రామ్ గోపాల్ వర్మ ‘భయం – భస్మం’

Spread the love
Like-o-Meter
[Total: 0 Average: 0]

Image courtesy: cafebharat.wordpress.com
రాం గోపాల్ వర్మ కి భయానక రసం పై ఉన్న మక్కువ ఇంత అంతా కాదు అని తెలుగు ప్రేక్షకులకు బాగా తెలుసు. ఆయన ఈ స్టొరీ లైన్ ఆధారం గా సినిమా తీస్తే ఎలా ఉంటుందో ఊహించుకొంటూ  ఇది చదవండి. మీకు సినిమా చూసినట్లు ఉంటుంది. (షార్ట్ ఫిలిం).

******************


పట్టపగలు పంజాగుట్ట సెంట్రల్ ముందు ఒక చక్కటి అమ్మాయి చేతిలో బోకే తో ఎవరికోసమో ఎదురు చూస్తుంది. అంతలో ఒక్కసారిగా హా అంటూ ఉండగానే బూది  కుప్పగా మారి పోయింది. ఒక్కసారి చుట్టుపక్కల కలవరం.  అక్కడే ఉన్న ట్రాఫిక్ పోలీసుకు ఏమీ అర్ధం కాలేదు ధూళి లాటి పొగలు చిన్నగా వస్తుంటే వాటి వంక చూస్తూ ఉండి పోయాడు. అక్కడే ఉన్న ఒక అబ్బాయి ఆశ్చర్యంలో మునిగి తేలిపోయాడు ఎందుకంటే అతను దీనికి ప్రత్యక్ష సాక్షి.
 

వెంటనే ఒక పోలీసు ఇన్స్పెక్టర్ వచ్చి అక్కడ ఉన్న వాళ్ళను విచారించడం మొదలు పెట్టాడు. ఈ అబ్బాయి తేరుకొని తను చూసింది చెప్పాడు. నేను ఆ అమ్మాయి వంక చూస్తున్నాను ఎందుకంటే ఆ అమ్మాయి చాల అందం గా ఉంది అంతలో ఒక్క సారిగా “ఆ” అని ఒక శబ్దం వచ్చింది ఆమె నుంచి  అంతే, ఆ అమ్మాయి ఒక బూది కుప్పగా మారి పోయింది ఆ అమ్మాయి దగ్గరకు ఎవరూ రాలేదు, ఏమి చేయలేదు. ఆమె వేసుకున్న బట్టలలోకి ఆమె కూలిపోయి బూదిగా మారిపోయింది.ఆమె వేసుకున్న బట్టలు కుప్పకూలి పోయాయి క్షణంలో.
 
ఆ ప్రాంతాన్ని ఎవరూ చేరకుండా ఆ బూదిని ఎవరూ ముట్టకుండా పోలీసులు బారికేడ్లు పెట్టేసారు వెంటనే ఆ అమ్మాయి ఎవరో ఏమిటో చెప్పడానికి మిగిలాయ అన్నట్లు ఆమె చేతి బాగ్, ఆమె శరీరం తాకిన చోట కాలి పోయి, ఆమె పట్టుకున్న పూల గుత్తి కింద పడి,  ఆమె దుస్తులు కాలి కాలనట్లు పడి ఉన్నాయి.  ఒక పోలీసు ఆ బాగ్ దగ్గరకు చేరుతుంటే అందులో ఉన్న సెల్ మోగింది.  వెంటనే తీసి అది ఇన్స్పెక్టర్ కు ఇచ్చాడు. ఇన్స్పెక్టర్ అవతలి వ్యక్తి స్వరాన్ని విన్నాడు.  ఒక్క క్షణం అచేతనం గా ఉండిపోయాడు.  ఎవరు నువ్వు అని మాత్రం అడిగాడు అంతే కాల్ కట్ అయింది. వెంటనే ఆ అమ్మాయి అమ్మగారి కి ఫోన్ చేసి “అమ్మ మీరు మీ భర్త గారిని తీసుకొని సెంట్రల్ దగ్గరకు రండి మీ అమ్మాయి విషయమై మాట్లాడాలి.  కంగారు పడవలసింది ఏమీ లేదు” అని అనునయంగా చెప్పి పెట్టేసాడు.
 
