అష్టమ అష్టపది – ఆడియో (Audio track of 8th Ashtapadi)
images/stories/ashtapadi/16 ASta8 Sowrastram.mp3
చతుర్ధ: స్సర్గ: – స్నిగ్ధ మధుసూదన:
శ్లో. యమునా తీర వానీర నికుంజే మంద మాస్థితం
ప్రాహ ప్రేమ భరోద్భ్రాంతం మాధవం రాధికా సఖీ
శ్రీకృష్ణుడు యమునానదీ తీరంలోని ప్రబ్బలి చెట్ల పొదరింటిలో నిశ్శబ్దంగా, నిరాశగా కూర్చొని వున్నాడు. రాధ యందలి అనురాగముతో చంచలుడై ఆమెనే ధ్యానిస్తూ కూర్చున్నాడు. అతన్ని రాధ చెలికత్తె కలుసుకొని ఇలా అంటున్నది.
అష్టపది 8
- హరివల్లభాశోక పల్లవ: కర్ణాట రగైక తాళీ తాళాభ్యాం గీయతే
నిందతి చందనమిందుకిరణమను విందతి ఖేదమధీరం
వ్యాళనిలయ మిళనేన గరళమివ కలయతి మలయ సమీరం
మాధవ మనసిజ విశిఖ భయాదివ భవదవనయా త్వయి లీనా
సా విరహే తవ దీనా (ధృవం)
అవిరళ నిపతిత మదన శరాదివ భవదవనాయ విశాలం
స్వహృదయ మర్మణి వర్మ కరోతి సజల నళినీదళజాలం
కుసుమ విశిఖ శర తల్పమనల్ప విలాస కలా కమనీయం
వ్రతమివ తవ పరిరంభ సుఖాయ కరోతి కుసుమ శయనీయం
వహతి చ వలిత విలోచన జలధర మానన కమలముదారం
విధుమివ వికట విధుంతుద దంత దళన గలితామృతధారం
విలిఖతి రహసి కురంగ మదేన భవంతమసమ శర భూతం
ప్రణమతి మకరమధో వినిధాయ కరే చ శరం నవ చూతం
ధ్యాన లయేన పుర: పరికల్ప్య భవంతిమతీవ దురాపం
విలపతి హసతి విషీదతి రోదితి చంచతి ముంచతి తాపం
ప్రతిపదమిదమపి నిగదతి మాధవ ! తవ చరణే పతితాఅహం
త్వయి విముఖే మయి సపది సుధానిధిరపి తనుతే తను దాహం
శ్రీ జయదేవ భణిత మిదమధికం యది మనసా నటనీయం
హరి విరహాకుల పల్లవ యువతి సఖీ వచనం పఠనీయం
కృష్ణా ! నీ విరహము వలన దైన్యము చెందిన రాధ, మన్మధుని పుష్పబాణములకు భయపడని నీలో దాక్కుంటున్నది.
చందన గంధమును నిందిస్తున్నది. చంద్రకిరణాలను దూషిస్తున్నది. మలయ పర్వతము పఈ నుండి వచ్చు మలయమారుతమును విషంగా భావించి బాధపడుతున్నది.
అంతులేకుండా తనపఈ వచ్చి పడుతున్న మన్మధ బాణాలు తన హృదయంలో వున్న నీకు తాకుతాయేమో, బాధిస్తాయేమో అనే భయంతో తన వక్షస్తలాన్ని పెద్దపెద్ద తామరాకులతో దట్టంగా కప్పుకొని, కవచంగా చేసికొంటున్నది.
నీ ఆలింగన సుఖమును కాంక్షించినదై మదన బాణములతో అమర్చిన తల్పం మీద పడుకుని వ్రతమొనర్చుదాని వలె సకల కళా కమనీయమైన కుసుమ శయ్యపై శయనించినది.
రాధ, నీ విరహ బాధచే మేఘములవలే కన్నీళ్ళు కురియు కన్నులతో, వికటములైన తన దంతములతో రాహువు కొరికిన చంద్రునివలే నున్న తన ముఖ కమలము నుండి అమృతధారలు కురియుచున్నవా అన్నట్లు వున్నది.
రహస్యంగా రాధ కస్తూరితో నిన్ను మన్మధ రూపంలో చిత్రిస్తున్నది. వాహనముగా మొసలిని, చేతిలో లేత మామిడి చిగురు బాణాలను ఆచిత్రమున జేర్చి, “మదనా ! నన్ను వేధించకుము” అని వేడుకొంటున్నది.
రాధ భరించరాని వేదనతో, నీవు తనముందు వున్నావని భావించుకొని విలపిస్తున్నది, వెర్రిగా నవ్వుతున్నది, విషాదం పొందుతున్నది, రోదిస్తున్నది, పరిగిడుతున్నది, నిన్ను ధ్యానిస్తూ తన సంతాపాన్ని మరచిపోవడానికి ప్రయత్నిస్తున్నది.
