గీత గోవిందం – ఫ్రధమ సర్గము

Spread the love
Like-o-Meter
[Total: 0 Average: 0]

 

 

తృతీయ అష్టపది – ఆడియో (Audio track of 3rd Ashtapadi)

images/stories/ashtapadi/08 Asta3 vasantha.mp3


శ్లో. వసంతే వాసంతీకుసుమ సుకుమరై రవయవై
 ర్భ్రమంతీం కాంతారే బహువిహిత కృష్ణానుసరణాం
 అమందం కందర్ప జ్వర జనిత చింతాకులతయా
 వలద్భాధాం రాధాం సరస మిదమూచే సహచరీ

వసంతఋతువులో మన్మధ తాపముచేత కలిగిన బాధతో కలత జెందిన వాసంతీ పుష్పమువలే సుకుమారమైన అవయవాలతో అరణ్యంలో శ్రీకృష్ణమూర్తిని వెదుకుచున్న రాధతో ఆమె చెలికత్తె సరసంగా ఇలా అంటున్నది.


అష్టపది 3


  • మాధవోత్సవ కమలాకరం వసంతరాగ యతి తాళాభ్యాం గీయతే – వసంత రాగం, ఆది తాళం

లలిత లవంగ లతా పరిశీలన కోమల మలయ సమీరే
మధుకర నికర కరంబిత కోకిల కూజిత కుంజ కుటీరే

విహరతి హరిరిహ సరస వసంతే నృత్యతి
యువతీ జనేజ సమం సఖి! విరహి జనస్య దురంతే    (ధ్రువం)

ఉన్మద మదన మనోరథ పధిక వధూజన జనిత విలాపే
అలికుల సంకుల కుసుమ సమూహ నిరాకుల వకుళ కలాపే

మృగమద సౌరభ రభస వశంవద నవదళ మాల తమలె
యువజన హృదయ విదారణ మనసిజ నఖ రుచి కింశుక జాలే

మదన మహీపతి కనక దండరుచి కేసర కుసుమ వికాసే
మిళిత శిలీముఖ పాటల పటల కృతస్మర తూణవిలాసే

విగళిత లజ్జిత జగదవలోకన తరుణ కరుణ కృత హాసే
విరహి నికృంతన కుంత ముఖాకృతి కేతకి దంతురితాశే

మాధవికా పరిమళ లలితే నవ మాలతి జాతి సుగంధౌ
ముని మనసామపి మోహనకారిణి తరుణా కారణ బంధౌ

స్పురదతి ముక్త లతా పరిరంభణ ముకుళిత పులకిత చూతే
బృందావన విపినే పరిసర పరిగత యమునాజల పూతే

శ్రీ జయదేవ భణితమిద ముదయతి హరి చరణ స్మృతి సారం
సరస వసంత సమయ వనవర్ణన మనుగత మదన వికారం

లలితములైన లవంగ లతలపైనుంచి శీతల వాయువులు మెల్లగా వీస్తున్నవి.  కోకిలలు కూస్తున్నవి.  తుమ్మెదల ఝుంకారం మ్రోగుతున్నది.  వీటి గానంతో పొదరిండ్లు ప్రతిధ్వనిస్తున్నవి.  ఈ వసంత ౠతువు విరహిజనులను బాధపెడుతున్నది.  ఇలంటి వసంత కాలంలో బృందావనంలో కృష్ణుడు ప్రియురాండ్లతో కలసి ఆనందంగా పాడుతూ, ఆడుతూ, విహారం చేస్తున్నాడు.  ఆ ప్రదేశానికి పోదాం రావమ్మా, రాధా!

పరదేశాలకు తమ ప్రియులు వెళ్ళుటవలన ప్రియురాండ్ర హృదయములలో కామమను తుమ్మెదల ఝుంకారములు అతిశయింపజేస్తున్నాయి.  అలాంటి తుమ్మెదలు గల పుష్పగుచ్చములచే ప్రకాశించు వృక్షాలు గల వసంత ఋతువులో కృష్ణుడు విహరిస్తున్నాడు.