జనం చుట్టూ చూస్తూ ఉండిపోయారు ఒకరి తో ఒకరు చెప్పుకుంటున్నారు.  ఆ అబ్బాయి దగ్గరకు వచ్చి ఇన్స్పెక్టర్ అడిగాడు “మీ పేరేంటి?” అని ప్రశాంత్ అని బదులు చెప్పాడు ఆ అబ్బాయి. 

ఇన్స్పెక్టర్ –  “మీరు మాకు కొంచం సహకరించాలి ఎందుకంటే మీరు మాకు ప్రధాన సాక్షి కనుక” అన్నాడు.

ప్రశాంత్ “తప్పకుండా!” అని మౌనం వహించాడు.
******************

“ఆ బూదిని పరీక్షించిన మీదట పొటాసియం సైనేడ్ కు ఎలా ఒక్క క్షణంలో చంపే శక్తి ఉందొ అలా ఏదో శక్తి గల రసాయనం ఆమెను ఇలా బూది కుప్పగా మార్చింది అని మా విశ్లేషణ ద్వారా తెలిసింది . సాధారణంగా కాలిపొతే ఒక స్థాయిలో బూదికుప్పలా రూపాంతరం చెందుతుంది శరీరం కాని ఈ బూదిని చూస్తే విచిత్రంగా ఉంది. ఈ బూది కణాలన్నీ ఒకే రీతిలో ఒకేలా ఉన్నాయి . ఇలా ఇంత తక్కువ సమయంలో చేయగల శక్తి ఏ రసాయనానికి ఉంది అని శోధించాలి” -! ఫోరెన్సిక్ ల్యాబ్ వాళ్ళు, నగరం లో ప్రఖ్యాత కెమికల్ ల్యాబ్ శాస్త్రజ్ఞులు వివిధ రకాలు గా ఈ సంఘటనను విశ్లేషిస్తున్నారు కాని ఎక్కడా అంతు చిక్కడం లేదు.
 

“ఔను, మీరు ఫోన్ లో మాట్లాడిన  వ్యక్తి నెంబర్ మీరు ట్రేస్ చేసారా?” అని డి. ఎస్. పీ అడిగితే ఇన్స్పెక్టర్ రవి “చేసాం అది చిక్కడపల్లి లో ఉన్న ఒక పబ్లిక్ బూత్ నుంచి వచ్చింది.” అని సమాధానమిచ్చాడు. 

“ఏమని మాట్లాడాడు వాడు ? “

“చూసావా! ఈ వింత ఇలాటి వింతలు ఇంకా ఎన్నో ఉన్నపళాననే జరుగుతాయి…మీ పోలీసోళ్ళలో కూడా!” అని అన్నాడు. 

“మన పోలీసులలోనా?”  అని గుచ్చి మరీ అడిగాడి డి. ఎస్. పీ.

“ఔను!” అన్నాడు ఇన్స్పెక్టర్ రవి.

నాంపల్లి పోలీసు కంట్రోల్ రూం నుంచి ఫోన్ వచ్చింది డి.ఎస్ పీ కి.  అక్కడకొచ్చిన ఒక ముఖ్య సి. బి. ఐ అధికారి మోహన్ బూది కుప్పగా కూలిపోయాడట!ఆయన బట్టలు సెల్ ఫోన్ ఒకటే మిగిలాయట!! ఇవి ఎవరు చేస్తున్నారు వాళ్లకి ఏమి కావాలి అసలు ఎవరు వీటి వెనుక ఉన్నవారు?
 
