“గురు!”
“శిష్యా!”
“నాకో అనుమానం గురూ!”
“వెర్రివాడా! అనుమానం, అజ్ఞానం రెండూ రెండు కొమ్ముల్లాంటివిరా!”
“కొమ్ము దీర్ఘాలంటే ఎలా ఉంటుంది గురూ?”
“అమోఘం! నీ దీర్ఘాలు బహు అనర్ఘ్యాలు! ఆమోదయోగ్యాలు!”
“మరి అడగనా గురూ!”
“నీళ్ళు కడగడానికి, అనుమానం అడగడానికి పుట్టాయి నాయనా!”
“ధన్యోస్మి! షకీలా బేబీ పెళ్ళట గురూ!”
“ముసలి ముప్పున తొలి సమర్త అంటే ఇదేరా శిష్యా!”
“అలాగా గురూ! మరా వరుడి గురించి ఏమంటారు?”
“గోళీకాయకు గుమ్మడికాయకు తేడా తెలీని అమాయకాగ్రేసరుడే!”
“అంతేనా గురూ!”
“అవును శిష్యా!..ఇది చెప్పు…గోలీకాయ నిత్యమా?”
“కాదు గురూ!”
“గుమ్మడికాయ నిత్యమా?”
“కాదు గురూ!”
“రాయి నిత్యమా?”
“కా….అవును గురూ!”
“అందుకే పెద్దలన్నారు ఏ రాయైతేనేం పళ్ళూడగొట్టుకోవడానికని!”
“అంటే మీ ఉద్దేశమేమి గురూ!”
“విను శిష్యా! పదుగురి కోసం పదుగురితో పెద్ద పరదాపై పడకసీనులేసిన పడతితో సంసారం రాయి-పన్ను చందమురా!”
(మొదటి శిష్యుడు పారిపోతుండాగా మరో శిష్యుడు ప్రవేశించును)
“మరో శిష్యా!”
“గురూ!”
“ప్రశ్నలేసిన ప్రథమ శిష్యుడు ఏలారా పరుగిడుతున్నాడు?”
“కక్కొచ్చిందట గురూ!”
“అంటే?”
“కళ్యాణం దాపురించినది గురూ!”
“అంటే?”
“ఒకానొక మళయాళ మనోరమపై మనసు పారేసుకొని మనువాడబోతున్నాడు గురూ!”
“పృష్ట తాడనాత్ దంతభంగః”
“గురూ!”
“శిష్యా!”
“నాదో అనుమానం గురూ!”
“అనుమానం, అజ్ఞానం రెండూ గుడి…గుడి దీర్ఘాలురా శిష్యా!”
“ఆహా! బాగా సెలవిచ్చారు మరి అడగనా?”
“అడుక్కో…అజ్ఞానం కడుక్కో!”
“గురూ! చిన్నప్పుడు, వయసు చేసిన తొందరలో…ఒక బలహీన క్షణంలో నేనొక టెలిఫోన్ పెళ్ళి చేసుకొన్నాను!”
“అంటే టెలిఫోనునే మనువాడినావా?”
“లేదు గురూ! నాకు తరచూ ఫోన్లు చేసిన ఒక అజ్ఞాత ఆడ స్త్రీని”
“చేసినది, మాటాడినదీ స్త్రీయేనన్న నమ్మకమేంటి శిష్యా? ఆడగొంతున్న మగవాళ్ళు లేరా!”
“ఓహ్! నిజమే గురూ! నాకు తట్టలేదు. కానీ అప్పుడు పెళ్లి చేసేసుకొన్నాను. టెలిఫోన్ పెళ్ళి చేసుకొన్నట్టు ఒక ఉత్తరం కూడా రాసి నా అడ్రెస్సుకు నేనే పోస్ట్ చేసుకొన్నాను. రిజిస్ట్రార్ ఆఫీసరుకు కూడా కాపీ పంపాను!”
“అమోఘం శిష్యా! పైరోం పే కులాడి మార్నా అంటే ఇదే!”
“చిత్తం గురూ! కానీ ఇప్పుడొక బంతిలాంటి అమ్మాయి దొరికింది. నచ్చింది. పెళ్ళికి ఒప్పుకొంది కూడా! అందుకని ఆ టెలిఫోన్ పెళ్ళిని రద్దు చేయాలంటే మార్గమేమి గురూ!”
“వెర్రోహం! టెలిఫోనును దాచిపెట్టు. లెటర్ పై సంతకం ఫోర్జరీ అని గొడవపెట్టు! పెళ్ళిళ్ళ ఆఫీసరుకో లంచం కొట్టు!”
“హమ్మయ్య! అంటే నేను బంతిని పెళ్ళి చేసుకోవొచ్చునన్న మాట. థాంక్స్! పెళ్ళికి మీరే పెద్దలు గురూ!”
“పరమగురుడు చెప్పినవాడు పెద్దమనిషి కాడురా! పెద్దమనిషి అంటేనే బుద్ధులన్ని వేరురా!”