రైన్ రైన్ గో అవే

Spread the love
Like-o-Meter
[Total: 0 Average: 0]

ఎప్పట్లాగే,  అటక మీద వున్న విత్తనాల మూటను వీపుమీదకు దించుకుని, పొలంవైపుకు మౌనంగా మోసుకుపోతున్నాడు ఓ వెర్రి రైతు.
 
“పట్టెడన్నం కోసం, పట్టుదలగా ప్రయత్నిస్తూ, ప్రతిసారి నువ్వు పడే కష్టాలు చూస్తుంటే, తెగ జాలి  పుడుతొంది తమ్ముడూ!”  అంటూ మూటలోనుంచి  మాటలు వినిపించాయి.
 
“వాతావరణ శాఖ వాళ్ళు ఈ సంవత్సరం వర్షాలు చాలా తక్కువగా పడ్తాయని చెప్పారు, మామూలుగా ఎప్పుడూ వాళ్ళు చెప్పిందానికి  విరుద్దంగానే జరుగుతుంది గనక ఈసారి నా పంట పండినట్టే!” రైతు నమ్మకంగా బదులిచ్చాడు.
“నీ పట్టుదలను చూస్తుంటే, నాగలితో యమునా నది గమనాన్ని ద్వారక వైపు దారి మళ్ళించిన బలరాముడు గుర్తుకు వస్తున్నాడు. కానీ నన్ను కూడా సరిగా మొయ్యలేని నీ బలాన్ని గమనిస్తే మాత్రం పిల్లకాలువను కూడా నీ పొలంవైపుకు రప్పించుకోలేని బలహీనత కనిపిస్తోంది.” ఎగతాళిగా అంది విత్తనాల మూట.
“నా నమ్మకం నాకుంది, అట్టే అల్లరిచేయకుండా బుద్దిగా వుండు.” కోపంగా అన్నాడు రైతు.
“నీ అమాయకత్వం చూస్తూ మాట్లాడకుండా ఎలా వుండమంటావు? మనుషులు బ్రతకాలంటే ఆక్సిజన్ వుంటే సరిపోతుంది. దానికి ఋజువులు కావాలంటే కర్నూలు, హైద్రాబాదు, తిరుపతి పట్టణాల్లోని ప్రభుత్వ దవాఖానాల్లో ఆక్సిజన్ అందక పిట్టల్లా రాలిపోతున్న పసికందుల తల్లిదండ్రుల్ని అడిగి చూడు. అలాగే పంట ఎదగాలంటే  ఆక్సిజన్ తో పాటుగా హైడ్రోజన్ కూడా కావాలి. అంటే H2O  కావాలి.   అంటే నీళ్ళు కావాలి. ఎలాంటి నమ్మకంతో నువ్వు ఇలాంటి సాహసానికి పూనుకుంటున్నావో గానీ నీ ప్రయాస చూస్తుంటే నాకు జాలి పుడ్తోంది.” అందా విత్తనాల మూట.
“పైన దేవుడంటూ ఒకడున్నాడు.. అంతా ఆయనే చూసుకుంటాడూ..” అంటూ  రైతు నడక కొనసాగించాడు.
“ఆంధ్రరాష్ట్రమంతా పదే పదే ఈ మాటను ఎక్కడో విన్నట్టుందే ??” అనుకుంటూ దీర్ఘాలోచనలో పడిపోయింది విత్తనాల మూట.
***    ***    ***    ***    ***   ***

 

Buy this eBook on Amazon Kindle
 

ఉదయం నుంచీ బ్రహ్మదేవుడు ఎందుకో అసహనంగా వున్నాడు.
“ఎందుకిలా వున్నారు నాథా?” అంటూ అడిగింది సరస్వతీదేవి.
“క్యాబినేట్ లో ఎవరి శాఖలు వారికి కేటాయించారు కదా? ఆ వాయుదేవుడు, వరుణ దేవుడు ఎవరి పని వారు చేయక, ఒకరిపనిలో మరొకరు తలదూర్చుచున్నారు. మేఘం లేని చోట గాలి వీచి చెట్లన్నీ కూలిపోవుచున్నవి. వాన లేని ప్రదేశాల్లో వరదలొచ్చి, వూర్లకు వూర్లే మునిగిపోవుచున్నవి! గాడి తప్పిన ఈ వ్యవస్థ ఆంధ్రప్రదేశ్ లోని పాలనవలె అస్తవ్యస్తమై పోవుచున్నది.!!” చెప్పాడు బ్రహ్మదేవుడు.
“ఇంతకీ ఏమైనది స్వామీ?” ఆత్రుతగా అడిగింది సరస్వతి.
“సమయానికి వర్షాలు కురవక, పంటలు పండక, వ్యవసాయము దండగన్న ఆ చంద్రసేనుడి ఎక్కెసము నిజమేనన్నట్టు, ఈ రైతుల బ్రతుకులు బక్కచిక్కిపోతున్నవి దేవీ! దీనికి కారణము నేను కాదని తెలియక, నుదిటిమీద రాత రాసాను కాబట్టి, నిందలు నా మీదే వేయుచున్నారు..” బాధ అన్నాడు బ్రహ్మ.
“దీనికి ఏదైనా పరిష్కారము లేదా ప్రభూ??” – సరస్వతి అడిగింది.
పది నిమిషాలు  సుదీర్ఘంగా ఆలోచించిన బ్రహ్మ, ఏదో ఆలోచన తట్టిన వాడై, తటాలున లేచి, “పరిష్కారము దొరికినది! ఎవరక్కడ??”  అని పిలిచాడు.
***   ***   ***   ***   ***   ***