******************

ఇన్స్పెక్టర్ : ” ఆ అమ్మాయి పేరు దివ్య. మొన్ననే ఇన్ఫోసిస్ లో జాయిన్ అయ్యింది.  ఆ అమ్మాయిని వేధించే వాళ్ళు, కూడా పడే వాళ్ళు ఎవరూ లేరు! ఇది వాళ్ళ అమ్మ నాన్న నిర్ధారించారు.  ఎందుకంటే ఆ అమ్మాయి చాల సహజంగా ఉండేదంట! ప్రతి విషయాన్ని వాళ్ళ అమ్మతో చెప్పేదట. వాళ్ళది ఒక మంచి కుటుంబం అని నాకు తెలిసింది.  పాపం చాల బాధ పడుతున్నారు వాళ్ళు. ఆఫీసు లో కూడా వాకబు చేసాం.  మంచి తెలివైన పిల్ల అని తెలిసింది. సెంట్రల్ దగ్గర ఉండమని వాళ్ళ కొలీగ్స్ చెబితే ఉన్నదట పైగా ఇది శని వారం కదా వాళ్లకు సెలవు. చెప్పినట్లే వాళ్ళ కొలీగ్స్ వచ్చారు కూడా కాని అప్పటికే జరగవలసినది జరిగిపోయింది. వాళ్ళే దివ్య పేరెంట్స్ ను అనునయించి ఇంటికి తీసుకొని వెళ్లారు. వాళ్ళలో ఒక అమ్మాయికి అమెరికాలో ఉన్న నాసాలో జాబు వచ్చిందట అందుకే దివ్య బోకే తో ఉంది. ఆ అమ్మాయిని కూడా కలిసాం ఆమె పేరు లలిత ఆమె కూడా దివ్య గురించి చాల మంచిగా చెప్పింది…” అని ఇంకా ఏదో చెప్ప బోతుంటే మరో కాల్.

“సార్! మన మంత్రి గారు ఆయన ఇంట్లో లాన్లో కూర్చొని కాఫీ తాగుతూ బూది కుప్పలా మారి పోయారు!!” అని అవతల వ్యక్తీ చెబితే డి.ఎస్. పీ కి ఒక్కసారిగా కంగారు పట్టుకొంది.

******************
 

ఈ మీటింగ్ ఎందుకు జరుగుతుందో అందరికీ తెలుసు ఇప్పటి వరకూ ఎనిమిది మరణాలు అనూహ్యం గా జరిగిపోయాయి. ఒక్క దివ్య కేసు మినహాయిస్తే మిగిలిన ఏడు కేసులూ అన్యాయం, అధర్మం, మోసం, మొదలైన వ్యక్తిగత చరిత్ర ఉన్న వ్యక్తులే భయం గుప్పిట్లో అధికారులు రాజకీయ నాయకులు పౌరులూ ఉన్నారు. ముఖ్యం గా  ఎంచుకున్న ఏడుగురు వ్యక్తులు వారి చరిత్ర చూస్తె ఒక విధంగా తప్పు చేసే వాళ్ళు ఇప్పుడు చాల భయ పడుతున్నారు.  ఈ అపరిచిత శక్తి ఎవరు అనేది తెలియడం లేదు. ఆ క్షణంలో అందరూ చూస్తుండ గా అక్కడే ఉన్న ఒక డి. ఎస్. పీ బూది కుప్పగా ఆయన చైర్లో కుప్ప కూలి పోయాడు ఆయన డ్రెస్ మాత్రం అలా ఉంది. దేశంలో విదేశాలలో కూడా ఈ వార్త ఒక దావానలంలా తెలిసిపోయింది.  ఈ మీటింగ్ జరుగుచుండగా తీసిన వీడియో కూడా ప్రసారం చేయబడింది. ఇది చాల ఆందోళనను భయాన్ని కలిగించింది.

 

******************
ఎప్పుడు ఎక్కడ, ఎవరికీ ఇది జరుగుతుందో తెలియదు. అమెరికాలో లాస్ వేగాస్ లో ఒక ప్రముఖ కాసినో లోఒక కరుడుగట్టిన నేరస్తుడు కూడా ఇలానే చనిపోయాడు ! అంటే ఇది ఇహ అంతర్జాతీయ సమస్య .

