తీస్తా ఢిషుంవాద్ తీవ్రవాద పునరావాస కేంద్రం

Spread the love
Like-o-Meter
[Total: 1 Average: 4]

NOTE:The letters, characters & contents presented in this article are spoof only

 

తీస్తా ఢిషుంవాద్

సమాజ సేవకి

డింకా మురికివాడ, ముంబై

 

గౌ. గృహమంత్రి గారు,

     అతి తక్కువ ఓట్ల శాతంతో అతి ఎక్కువ సీట్లు గెల్చుకొని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినందుకు మీకు అభినందనలు. మీరు సీట్ల సంఖ్యను దృష్టిలో పెట్టుకోకుండా ఓట్ల శాతాన్ని గుర్తుంచుకొని చట్టాలు చేయాలని నా హెచ్చరిక.

     ఒకప్పుడు మీ పూర్వీకులు ఓ భయంకరమైన పోటు చట్టాన్ని ఈ దేశం మెడకు చుట్టారు. ఎందరో అమాయకులు ఆ చట్టానికి బలైపోయారు. ఆ అమాయకులందరూ ఒకే విశ్వాసానికి, అభిప్రాయానికి కట్టుబడినవారవడం చాలా బాధాకరం. మెజారిటీ లేని కాలంలోనే ఇన్ని అకృత్యాలను చేసిన మీరు ఇప్పుడు అప్పనంగా దొరికిన మెజార్టీతో పోటాను మించిన ఘోర చట్టాన్ని చేస్తారేమోనని ఆ అమాయకులు భయపడుతున్నారు. అసలే అల్పసంఖ్యాకులైన వారు మీరు తెచ్చే దుష్ట చట్టాలతో నామరూపాలు లేకుండా నాశనమైపోతారేమోనని నేను కూడా భయపడ్తున్నాను. నేను భయపడ్డానంటే చాలు. దేశం మొత్తం భయపడి పోయినట్టే. ఎందుకంటే నేను గొప్ప దార్శనికవేత్తను, తత్వవేత్తను, దౌత్యవేత్తను, ట్వట్టర్ వేత్తను, వామభావవేత్తను.

     నేను ఈ క్రింద ప్రకటిస్తున్న అంశాల ఆధారంగానే మీరు చట్టాలు చేయాలని శాసిస్తున్నాను. ఎందుకంటే స్వేచ్ఛావాదిగా, అభ్యుదయశీలిగా, మెజార్టీవ్యతిరేక మేధావిగా నాకున్న ఈ హక్కును మీరు కాదనలేరు. సరే, ఈ క్రింది విషయాలను చదువుకోండి:

  • తీవ్రవాదులు జన్మతః తీవ్రవాదులు కారు.
  • సంఘమే వారిని తయారు చేస్తుంది.
  • ప్రభుత్వ విధానాలు వారిని మరింత కరడుగట్టేట్టు చేస్తాయి. ఉదా: మీరు తెచ్చిన పోటా చట్టం.
  • తీవ్రవాదులకు మతం లేదు.
  • ఒక్కోసారి కొద్దిమంది అమాయకులు మతం పేరుతో తీవ్రవాదం చేస్తుంటారు.
  • అలా అల్లరి చేసే తీవ్రవాదుల్ని అరెస్ట్ చేయకూడదు. పాపం వారు అమాయకులు.
  • ఒకవేళ అరెస్టు చేయాల్సి వస్తే వారిని జైళ్ళలో ఉంచకూడదు.
  • ఒకవేళ ఉంచాల్సివస్తే ఏదైనా హోటల్‍ను జైల్ గా మార్చాలి.
  • వారిని ఇంటారాగేట్ చేసేవారు వారి విశ్వాసాలకు, అభిప్రాయాలకు చెందినవారైవుండాలి.
  • ఇంటారాగేషన్ పద్ధతులు మానవీయంగా ఉండాలి. అంటే లాలింపు, బుజ్జగింపు, ఆరగింపు, పవళింపు వంటి సేవల్ని మాత్రమే ఇంటరాగేషన్ విధానాలుగా ఉండాలి.
  • అరెస్టైన వారు తమంత తాముగా “మీ సేవలు చాలు. మేము వెళ్ళిపోతాం.” అని అనగానే పంపించివేయాలి.

