“గురూ! గూ..రూ! గు….రు…గూ…రూ”
“వెర్రోహం! ఆ నాటక పద్యాల బాకా పీకుడేలరా?”
“ఏమిటో గురూ! ఈ మధ్య ఏమీ తోచడం లేదు. అందుకనే ఇలా రాగాలను సాగుబడి చేస్తున్నాను!”
“అక్కుపక్షీ! అడుక్కుతినేవాడికి అరవై రకాల రుచులురా! బడాస్వాముల స్కాములు, సిబీఐలూ, ఎస్బీయైలూ, అరెస్టులూ, వారెంటులతో ఆంధ్రదేశం గగ్గోలెత్తుతుంటే నువ్వేమిటిరా ఏమీ తోచనివ్వని ఈ పద్యాల పీకులాటలో, చీకాకులాటలో, ఏకాకి కాకిలా? ఇస్సీ”
“ఆహా! ఎంత బాగా తిట్టారు గురూ. ఎందుకో నాకు హాయిగా అనిపిస్తోంది. తిట్టండి గురూ…బాగా తిట్టండి.”
“వెర్రిబాగులపడనోడా! కుర్రబుద్ధి సన్నాసీ! పెట్రోలు మండుతోంది. డీజలూ మండబోతోంది. గ్యాసు సిలెండరు దారీ అదే. అన్నీ ఇలా మండి, పేలిపోతోంటే నువ్వేమిట్రా ఇలా గార్ధభ రాగాలతో వింజామరలు వీచుకొంటూ నీ నీడను నువ్వే చూసుకొని ఉలిక్కిపడుతూ, నీ కంటిని నువ్వే పొడిపించుకుంటూ!!”
“ఆహాహా…ఇలా బాగా అర్థమయ్యేట్టుగా తిట్టకండి గురూ! బుర్ర చించుకున్నా ముక్కక్షరం అర్థం కాక చచ్చేట్టు తిట్టండి. కనీసం మీ తిట్లలోనైనా నా మధ్యతరగతి ఇక్కట్లను మర్చిపోతాను. మొదలెట్టండి గురూ!”
“హుమ్….పద్యాలను పీకి పాకానపెట్టే ఓ బక్కపేగులోడా….వినుకో….”
గాలికి రాలిపోయినవి గాడిద పోసిన గాదెలన్నియున్
వాలుగ సోకి ఆరినవి వాసన వేయని కళ్ళగాలముల్
నీలపు నింగి వంగినది నిద్రలొ జోలెడి కుక్క మీదకున్
చాలిక వడ్డనంబుల మజాలు విచారపు వింతవాసనల్
నాటిన పంటలేన ఇవి? నగ్నపు నాట్యములేల జేయునో!
నేటికి కాటికేగినవి నెత్తురు కత్తుల కుత్తరంబులై.
సూటిగ సూదులన్వదల సూకర భీకర కేక భేకముల్
తాటను తేటగా వొలిచె తాటక నాటక చాటుపద్యముల్.
కోళ్ళకు కళ్ళులేవనుచు కోరలు పీకుట న్యాయమా ప్రభూ!
జోళ్ళకు నోళ్ళు లేవుయని జోలలు పాడుట న్యాయమా ప్రభూ!
గుళ్ళకు గొళ్ళెమేలయని గోడలు కూల్చుట న్యాయమా ప్రభూ!
బళ్ళకు ఒళ్ళుజేసెనని పళ్ళుగ మార్చుట న్యాయమా ప్రభూ!
అచ్చరమయ్యెనే ముసలి ఆదిమ కైతల అంతుజూడగాన్
సిచ్చల ఉచ్చులన్దగిలి సీకటి సిందెను సంద్రమయ్యేనే
అచ్చుల హల్లులన్వదలి ఆ కటి ఆకటి ఆకుపూజలో
పిచ్చిగ పచ్చిగా జదువ పిల్లకు జెల్లకు పళ్ళు వూడెనే
వచ్చెడివాడు ఫల్గుణుడు వార్ధి తరంగ మృదంగ ఘోషలో
పచ్చిక మచ్చికైనదని పాటలు పాడిన పాపరేడు నీ
ఇచ్చములోన దాగికొని ఇద్దరి నద్దరి సుద్దులొద్దనెన్
మచ్చర మేలరా కవికి! మద్దెల మోతల పాఠకాగ్రణీ !
“హతోస్మి గురూ! హతోస్మి! ముక్కక్షరం మాత్రమే కాదు కదా అక్షరమ్ముక్క కూడా అర్థమై చావలేదు. ఆహా! చావు ఇంత హాయిగా వచ్చి చస్తుందనుకోలేదు. చెవిలో చావుమేళం, మెడలో ఉరితాడుమాల…ఆహా”
“ఇది ఉరితాడు మాల కాదురా బడుద్ధాయ్! ఉత్పాతమాల”
“ఔనా గురూ! పిచ్చెక్కిన కాంచనమాలకు ఈ ఉత్పాతమాల ఏమౌతుందో?”
“జగన్ కు సీబీయై ఏమౌతుందో అదే వరసౌతుందిరా”
“భీతోస్మి….భయభీతోస్మి గురూ”
“వర్ధిల్లరా సగటుజీవీ! వందేళ్ళూ వర్ధిల్లు! బావిలో కప్పలా….చెవిలో జోరీగలా…చెప్పులో రాయిలా….బడాబాబుల గేటు కాడి కుక్కలా…అవినీతి కుళ్ళులో కుళ్ళుతూ…బ్రతుకుఫో..వెర్రోహం!”