కస్తూరి పరిమళం గల చిగురాకులతో విలసిల్లే కానుగు చెట్లు గలిగి, యౌవనము గలవారి హృదయాలను చీల్చు మన్మధుని గోళ్ళవంటి మోదుగు పూలతో అందమైన వసంత ఋతువులో కృష్ణుడు విహరిస్తున్నాడు.

మన్మధరాజు యొక్క బంగారు దండము రంగు గల, వికసించిన కేసర కుసుమాలు కలిగి, పాటల కుసుమములను మన్మధ బాణముముల అమ్ములపొది గల వసంతంలో బృందావనంలో కృష్ణుడు విహరిస్తున్నాడు.

తెల్లగా అడవిలో పూచిన కరుణ వృక్షములు, మన్మధ బాధపొందుచూ సిగ్గు వదిలిన వియోగులను చూచి నవ్వుచున్నట్లు వున్నవి.  విరహాల హృదయాలను బ్రద్దలు కొట్టగల మన్మధుని కుంతమను ఆయుధము వలే మొగలిపూలు వికసించి వున్నవి.  అట్టి వసంతంలో కృష్ణుడు విహరిస్తున్నాడు.

మాధవి, మాలతి పుష్పాల సుగంధంతో ఘుమఘుమలాడిపోతున్నటువంటి, మునుల మనస్సులను సైతం ఆకర్షించగల తరుణులకు అకారణ బంధువైన వసంత ౠతువున కృష్ణుడు విహరిస్తున్నాడు.

బండి, గురువెంద తీగల ఆలింగనం వల్ల పులకించిపోయే మామిడిచెట్ల సమీపంలో యమునానదీ జలంతో పవిత్రమైన కాముకులను కాపాడే బృందావనంలో కృష్ణుడు విహరిస్తున్నాడు.

హరిచరణములను స్మరించుట వలన సారవంతమై, యవ్వనము గల వారికి మదన వికారం కలిగించు వసంతకాల బృందావన వర్ణన శ్రీ జయదేవ కవి గీతం ఉత్కృష్టము.

 

 

శ్లో. దరవిదళిత మల్లీ వల్లి చంచత్పరాగ

 ప్రకటిత పట వాసైర్వాసయంకాననాని
 ఇహ హి దహతి చేత: కేతకీ గంధ బంధు:
 ప్రసర దసమబాణ ప్రాణవద్గంధవాహ:

కొంచెముగా వికసించిన మల్లెతీగనుండి కురియు పుప్పొడితో అడవులను పరిమళింపజేస్తూ, గేదంగి పూల పరిమళాన్ని అంతటా వ్యాపింపజేస్తున్న మన్మధుని ప్రాణవాయువు వంటి వసంత గాలి హృదయాలను దహిస్తున్నది.

శ్లో. ఉన్మీలన్మధు గంధ లుబ్ధ మధుప వ్యాధూత చూతాంకుర
 క్రీడత్కోకిల కాకలీ కలరవై రుద్గీర్ణ కర్మ జ్వరా:
 నీయంతే పధికై: కధం కధమపి ధ్యానుధానక్షణ
 ప్రాప్త ప్రాణసమా  సమాగమ రసోల్లాసై రమీ వాసరా:

మామిడి చిగుళ్ళను, మకరందమును త్రావిన తుమ్మెదలు కదల్చగా, వాటితో ఆడుచున్న కోకిలలు కాకలీ ధ్వనులు చేయగా బాటసారులు తమ ప్రియురాళ్ళ సమాగమాన్ని గురించి కలలు కంటున్నారు.  వాళ్ళను ఎప్పుడు కలుసుకోగలమా అని ఆరాటపడుతున్నారు. ఇలా వసంతపు రోజులు గడుస్తున్నాయి.

**********

 

 

Your views are valuable to us!