ఇక ఇప్పుడు కొన్ని మానసిక విజ్ఞాన నైపుణ్య కిటుకులు నూరిపోస్తాను. అర్థం చేసుకోండి.

  • తీవ్రవాదులు కూడా మనుషులే
  • వారిలో మానవత్వంకు బదులు తీవ్రమైన మానసిక ఒత్తిడి వచ్చి చేరుతుంది. కాబట్టి వారిని జాగ్రత్తగా హ్యాండిల్ చెయ్యాలి.
  • ఇలాంటి వారిని అరెస్ట్ చేసి, ఇంటరాగేట్ చేస్తే వారి ఇంటి పరువు బజారు పాలౌతుంది. ఇది వారిని మరింత కరడుగట్టిస్తుంది.
  • కనుక ప్రభుత్వం వారు వీరిని హింసించకూడదు. పైన చెప్పిన కొన్ని సేవల్ని మాత్రమే చెయ్యాలి.
  • వారిని ప్రేమగా మాట్లాడించాలి. వారిలో మసకబారిన మానవత్వాన్ని మార్చే ప్రయత్నం చేయాలి.
  • ఇందుకు మాలాంటి మానసిక రోగ నిపుణుల సహకారం ఎల్లప్పుడూ తీసుకోవాలి.
  • నావరకూ జీతం అవసరం లేదు. నాకొక బంగ్లా, నెలసరి సామాన్లు, ఓ ఐదుమంది నౌకర్లు, రెండు కార్లు, మూడు షిప్టుల్లో డ్రైవర్లు, ఒక ఆండాయిడ్ ఫోన్, లాప్ టాప్, ఇంటర్నెట్ కనెక్షన్ ఇస్తే చాలు. సంవత్సరంలో రెండుసార్లు విదేశాలకు స్టడీ టూర్లు ఏర్పాటు చేస్తే చాలు.

     మీరు నా పై ఆదేశాలను పట్టించుకొని, తిరుగు ఉత్తరం రాయాలని డిమాండు చేస్తున్నాను.

ఇట్లు

తీస్తా ఢిషుంవాద్

సమాజ సేవకి

@@@@@

గృహమంత్రి కార్యాలయం,

భారత ప్రభుత్వం,

నవ ఢిల్లి.

 

ప్రియమైన తీస్తా డిషుంవాద్ గారు,

     మీరు బెదిరింపు ఉత్తరం అందింది. అందులోని ప్రతి అక్షరాన్ని పొల్లుపోయినా కూడా సరిచేసుకొని చదివాను. మీరు డిమాండ్ చేసిన విధంగా ఈ తిరుగు టపాను పంపుతున్నాను. సావధానంగా చదవండి.

     మా పోలీసు వారికి భుజబలమే తప్ప బుద్ధిబలం లేదు. మీరు తమ ఉత్తరంలో నూరిపోసిన ఉత్తమోత్తమ గుణాల్ని వారిలో చొప్పించే హక్కు నాకు లేదు. కనుక ఈ ఉత్తరం అందుతూ ఉండేలోగా వారు మీ ఇంటికొక అతిథిని తీసుకువస్తారు. దయచేసి అతన్ని మీ ఇంట్లో ఉంచుకొని మీరు ఉత్తరంలో పేర్కొన్న సమస్త సేవల్ని చేయగలరు.

ఇప్పుడు, అతిథి యొక్క చిరు పరిచయం.

