రెండో కృష్ణుడు

Spread the love
Like-o-Meter
[Total: 0 Average: 0]

మార్నింగ్ మార్నింగ్ జయమ్మ నిద్ర లేచేసరికి, వూరు వూరంతా ఇంటిగుమ్మం ముందు గుమికూడి వున్నారు.
 
“విన్నావా జయమ్మా..? నీ అల్లరి కుట్టి మా ఇటుకల బట్టిలోని మట్టి మొత్తం కాజేసాడు.!”

“నీ గారాల పట్టి, మా కంట్లో దుమ్ముకొట్టి, ఎకరాలకు ఎకరాలు దిగమింగేసాడు..!!”

“నీ మురుపాల సట్టి, సున్నపురాళ్ళను పళ్ళు పలహారాల్లా ఆరగించేసాడు..!!!”
 
ఇలా ఇరుగూ పొరుగువారంతా తన ముద్దులకొడుకు చిన్నారి జగ్గు మీద నిందలు మోపేసరికి జయమ్మ నివ్వెరపోయింది.
 
“మునక్కాయల నాడే మందలించి వుంటే, విషయం ఇంత ముదిరివుండేది కాదు కదా..?” పక్కింటి చంద్రసేనుడు కిసుక్కుమని పళ్ళికిలించాడు.
 
నషాళానికి అంటిన కోపాన్ని దిగమింగుకుని, “బాబూ జగ్గూ!” అంటూ కేకేసింది జయమ్మ.
 
వస్తూ వస్తూనే.. “అమ్మా.. మన్ను తినంగనే శిశువునో,కొంటెనో, వెఱ్రినో..నోరుచూడు ఆ……. “అంటూ ఇంత లావున నోరు తెరిచాడు జగ్గు.
 
కొడుకు నోట్లోంచి పెళపెళ లాడే కొత్త కరెన్సీనోట్ల దుర్గంధంగుప్పుమనేసరికి, జయమ్మకు మూర్ఛొచ్చినంత పనైంది.
 
తన పెంపకంలో తనబిడ్డ తింటేగింటే మనీ తింటాడు గానీ.. మరీ చీప్ గా మట్టి మింగడమేంటి??
 
ఇదంతా జగ్గు మేనమామ కాంగ్రేసురాజ్ ఆడిస్తున్న నాటకంగా అర్థం అయిందామెకు. దీని వెనుక పెద్ద విదేశీకుట్ర దాగుందని కూడా గ్రహించింది జయమ్మ.
 
“అంతా మన బంధువులే కదమ్మా!” అమాయకంగా అడిగాడు చిన్నారి జగ్గు.
 
“అధికారం వారి చేతి లో వుంది కాబట్టి, మన ఆటలు అట్టేసాగవు నాయనా.. మనకూ స్వర్ణయుగం వస్తుంది. అప్పుడు మన్నేం ఖర్మ.. మణులూ మాణిక్యాలు కావాల్సినంత దిగమింగొచ్చు” తలనిమురుతూ ఓదార్చింది తన పుత్రరత్నాన్ని.
 
** ** ** ** **
తండ్రి పోయిన సెంటిమెంట్ సెంట్ ని, జనాల ఒంటినిండా  పులుముకుంటూ..సంవత్సరాల తరబడీ ముగింపులేని తెలుగు టీవి ధారావాహికలా జగ్గు ‘ఓదార్చే యాత్ర’ కొనసా..గుతూనే వుంది. ప్రజలు కూడా గుంపులు గుంపులుగా జగ్గు వెంటపడి, ఒళ్ళంతా నిమిరించుకుని, తృప్తిగా ఇళ్లకు పోతున్నారు.
 
సానుభూతి సునామీ తమ కుర్చీ క్రిందకు చేరి నిలువునా కూల్చే ప్రమాదం వుందని గ్రహించిన కాంగ్రేసురాజ్., జగ్గు సంగతి తేల్చమని, జేమ్స్ బాండ్ 007 లాంటి సి.బి.ఐ. డైరెక్టర్ ఒకాయన్ని పంపించాడు.
 
వచ్చీ రాగానే బస్తాలకొద్దీ అవినీతి ఆరోపణల్ని బళ్ళకెత్తించి, కోర్టు గుమ్మాలముందు కుమ్మరించిన సి.బి.ఐ. జగ్గును అరెస్ట్ చేసింది.
 
అత్తారింటికి వెళ్తూన్న కొత్తల్లుడులా చుట్టూ వున్న అందరికీ షేక్ హాండ్లిచ్చి, వుత్సాహంగా అనుచరులకు చేతులూపి, మీడియావారికి అందేలా గాల్లోకి ముద్దులు విసిరి, పోలీస్ వ్యాన్ ఎక్కాడు జగ్గు.
 
**   ***   **   ***   **
 
హల్ చల్ గూడ సెంట్రల్ జైల్.
 
జగ్గు రాక సందర్భంగా జైలు మొత్తం పండుగ వాతావరణం నెలకొంది. గోడలకంతా సున్నాలు కొట్టి, రంగురంగు తోరణాలు వ్రేలాడదీసారు. ఆహ్వానించడానికి ఆడ ఖైదీల చేతుల్లో పూల పళ్ళాలు. నవరంగ్ పోలీసుబ్యాండ్. మగ ఖైదీలంతా కోలాటాల చిందులు. బయట జైలు గేటు దగ్గర్నుంచి, జగ్గు వుండబోయే గది దాకా తెల్ల రంగు పాదాల గుర్తుల్ని ముద్రించారు.
 
