తెలియతరమా కాల మహిమా!
కలికాల గరిమా..హా..హా..హా..హా
అని మూర్చిల్లినదట ఆ మాతృమూర్తి. అన్నీ వ్యాపారమయమైపోయిన ఈ మహా కలికాలంలో ఇట్టి పుత్రులను బడయుట అనూహ్యమేమియూ కాదని ఆ ఊరి చర్చి ఫాదరువారు నుడివిరి.
చిత్రమైన ఈ కథ యొక్క కథానకమెట్టిదనిన…
అమెరికాలోని బఫెలో అనెడి ప్రాంతవాసియైన క్రిస్ కాంటీకి ప్రతిదినమూ ఖర్చు, వెచ్చములను మరియు ఆదాయ వివరములను వ్రాసిపెట్టుకొనటయను జబ్బు గలదు. ఒకానొక దుర్మూహర్తంబున ఆ మహాశయుడు “నేను పుట్టిననాటి నుండి ఇప్పటి వరకూ గడించిన ఆదాయము ఎంత?”యని లెక్కవేయసాగెను. హటాత్తుగా ఆ మహానుభావుని మస్తిష్కమందు భయంకరమౌ విషయము మెరుపువలే ప్రకాశించెను. తను పుట్టుటకు పూర్వము తొమ్మిది నెలల పాటు తల్లి గర్భములో ఎట్టి వ్యాపారమూ సేయక ఉండుటను గమనించెను. తొమ్మిది నెలలనిన సరిసుమారు పదివేల డాలర్ల నష్టము అని ఆతని బుర్ర లెక్కగట్టెను. పంచప్రాణములూ విలవిలలాడగా ఆతడు న్యాయస్థానము కడకేగి “నా తల్లి నన్ను నవమాసమ్ముల పర్యంతము తన గర్భమందు నన్ను సోమరిగా బంధించి ఉంచెను. దాని కారణమున నాకు పదివేల డాలర్ల ఘోర నష్టము సంభవించెను. కనుక శ్రీయుత కోర్టువారు సదరు పదివేల డాలర్లను వడ్డీ సమేతముగా నాకు నా తల్లినుండి ఇప్పించవలెను” అని అర్జీ దాఖలు చేసెను.
తికమకమయమౌ ఈ ఫిర్యాదును స్వీకరించుటయా? మానుటయా?యన్న సంశయములో న్యాయమూర్తులు ఉండగా…ఒక అమాయకుడిని బట్టలు లేకుండగా, వినోదసాధనములచే వంచితుడిని జేసి, కనీసపు హక్కుల నుండి దూరముజేసిన తల్లిని శిక్షించవలెనని మానవహక్కుల సంఘము వారు ధర్నా జేయుచున్నారని తెలియవచ్చినది.
కావున తల్లులారా! పారాహుషార్!