‘మాధవా ! నేను నీ పాదాలపై పడ్డాను. నీవు నాకు విముఖుడవు కావడం వల్ల చంద్రుడు సైతం నా శరీరాన్ని తపింపజేస్తున్నాడు” అని రాధ అడుగడుగుకూ గొణుకుచున్నది.
భక్తులారా ! జయదేవ కవి రచించిన ఈగీతం మీ మనస్సున నటింప తగినది. హరి విరహముచే వ్యాకులత చెందిన రాధయొక్క చెలికత్తె వాక్యము పఠింపదగినది.
నవమ అష్టపది – ఆడియో (Audio track of 9th Ashtapadi)
images/stories/ashtapadi/17 Asta9 Bilagari.mp3
శ్లో. ఆవాసో విపినాయతే ప్రియ సఖీ మాలాపి జాలాయతే
తాపోపి శ్వసితేన దావదహన జ్వాల కలాపాయతే
సాపి త్వద్విరహేణ హంత ! హరిణీ రూపాయతే హా ! కధం
కందర్పోపి యమాయతే విరచయన్ శార్దూల విక్రీడితం
కృష్ణా, నీ విరహంతో రాధ అడవిలోనే నివసిస్తోన్నది. చెలికత్తెలు కూడా ఆమెకు బంధనాలయ్యారు. వేడి నిట్టూర్పులు కార్చిచ్చు వలే కాలుస్తున్నాయి. మన్మధుడు పులి వలే క్రీడిస్తూ యముని వలే వున్నాడు. ఇంక ఆమె ఎలా జీవిస్తుంది?
అష్టపది 9
- స్నిగ్ధ మధుసూదన రాసావలయ: దేశాఖ్య రాగైక తాళీ తాళాభ్యాం గీయతే
స్తన వినిహితమపి హారముదారం
సా మనుతే కృశా తనురివ భారం
రాధికా కృష్ణ ! రాధికా
రాధికా తవ విరహే కేశవ (ధృవం)
సరస మసృణమపి మలయజ పంకం
పశ్యతి విషమివ వపుషి సశంకం
శ్వసిత పవనమనుపమ పరిణాహం
మదన దహనమివ వహతి సదాహం
దిశి దిశి కిరతి సజల కణజాలం
నయన నళినమివ విగళిత నాళం
నయన విషయమపి కిసలయ తల్పం
కలయతి విహిత హుతాశ వికల్పం
త్యజతి న పాణి తలేన కపోలం
బాల శశినమివ సాయమలోలం
హరిరితి హరిరితి జపతి సకామం
విరహ విహిత మరణేన నికామం
శ్రీ జయదేవ భణితమితి గీతం
సుఖయతు కేశవ పదముపనీతం
కేశవా ! రాధికా కృష్ణా! రాధ నీ విరహం లో కృశించిన శరీరం గలదైనది కనుక తన స్తనములపై గల హారమును భారముగా భావిస్తున్నది.
సరసమై, మసృణమైన చందన లేపమును కూడా విషం వలె భయంగా శంకతో చూస్తున్నది. సుదీర్ఘమైన తన నిట్టూర్పు గాడ్పును విరహ తాపం వలన మదనాగ్ని వలే బాధిస్తున్నది. జలకణములతో కూడి తూడు విరిగిన కమలము వంటి నేత్రములతో అన్ని దిక్కులకూ చూస్తున్నది.
చిగురుటాకు శయ్య కన్నులకు కనిపిస్తున్ననూ, దానిని అగ్నిశయ్యతో సమంగా భావిస్తోంది. సాయంకాల బాలచంద్రుని వలె వున్న తన కపోలమును తన చేతిలో ఉంచుకొని కదలుచున్నది.
వియోగ బాధతో మరణించుచున్న దానివలే ఆఖరు మాటగా హరీ ! హరీ ! అని ఎంతో అభిలాషతో జపిస్తున్నది.
ఈవిధంగా కేశవ పదములను సమర్పించిన జయదేవ కవి గీతము శ్రోతలకు, గాయకులకు సుఖము నొసంగుగాక !