     మీ అతిథి తీవ్రవాది అంటే మీరు వర్ణించిన విధంగానే మనసు స్వాధీనం తప్పిన వ్యక్తి . ఇతను హోటల్లో బాంబుల్ని పేల్చడం, ప్రార్థనా స్థలాల్లో తుపాకీ కాల్చడం, కొందరిపైనే కన్నువేసి తలలు కోసెయ్యడం వంటి కొన్ని అమాయకమైన పనులు చేస్తుంటే, ఈమధ్యనే బుర్రలేని మా పోలీసువారు తమాషాగా పట్టుకొన్నారు. మీరు ఇతనిపై మీరు పేర్కొన్న అన్ని రకాల సేవల్నీ ప్రయోగించండి. మీ పునరావాస కార్యక్రమం విజయవంతమవుతుందని ఆశిస్తున్నాను.

కొన్ని సూచనలు:

     మీ అతిథిగారికి కొన్ని అసభ్యకరమైన విషయాలంటే చాల ఒళ్ళు మంట. ఉదా: పాటలు పాడడం, నాట్యం చేయడం, బొమ్మలు గీయడం, శిల్పాలు చెక్కడం వంటివి. మీ ఇంట్లో అటువంటి పనుల్ని చేసే వారుంటే ఇతని కంటికి పడకుండా చూసుకోండి.

     మీ అతిథి దృష్టిలో స్త్రీలంటే ఇంట్లోని ఫర్నిచర్‍లాంటి వారనే గొప్ప గౌరవనీయమైన భావం ఉంది. సోఫా మీదికి గెంతినట్టో, మంచంపై ఎగిరెగిరి దూకినట్టో, ఫ్లవర్ వేజ్‍ను విసిరికొట్టినట్టో లాంటి పనుల్ని వారితో చేస్తుంటాడు. ఈ విషయంలో కూడా మీరు జాగ్రత్త పాటించడం అవసరం.

     మీ అతిథికి అందం పట్ల ఆరాధనా భావం ఎక్కువ. ఉన్న అందాన్నే చూస్తూ కూర్చుంటే కొత్త అందం పుట్టుకురాదన్న ఉద్దేశంతో అందమైన వాటిల్ని విరగదీస్తుంటాడు. మీ చుట్టుపక్కల ఉన్న అందమైనవాటిల్ని, ప్రాణమున్నవి లేనివి, ఏవైనా ఉంటే వాటిల్ని జాగ్రత్త పరచుకోండి.

     మీ అతిథి సంపూర్ణమైన ఆరోగ్యవంతుడై, అమాయకత్వాన్ని వదిలించుకొని, ఈ సమాజంలో సగర్వంగా తలెత్తి జీవించడం నేర్చుకొనే వరకు మీతోనే ఉంటాడు.

     ఈ విషయంలో మీరు ప్రోగ్రెస్ రిపోర్ట్ ను నెల నెలా మీకు దగ్గరలోని మా (తెలివిలేని) పోలీసులు వారికి ఇవ్వాలి. వారు నాకు నేరుగా ఆ రిపోర్ట్ ను పంపిస్తారు. మూడు నెలల కొకసారి ఢిల్లీ నుండి మా శాఖా కార్యదర్శిగారు వచ్చి స్వయంగా పరిస్థితిని అంచనా వేస్తారు. వారికి కావలసిన వసతి సౌకర్యాలన్నీ మీ ఖర్చుతో మీరే కల్పించాలి.

     ఈ విషయంలో మీరు సంపూర్ణ సఫలతను సాధిస్తే మేము “తీస్తా ఢిషుంవాద్ తీవ్ర (అమాయక)వాద పునరావాస కేంద్రం” పేరుతో ప్రపంచవ్యాప్తంగా కేంద్రాలను ఏర్పాటు చేస్తాం. ఇందుకోసం మీరు మాకేమీ ఇవ్వాల్సిన పనిలేదు.

ఇట్లు

అభినందనలతో

భోజనాథ్ సింగ్

@@@@@

Your views are valuable to us!