జైల్ సూపరిండెంట్ గారు తన మొబైల్ రింగ్ టోన్ గా ‘”రండి రండి రండి దయచేయండి.. తమరిరాక మాకెంతో సంతోషం సుమండీ..” అనే పాట పెట్టుకున్నాడు.
 
జగ్గు రాకముందు నుంచే అక్కడ, అహల్యను చెఱపట్టిన ఇంద్రుడు, సీతమ్మను కిడ్నాప్ చేసిన రావణుడు, భూగోళాన్ని దోపిడీ చేసిన హిరణ్యాక్షుడు, అలాంటి నైజం వున్న వి.ఐ.పి లు తిష్టవేసి వున్నారు.
 
వీళ్ళందరూ వి.వి.ఐ.పి. లాంటి జగ్గు పలకరింతతో, పులకరించి పోయారు.
 
ఇక కారాగారంలో చిన్నారి జగ్గు గారాలకు కొదవేలేదు. ఠీవీగా పడుకుని చూడ్డానికి 32 అంగుళాల సోనీ ప్లాజ్మా టీవి. కోరింది వండి పెట్టే పాకశాస్త్ర ప్రవీణులు, సందర్శించడానికి సి.బి.ఐ., హై కోర్టులు, బయటి విషయాలు ఎప్పటికప్పుడు చేరవేసే కోవర్టులు,  సంతోషించడానికి బాడ్మింటన్ కోర్టులూ.. ఒక్క ‘ఆ’ విషయం తప్ప బైలు రాకపోయినా జైలే  సుఖమనిపించే లాంటి సఖల బోగభాగ్యాలు.
 
ఇలా కొనసాగుతుండగా..
 
ఎన్ ఫోర్సుమెంట్ శాఖ, సి.బి.ఐ. ఇద్దరూ తమతమ సందేహాల్ని తీర్చుకోడానికి జగ్గు కోసం జైలుకొచ్చారు. వీరి రాకను గమనించిన జగ్గు నిద్రపోతున్నట్టు నటిస్తూ పడుకున్నాడు.
 
బలవంతంగా కానీ, చిన్నపిల్లోడు కాబట్టి భయపెట్టిగానీ, బెదిరించిగానీ జగ్గు నోట్లోంచి పిప్పిపన్ను కూడా లాగే అధికారం తమకు కోర్టు ఇవ్వకపోవడంతో.. ఎలాగైనా బుజ్జగించి నిజాలు రాబట్టాలని  వీళ్ళు నిర్ణయించుకున్నారు.
 
జగ్గు గారి నిద్ర  చెడగొడ్తే చివాట్లు పెడ్తాడేమోనని, తల దగ్గర ఒకరు, కాళ్ళ దగ్గర ఒకరు ఒదిగి కూర్చున్నారు.
 
అరగంట తర్వాత ఆవులిస్తూ కళ్ళు తెరిచాడు జగ్గు.
 
వెంటనే తన జేబులోంచి కిలోమీటర్ పొడవున్న సందేహాల లిస్టుని బయటకు తీసాడు సి.బి.ఐ. డైరెక్టర్.
 
“ముందు నేను అడగాలి!” ఈ.డి అన్నాడు. “కాదు నేనే అడగాలి” మొండికేసాడు సి.బి.ఐ. డైరెక్టర్.
 
“ముందుగా నేను వచ్చాను” అని ఒకరు, “ముందుగా నన్ను చూసాడు” అని ఇంకొకరు.
 
“వాడు నావాడు” అని ఒకరు, “కాదు కాదు నావాడే” అని మరొకరు.
 
ముందుగా ఎవరు అడుక్కొవాలో డిసైడ్ చేసుకోండి, ఈ లోగా బాత్ రూంకి వెళ్ళొస్తాను అని జగ్గు వెళ్ళిపోయాడు.
 
**   ** ** **  **
 
రెండు గంటల పాటు అడిగిన ప్రశ్న అడక్కుండా అడుగుతూ వుంటే ప్రతిప్రశ్నకు సమాధానంగా చిరునవ్వులు చిందిస్తున్నాడు చిన్నారి జగ్గు.
 
“మా బాబు కదూ.. ఒక్క దానికైనా సమాధానం ఇవ్వవూ ప్లీజ్” అంటూ గడ్డం పట్టుకుని బ్రతిమాలుకున్నాడు సి.బి.ఐ ఆఫీసర్.
 
“పైన దేవుడున్నాడూ… అన్నీ ఆయనే చేసిపెట్టాడూఊ….ఇదే నా సమాధానంఊ..” అని ముగించాడు జగ్గు.
 
ఎలా అడిగినా చిరునవ్వులు చిందించి, చివరాఖరున అదే సమాధానం వస్తుందని గ్రహించిన ఈ.డి. వారు కూడా, ప్రశ్నల భేతాళుడ్ని చంకకెత్తుకుని,
మౌనంగా  కోర్టు దారి పట్టారు.
 
వాళ్ళటు వెళ్ళగానే ‘ వక్రవాకం’ వెయ్యిన్నీ నూటపదహారో ఎపిసోడ్ చూడ్డం మొదలుపెట్టాడు జగ్గు.
 

Your views are valuable to us!