ్ లీగ్. దేఖ్తా హు కౌన్ రోకేగా..”

డాకూలందరూ తుపాకులు పేల్చారు. పాపం, పాపమెరుగని కాకి ఒక్కటి రాలిపోయింది.

Your views are valuable to us!