నంగిరి ప్రశ్నలు – తింగరి సమాధానాలు

Spread the love
Like-o-Meter
[Total: 0 Average: 0]

“నమస్కారాలు గురూ!”

“వెర్రోహం! పరగడుపునే ఈ నా మస్కాలేమిటిరా శిష్యా!”

“గురూ! మార్నింగ్ మార్నింగ్ కొన్ని విచిత్రమైన అనుమానాలు పుట్టుకొచ్చాయి. అడగమంటారా?”

“అడుసు కడుక్కోడానికే, అనుమానం తీర్చుకోడానికే పుట్టాయిరా అక్కు శిష్య పక్షీ. అడుక్కో కడుక్కో”

“ధన్యోస్మి! పృష్ట తాడనాత్ దంతభంగః అంటే ఏమిటి గురూ?”

“వైయెస్సార్ విగ్రహాల్ని తొలగించాలన్న వెంటనే అంబేడ్కర్ విగ్రహాలు కూలిపోవడమురా!”

“మరి, అమ్ముకోవడానికి, నమ్ముకోవడానికి తేడా ఏమిటి గురూ?”

“ఒక పెద్దహీరో తాను పార్టీ పెట్టిన రెండున్నరేళ్ళకే అంగడి కట్టేయడం మొదటిది నాయనా. ఇంకో పెద్దహీరో నాన్నగారు పెట్టిన పార్టీలో కనీస మద్దతుధర పలుకుతుందేమోనని బరిలోకి దిగడం రెండోది నాయనా!”

“అ..ఆ(….మన పుణ్యభూమిలో వేంకటగిరి, కరిగిరి, వరాహగిరి మొదలైనవే కాకుండా గుండాగిరీ, దాదాగిరీ, గాంధీగిరీలాంటివి కూడా ఉన్నాయి! కొత్తగా గిరులేమైనా పుట్టాయా గురూ?”

“రెండు నెల్ల క్రితం బెంగాలులో దీదీగిరి పుట్టిందిరా. ఏకు మేకై, మేకు గునపమై, కుతుబ్ మినార్ కూకటివేళ్ళను తవ్వుతోందిరా!”

“ఉ..ఊ(….చివరి అనుమానం గురూ!”

“అంటే అంత్యానుమానం. అలా అడిగి ఇలా కడిగేసుకోరా పక్షీ!”

“పగటిపూట చుక్కలు ఎప్పుడు కనబడ్తాయి గురూ?”

“భారతదేశంలో, ఉత్తరప్రదేశ్ లో, ఎన్నికలొచ్చినప్పుడు, మాయావతీ బెహెన్ రాజ్యమేలుతున్నప్పుడు, బహు జనులకు అవి అగుపడతవిరా!”

“ఎ…ఏ…మిటీ?”

“ఎందుకురా అంత ఆశ్చర్యం?”

“మీరు చెప్పిన సమాధానాలతో నాలోని అనుమానం అంతం కాక అమాంతంగా పెరిగిపోతోంది గురూ!”

“అండపిండబ్రహ్మాండంలోని ఒకానొక దండుగమారీ! అనుమానం పెనుభూతం. భూతం లేనిదే భవిష్యత్తు లేదు. భవిష్యత్తు కోసమే వర్తమానం ఉంది. మూడుకాలాల్లోనూ కీడు మూడడమే సగటు భారతీయుడిగా నీకున్న ఏకైక సుఖభోగం. పో…అనుభవించు. అనుమానంతో తరించు. ఈలోపు కాసేపలా గాలిలో మాయనై, లోటస్సులో పాండునై, అడవిలో గన్నునై నేను యోగవిహారం చేసొస్తా….”

[శిష్యుడు మూర్ఛిల్లును. గురువు మాయాతీవాచీని అధిరోహించి తరలును.]

Your views are valuable to us!