 

పికాసో సరికొత్త కుంచెను బ్రహ్మ చేతికి అందించాడు.
ఆ ప్రక్కనే తెల్లరంగు పైంట్ డబ్బాతో మైకిలాంజిలో నిలబడి వున్నాడు.
బ్రహ్మదేవుడు కుంచెను తెల్లరంగులో ముంచి, ఆకాశం కాన్వాసుమీద, పెద్ద పెద్ద మేఘాల్ని గీసాడు.
ఇంతలో ఎక్కడ్నుంచి వచ్చాడో ఎఫ్.ఎం. హుస్సేన్ ఆ తెల్లటి మేఘాల్ని చూసి, చొంగ కార్చుకుంటూ “ఆహా! ఏ దేవత విప్పేసిన బట్టలివి? ఎంత అందగా వున్నాయి. బట్టలే ఇంత అందంగా వుంటే ఆమె ఎవరో, ఎంత అందంగా వుంటుందో..తనతో గజగామిని రెండో పార్టు తీస్తే హిట్టే హిట్టు. ” అంటూ లొట్టలు వేస్తున్నాడు.
ఆ ప్రక్కనే నిలబడి చోద్యం చూస్తున్న వెంకటరమణ గారు – “చస్ నోర్మూసుకో.. కామంతో కళ్ళు కప్పుకుపోయిన మడిసికి కళాపోసన  పనికిరాదు.” అంటూ హుస్సేన్ని కసిరారు.
సాల్విడార్ డాలి నల్లరంగు వున్న పైంట్ డబ్బాల్ని బ్రహ్మ ముందుంచాడు.
బ్రహ్మ కుంచెను నల్లరంగు లోకి బాగా ముంచి, తను గీసిన మేఘాల మీదంతా పులిమినాడు. తర్వాత వెండిరంగు తో
మెరుపుల్ని గీసి, వాటిని మేఘాల అంచులకు అతికించినాడు. ఎఫెక్ట్ కోసం మేఘాల వెనుక లక్ష వాట్ల వురుముల శబ్ధంతో వినిపించే స్పీకర్లను పెట్టాడు.
తర్వాత…
***    ****    ****    ****    ***

 

ఆకాశం నిండా మేఘాలు కమ్ముకున్నాయి. దాంతోటే భయపెట్టే వురుములూ, మెరుపులూ..
.
రైతు ముఖంలో ఆనందం వెల్లివిరిసింది.
గంట గడిచింది. రెండు గంటలు, మూడు గంటలు గడిచాయి. ఒక్క చినుకూ పడ్డం లేదు.
నడుమొంగిన పైరు, నీరసించిన రైతు- కారుమబ్బులు నిండిన ఆకాశం వంక అలా ఆశగా చూస్తూనే వున్నారు.
***    ****    ***    ***   ***

 

“అదేంటి బ్రహ్మదేవా? నల్లటి మేఘాల్ని గీసారు, వురుముల్ని మెరుపుల్ని చిత్రించారు, వానచుక్కల్ని ఎందుకు గీయలేక పోయారు??!!” అక్కడున్న మహామహా ఆర్టిస్టులంతా ఆశ్చర్యంగా అడిగారు.
అంతసేపూ నడుం మీద చేతులుంచుకుని, తన బొమ్మను తానే విరక్తిగా తిలకిస్తున్న బ్రహ్మదేవుడికి వారు అడిగిన ప్రశ్న వినగానే పట్టలేని కోపమొచ్చింది.
“వెర్రిముఖాల్లారా! ఆలోచనా జ్ఞానం వుందా? లేదా? మీరంతా చదువుకున్న వారేనా కాదా!!” అంటూ ఆవేశంగా రంకెలేసాడు.
“ఏమైంది నాథా.. ఎందుకంత ఆవేశం? మీ సమస్య ఏంటో నాకు చెప్పండి.” ఆందోళనగా అడిగింది సరస్వతి.
“చూడు సరస్వతీ వీళ్ళ మూర్ఖత్వం! ఐదో క్లాసు సైన్స్ పుస్తకంలో ‘నీటి’ గురించి ఏం రాసుంది? స్వచ్ఛమైన నీటికి రంగు, రుచి, వాసనా వుండదూ అనే కదా! మరి మేఘాల్లోంచి వచ్చే స్వచ్ఛమైన వానచినుకు ఏ రంగులో వుంటుందో నాకెలా తెలుస్తుంది? చినుకుల్లో వుండే వర్ణం బ్రహ్మ రహస్యం కదా? అది ఎక్కడ దొరుకుతుందో ఎలా చెప్పడం? అందుకే వర్షపు చుక్కల్ని గీయలేక పోయాను. వానను కురిపించలేక పోయాను.!!” దీనంగా చెప్పాడు బ్రహ్మ.
***   ***   ***   ***  ****    ***

 

పోగల రేకులు అనే టీవి ధారావాహికలా, జగ్గన్న ఓదార్పుయాత్రలా, జగ్గన్న మీద సి.బి.ఐ. వారి ఎంక్వయిరీలా రైతు బ్రతుకులో కరువు కొనసాగుతూనే వుంది.
***   ***   ***   ***  ****    ***
 

Your views are valuable to us!