చిటపటలు-05 “వంకల డొంకతిరుగుళ్ళు”

Spread the love
Like-o-Meter
[Total: 0 Average: 0]

ఎన్నికల ఫలితాలొచ్చిన ప్రతిసారీ మన నాయకులు వంకల కోసం వెదుకుతూ చెప్పే డొంకతిరుగుడు సమాధానాలు బలే విచిత్రంగా ఉంటాయి. మచ్చుకు కొన్ని :

తమిళనాడు ఫలితాలపై కామ్రేడే ఏచూరి సీతారాం : “అవినీతికి వ్యతిరేకంగా ప్రజలు ఓటు వేసారు”.

ఆ కామ్రేడే, పశ్చిమ బెంగాల్ ఫలితాలపై : “ప్రజలు మార్పు కోరుకున్నారు”. పైగా “ఈ ఓటమి వామపక్ష సిద్ధాంతాల, కార్యక్రమాల ఓటమి కాదు”

తమిళనాడైనా, పశ్చిమ బెంగాలైనా ప్రజలు మార్పు కోరారన్నది ఆయనగారేం చెప్పక్కరలేదు. ఫలితాలు చూస్తే అందరికీ అర్ధమౌతున్నది. అవినీతి ప్రభుత్వం మారాలని తమిళనాడులో ప్రజలు ఓటు వేసారనుకుంటే, పశ్చిమ బెంగాలులో ఏం మారాలని ప్రజలు ఓట్లు వేసారో ఆయనకు చెప్పే తీరిక ఇప్పుడు లేదట… పొలిట్ బ్యూరో సమావేశాల్లో పోస్టుమార్టం చేసుకుంటారట! సిద్ధాంతాలే కాలదోషం పట్టాయని లోకమంతా కోడై కూస్తున్నా కామ్రేడ్ల చెవుల చిలుము ఎప్పటికి వదిలేనో!

* * *

పశ్చిమ బెంగాల్ ఫలితాలపై సి.పి.ఐ. నేత గురుదాస్ దాస్ గుప్త “ప్రజల తీర్పును గౌరవిస్తున్నాం. రాష్ట్రంలో మేము చేసింది సరిపోలేదు”.

గౌరవించక చేసేదేముంది కామ్రెడ్, ఫలితాలపై నెత్తీ నోరు బాదుకుంటే ఇప్పుడిక ఉపయోగం ఏముంది? బెంగాల్ లో కమ్యూనిస్టులు చేసింది సరిపోక కాదు, అంతా ఎక్కువై వెగటు పుట్టి ప్రజలు పీకి పాతరేసారు కామ్రెడ్.

* * *

అస్సాం, బెంగాల్ ఫలితాలపై, దిగ్విజయ్ సింగ్ నుంచి మనీష్ తివారి వరకు కాంగ్రెసీయులంతా : “యు.పి.ఎ. ప్రభుత్వ విధానాలే విజయానికి సోపానం”.

మరి తమిళనాడు, పుదుచ్చేరిల సంగతేంటి సార్ అంటే, అయిదు రాష్ట్రాల్లో భా.జ.పా. ఉనికి కూడా లేదు అని డొంకలో పడిపోయాడీ పెద్దమనిషి!

* * *

 

ఈ ఎన్నికల ఫలితాలను బట్టి, వైయస్సార్ కు నిజమైన వారసులెవరని ముఖ్యమంత్రిని ప్రశ్నిస్తే, “వచ్చే ఎన్నికల్లో యాభైవేల మెజారిటీతో కాంగ్రెస్ గెలుస్తుంది” అంటూ తుమ్మితే ఊగిపోయే కుర్చీలో కూర్చొని సమాధానమిచ్చారట కె.కె.రెడ్డి గారు.

* * *

కడప, పులివెందుల ఉప ఎన్నికలపై కొందరు కాంగ్రెస్ నేతలు, చంద్రబాబు : “ఓటుకు రెండు వేల రూపాయలు జగన్ పంచాడు, మద్యం ఏరులై పారించాడు, అందుకే గెలిచాడు”.

ఓటుకు రెండు వేలంటే, అయిదు లక్షల మెజారిటీ అంటే దాదాపు వంద కోట్లన్నమాట! కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ కాంగ్రెసుదే కదా ప్రభుత్వం. నోట్లు పంచుతుంటే చూస్తూ ఊరుకున్నారే? పాపం నోట్లో వేలు పెట్టినా కొరకలేని వెంగళాయిలు గామోసు మన కాంగ్రెసీయులు, చంద్రబాబు!

* * *

Your views are valuable to us!