శ్లో. సా రోమాంచతి సీత్కరోతి విలపత్యుత్కంపతే తామ్యతి
ధ్యాయత్యుద్భ్రమతి ప్రమీలతి పతత్యుద్యాతి మూర్చత్యపి
ఏతాపత్యతను జ్వరే వర తనుర్జీవేన్న కిం తే రసాత్
స్వర్వైద్యప్రతిమ ! ప్రసీదసి యది త్యక్తోన్యధా హస్తక:
రాధ గగ్గుర్పడుతున్నది. చీత్కారము చేయుచున్నది. విలపించుచున్నది. వణుకుచున్నది. బాధపడుచున్నది. నినె ధ్యానిస్తున్నది. ఇటూఅటూ తిరుగుతున్నది. ఏవో శృంగార చేష్టలు గుర్తుకు వచ్చి కనులు మూసుకుంటున్నది. శరీరంలో శక్తిలేక కింద పడిపోతున్నది. మళ్ళీ మెల్లగా లేస్తున్నది. మూర్చిల్లుతున్నది. స్వర్గంలోని దేవతలతో సమానమైన ఓ కృష్ణా ! ఇలాంటి మన్మధ జ్వరంలో నీవు ప్రసన్నుడవైన యెడల ఆ సుందర దేహము గల రాధ నీ శృంగార రసము వలన జీవించదా? నీవు దయదలచకున్న యెడల చేతితో సంజ్ణలు చేసే శక్తి కూడా కోల్పోగలదు. మాట్లాడే శక్తి ఎట్లాగూ లేదు. ఇప్పటికైనా ప్రసన్నుడవు కాకపోతే నీకన్న కఠినుడైన యముడు మరొకడు వుండడు.
శ్లో. స్మరాతురాం దైవత వైద్య హృద్య
త్వదంగ సంగామృత మాత్ర సాధ్యం
నివృత్త బాధం కురుషే న రాధాం
ఉపేంద్ర ! వజ్రాదపి దారుణోఒసి
దేవతల వైద్యుల వలే హృద్యుడవైన గోపాలా ! మదనునిచే బాధింపబడుతూ, నీ శరీర సాంగత్యమనే అమృతమాత్రమునే రోగ నివారణ సాధ్యముగాన, రాధను బాధ నుండి విముక్తి కలిగించనియెడ నీవు నీవు వజ్రము కన్నా కఠినుండవు అని అనిపించుకొనగలవు.
శ్లో. కందర్ప జ్వర సంజ్వరాతుర తనోరాశ్చర్యమస్యాశ్చిరం
చేతశ్చందన చంద్రమ: కమలినీ చింతాసు సంతామ్యతి
కింతు క్లాంతి వశేన శీతల తరం త్వామేకమేవ ప్రియం
ధ్యాయంతీ రహసి స్థితా కధమపి క్షీణా క్షణం ప్రాణితి
కామ జ్వర సంతప్త శరీరము గల రాధ మనస్సు – చందనము, చంద్రుడు, తామర తీగను సైతం సహించకున్నది. ఇవి ఆమెకు శీతలత్వమును ఈయజాలవు. ఆశ్చర్యము. అయిననూ, అలసటతో ఒంటరిగా ఉన్న ప్రియుడవైన నిన్ను ఒక్కడినే అన్నిటికంటే చల్లనివానిగా స్మరణజేస్తూ, కృశించియూ ఎలాగో క్షణ కాలం ప్రాణంతో వున్నది.
శ్లో. క్షణమపి విరహ: పురా న సేహే
నయన నిమీలన ఖిన్నయా యయా తే
శ్వసితి కధామసౌ రసాల శాఖాం
చిర విరహేణ విలోక్య పుష్పితాగ్రాం
పూర్వం నీవూ రాధా కలసి వున్నప్పుడు కూడా కన్నులు మూసి తెరచినంతనే కలిగే విరహాన్ని సైతం సహించగలిగేది కాదు. అట్టి రాధ చిరకాల విరహం వల్ల పుష్పితాగ్రములు గల తీయ మామిడి కొమ్మలను జూచి ఈ వసంతములో ఎట్లు జీవించును?
శ్లో. వృష్టి వ్యాకుల గోకులావన రసాదుద్ధృత్య గోవర్ధనం
బిభ్రద్వల్లవ వల్లభభి రధికానందాచ్చిరం చుంబిత:
దర్పేణైవ తదర్పితాధర తటీ సిందూర ముద్రాంకితో
బాహుర్గోపతనో స్తనోతు భవతాం శ్రేయాంసి కంస ద్విష:
కుండపోతగా ఇంద్రుడు కోపంతో వర్షం కురిపిస్తున్నప్పుడు, భయపడిని గోకులమును రక్షించుటకు గోవర్ధన పర్వతమును పైకెత్తిన బాహువును, గొల్లభామలు ఆనందంతో ముద్దు పెట్టుకుంటూ వుండగా వారి సిందూర వర్ణ రంజితములైన పెదవుల ముద్రలు పడిన శ్రీకృష్ణ పరమాత్మ బాహువు మీకు శ్రేయములను కలుగజేయుగాక !
||ఇతి శ్రీ జయదేవకృతౌ గీతగోవిందే స్నిగ్ధ మధుసూదనోనామ చతుర్ధస్సర్గ:||
{jcomments on}