రాజుగారి క్రీడాభిరామం

Spread the love
Like-o-Meter
[Total: 0 Average: 0]

ఎట్టకేళకి  ‘మీ గ్యాస్ మీకే’ పథకాన్ని చేజిక్కించుకుని, స్వరాష్ట్రానికి తిరిగొచ్చిన ముఖ్యమంత్రి గారి ముఖం గ్యాస్ ఆధారిత విద్యుత్ ప్లాంట్లా వెలిగిపోతోంది.


కానీ..

ఈ సందర్భాన్ని సంబరంగా చేసుకునేందుకు సహచరులెవరూ సుముఖంగా లేకపోవడంతో, సి.యం. గారు చిర్రెత్తిపోయారు.

ఇంతకీ అంతిమ లబ్దిదారుడెవరో తేలనప్పటికీ, అధికారపక్షం గొంతుమీద గ్యాసు బండను గుదిబండలా అదింపెట్టి నానా అల్లరి చేసాం కాబట్టి,ఈ విజయం మాదంటే మాదని ప్రతిపక్షాలు తమ తమ పార్టీ ఆఫీసుల ముందు, పటాసుల్ని పేల్చుకుంటూ పండగ చేసేసుకుంటున్నాయి.

క్రెడిట్ మొత్తం ఇలా కబ్జాకి గురవుతుంటే తట్టుకోలేక, తన గ్యాసు ని జనాల దగ్గరే వెళ్ళబోసుకోవాలని, ఇందిరమ్మ బాట పట్టాడు సి.యం.

అసలే తీవ్రవాదుల ప్రాబల్యం, మన పరిపాలన మీద అతి తీవ్రంగా వున్న ప్రజాగ్రహం. ఈ బాట మనకు చేటు తెస్తుందేమో సార్! పోలీస్ శాఖామాత్యులు గొణిగారు.

ఒకవేళ మీకేమైనా ఐతే, మా పరిస్థితి ఏంటి ? అంటూ, అధికారపక్ష అద్యక్షుడు ‘మాకేంటి’ అన్నట్టు అనుమానంగా అడిగాడు.

తన బుల్లి ‘రాజ్యాన్ని’ అధికార పార్టీలోకి కలిపేసి, రాజ్యాధికారం మొత్తం తనచేతికి ఎప్పుడొస్తుందా అన్నట్టు, గడప దగ్గర నక్కి కూర్చున్న ఓ ఆశాజీవి, మీరు పోతే, నన్ను నమ్ముకున్న నా వాళ్ళు ఏమైపోవాలంటూ నిట్టూర్చాడు.

ఇలా కాదనుకున్న సి.యం. ముఖ్యనాయకులందరకీ తలా ఒక్కో జిల్లా రాసిచ్చేసాడు. “ఇదిగో నీకు కడప, నీకు నెల్లూరు, నీకు కృష్ణ, నీకు అదిలాబాద్…”

ముఖ్యమంత్రి గారి త్యాగనిరతికి కరిగిపోయిన ఓ అనుంగు సహచరుడు, అన్నీ మాకిచ్చేస్తే మరి మీకూ అంటూ కన్నీళ్ళు పెట్టుకున్నాడు.


నాకు  ముందుగా ఖమ్మం., అక్కడికే నా పయనం. అంటూ, బయల్దేరాడు సి.యం.

**  **  **  **  **

ముందు ముప్పై, వెనుక ముప్పై వాహనాల భారీ కాన్వాయ్ తో రోడ్ షో.

తర్వాత కళాకాంతి లేని యువకిరణాలతో మాటామంతీలో, తను ఒంటరిగా పోరాడి, రాష్ట్రానికి గ్యాస్ ఎలా తీసుకువచ్చాడో గొప్పలు చెప్పుకున్నాడు.  

పావులావడ్డీ రుణం తీసుకున్న పాపానికి, బలవంతంగా సభకు తోలుకురాబడ్డ రుణగ్రస్తులతో చిట్ చాట్ లో, సైంధవుడిలా అడ్డుపడి గ్యాస్ ప్రక్క రాష్ట్రాలకు పోకుండా ఎలా కాపాడుకున్నాడో స్వంత డబ్బాలు కొట్టుకున్నాడు

పగలు రోడ్ షో ఐపోయాక, రాత్రికి నైట్ షో లో భాగంగా  భూలోక నరక కూపాల్లాంటి ప్రభుత్వ హాస్ట్లల్స్ లో బస చెసాడు.
 
హైద్రాబాద్ నుంచి తనకోసం స్పెషల్ గా తెప్పించుకున్న ధంకీ బిరియాని, మేలురకం మసూరా బియ్యంతో వండిన భోజనం, ఆరు రకాల కూరలు,అవి అరగడానికి బిస్లరీ సోడాలు.. వీటన్నిటితో సహపంక్తి భోజనం అనే పథకం పెట్టాలని అనుకున్నారు గానీ..దశాబ్దాల తరబడీ.. మగ్గిన బియ్యం, పురుగుల్ని తరిమికొట్టి, వండిపెట్టబడే పుచ్చు కాయగూరలు, పప్పు అనుకుని భ్రమపడే పసుపురంగు వేడినీటి తెట్టు.., వీటికి అలవాటు పడ్డ పేదవిద్యార్థులకు సహపంక్తి భోజనం సహించక, రాత్రంతా ఒకటే వాంతులు, విరేచనాలు.
రెండో రోజు యథాప్రకారం, ప్రెస్ కి ఫోటో ఫోజులివ్వడం కోసం పిల్లలతో కాసేపు క్రికెట్ కాలక్షేపం మొదలైంది. తనుగాని రాజకీయాల్లో రాకపోయి వున్నట్లైతే, తెండూల్కర్ తో ఇండియా టీం కి అవసరం వుండేది కాదని సి.యం. గారి ప్రగాఢ విశ్వాసం. అందుకే ఎక్కడికి వెళ్ళినా, తనతో పాటుగా క్రికెట్ బ్యాటు పట్టుకెళ్తుంటాడు.

ప్రభుత్వ అధికార్లు, అప్పటికప్పుడు చుట్టూవున్న చెట్టు చేమల్ని చదును చేసి, ఓ చిన్న చేపాక్ స్టేడియం ని సిద్దం చేసారు.

సి.యం గారి బ్యాట్ కి బంతిని విసరడానికి ఒక బక్కపలుచని పిల్లోడ్ని ఎంపిక చేసారు.

ముఖ్యమంత్రి పరిపాలన మీద కోపమో, బలవంతంగా తినిపించబడుతున్న రూపాయి కిలోబియ్యం వల్ల వచ్చిన పౌరుషమో తెలీదు గానీ..

ఆ పిల్లోడు నిమిషానికి నూటయాభై కిలోమీటర్ల వేగంతో బంతిని విసిరాడు. తనమీద తనకున్న అపరిమితమైన అహంకారంతో, ముందుజాగ్రత్తగా ఎటువంటీ శిరస్త్రాణాలు ధరించకుండా, సిక్సర్ బాదుకుందామని ముందుకు  వురికిన ముఖ్యమంత్రి ముక్కు మూడు ముక్కలైంది.

మూర్చబోతూ.. 108 కి కాల్ చెయ్యండి అంటూ నేలమీదికి ఒరిగిపోయాడు సి.యం.

Your views are valuable to us!