******************
ఒక రోజు ప్రసాద్ ఐమాక్స్ లో ఎస్కలేటర్ పై ఎగువ నుంచి గోవింద్ అనే ఒక యువకుడు చూస్తుండగా ఒక చుక్క (చినుకులా) ఎస్కలేటర్ మధ్యలో ఉన్న ఒక మధ్య వయస్కుని తలపై పడింది అంతే  ఆ వ్యక్తీ తన దుస్తుల్లోకి బూదిగా మారి కుప్పకూలిపోయాడు.  ఆ విషయాన్ని గోవింద్ చెప్పగా అక్కడే ఉన్నఒక టి వి ఛానల్ వాళ్ళు రికార్డు చేసారు.


******************
ఈలోగా కొత్త తరహా స్కానింగ్ పరికరాలు, విద్యుదయస్కాంత తరంగాలను వినూత్నంగా విశ్లేషణ చేసే పరికరాలు కెమెరాలు, చాల రంగంలోకి దిగాయి. ఉన్నది ఒక వ్యక్తో, శక్తో, వ్యవస్తో అని నిర్ధారణ చేయడం ప్రారంభమైంది.  ఆ ఎంటిటీ ని ఎలా పట్టుకోవడం అనే దాని పై పరిశోధన కూడా మొదలైంది.  ఈ విషయం అంతర్జాతీయ స్థాయిలో ఒక పెద్ద వార్త గా మారింది.   కొందరు సంఘాలను స్థాపించి మీడియా ద్వారా ప్రకటనలు చేయడం ప్రారంభించారు.
 

“ఓ అపరిచిత శక్తి! నీకు మా వందనాలు.నీ పుణ్యమా లంచం తీసుకోవడం ఆగిపోయింది. చట్టం, న్యాయం ధర్మం పైనే మనిషి మనుగడ ఉందని తేలిపోయింది.అంతర్జాతీయ సమాజంలో నిజాయితీ రాజ్యమేలుతుంది.పాకిస్తాన్ కవ్వింపులు లేవు..  పాక్ నాయకత్వం లో ఒక భయం చోటుచేసుకొంది ఎందుకంటే ఇస్లామాబాద్ లో నడిరోడ్డులో ఒక సైనిక అధికారి తన దుస్తులలో బూది కుప్పై కూలి పోయాడు. నీకు మా జేజేలు…”
 
******************

సినిమా మధ్యలో మంచి సీన్ నడుస్తుండగా ఒక్కసారిగా కలకలం!!

ఒక సీట్లో బూది కుప్ప అది ఒక నడివయసు వ్యక్తిది. మరునాడు  సినిమా హాళ్ళలో సినిమా చూడాలంటే  ఒక విధమైన భయం.
 
ఒక సినిమా డైరెక్టర్ ఒక సీన్ తీస్తూ ఒక్క సారిగా బూదిగా మారి తన దుస్తుల్లో కుప్ప కూలిపోయాడ. కారణాలు వెతగ్గా అతను ఒక భయంకరమైన కామపిశాచి అని తేలింది. 
 
పారిస్ లో ఒక పత్రిక లో వచ్చిన కవిత:
 
మోసం చేద్దామంటే భయం,
చిన్న తప్పు తెలియక చేసినా భయమే
ఆఖరికి భార్య తో రమిస్తూ పాడు ఊహలు వస్తున్నా భయమేసి నిస్తేజం గా మిగిలి పోతున్నా అని …..
 
 
 
******************

భయం ఒక్కరి లో కాదు అందరిలోనూ ఉంటె ఎలా ఉంటుంది ? వాళ్ళు ఎలా ప్రవర్తిస్తారు? ? అసలు మనిషి ఎందుకు భయపడాలి?దేనికి భయపడాలి

******************


మచ్చిక వీరికెల్ల బహుమాత్రము  చోద్యము
జీవి పుట్టుచున్ చచ్చుచు నుండజూచెదరు
తా చావని వాని భంగి ఈ చచ్చిన వాని గూర్చి ఏడ్చేదరు
ఎచ్చటి నుంచి వచ్చనో అచ్చటికిన్  పోవుట నైజము  జీవకోటికిన్

అని చెబుతూ వైరాగ్య సంపత్తిని తెలిపే ప్రహ్లాదోపాఖ్యానం పై ప్రవచనం దూరంగా ఒక గుడిలో ఉన్న మైక్ లోంచి వినబడుతోంది!!

******************

Your views are valuable to us!