’వైకుంఠపాళి’కి ప్రముఖ కవి ఇక్బాల్‍చంద్ ముందుమాట
Download Link can be found at the end of the Foreword
మరొకడు రఘోత్తమ!
*******
“ఒకడు నాచన సోమన” అని విశ్వనాథ అన్నారు.
“మరొకడు రఘోత్తమ” అని నేను అంటున్నాను.
ఈ మాట నేనేదో సెన్సేషన్ కోసం అంటున్నది అంతకన్నా కాదు.
అవును ముమ్మాటికి విశ్వనాథ కు కొనసాగింపు రఘు రచనలు.
కొంచెం వివరంగా చెప్పాలంటే లేదా రీసెర్చ్ మెథొడాలజీని అడ్డం పెట్టుకొని పలకాలంటే ’వేయిపడగలు’ లో విశ్వనాథ ఎక్కడ ఆగిపోయారో రఘు తన వైకుంఠపాళిని అక్కడితో మొదలు పెట్టాడు. దీనర్థం విశ్వనాథను తగ్గించడమో లేదా రఘు ని పొగడడానికో అనే దుర్భుద్ది ఈ ఇక్బాల్ కి లేదని ముందే మనవి.
విశ్వనాథ ఓరియెంటేషన్ ఏదైతే వుందో దాన్ని సానబట్టి మెరుపులు మెరిపిస్తున్న ఫిజికల్, మెటాఫిజికల్ స్టోరీ ఈ ’వైకుంఠ పాళి.’
రఘు పై ప్రేమ తో కానీ పగ తో కాని నేనీ వాదన చేయడం లేదు. రఘు రచనలు మరీ ముఖ్యంగా ’వైకుంఠపాళి’ నవల చదివిన తర్వాత మీరూ ఇదే నిజమని ఒప్పుకుంటారు…
ఈ రోజు ’వేయిపడగ’ల్ని చదివితే దాని ముగింపు సమగ్రంగా వుందని అనిపించదు. ఏదో లోపం వుందని అనిపిస్తుంది. లోపం అనడం కన్నా దాన్ని గ్యాప్ అనడం సబబు. ఆ ఖాళీని రఘు పూరిస్తున్నాడు. కొన్ని విషయాల్లో ’వేయిపడగలు’ ని మించిన వైనమూ చూడొచ్చు.
బహుశా మరో 30-40 ఏళ్ళ తర్వాత ’వైకుంఠపాళి’ కి ఆనాటి సమాజానికి మధ్య వున్న ఖాళీని పూరించడానికి మరో విశ్వనాథ, మరో రఘోత్తమ రావు అవసరం రావొచ్చు కదా.. రావాలి కూడా..!
సాహిత్యం మడుగు నీటిలా ఒకే చోట నిశ్చలంగా వుండదు, వుండరాదు కూడాను. నిత్య ప్రవాహశీలమై వుండాలి.
అలా చూస్తే నిన్నటి ప్రవాహానికి మరో లింకు నేటి ప్రవాహం పేరు – కడప రఘోత్తమ రావు.
అయితే రఘు పై విశ్వనాథ ప్రభావం కానీ ’వేయిపడగలు’ ప్రభావం కాని ఇసుమంతయినా లేదని నేను కచ్చితంగా చెప్పగలను. షేక్స్పియర్ లో కనిపించే చాలా అంశాలు పింగళి సూరన లోనూ వుంటాయి. మరి సూరన పై షెక్స్పియర్ ప్రభావం వున్నట్లా?
ఇదీ అంతే…
EXPLORE UNTOLD HISTORY
విశ్వనాథ కొనసాగింపు మాత్రమే రఘు లో చూస్తాము.
శైలి విషయంలో ఎవరికి వారే..
ఇద్దరిలోనూ కాన్సర్వేషన్ మెథడ్ కనిపిస్తుంది.
అయితే విశ్వనాథ శైలి కన్నా రఘు శైలి కి ప్రవహ వేగం ఎక్కువ. అలాగే బ్రీవిటి కూడా ఎక్కువే…విశ్వనాథది 5 రోజుల ఆట అయితే రఘు వచన శైలి 20-20.
’దేత్తడి ధనాధన్’. మొత్తం 300 పేజీల్లో 3000 పేజీల సారాన్ని పిండాడు రఘు.
*****
రచయితగా రఘు విశ్వనాథ ను ఇమిటేట్ చేయలేదు. స్వతహాగా రఘు వ్యూ ఆఫ్ లైఫ్ స్టైలే అల్లాంటిది. వృత్తి పరంగా తన నవల్లోని అనంత్ పాత్ర లానే కార్పోరేట్ కంపెనీల్లో ఉద్యోగాలు చేసాడు..అయినప్పటీకీ నిజ జీవితంలో కేశవశర్మ వంటివాడు. అలా అని అన్య సంప్రదాయల పట్ల విషం గక్కడం తెలీదు.
రఘు కి ఆధ్యాత్మికత వొక ఫిలాసఫి మాత్రమే. అంతే కానీ రాజకీయం కాదు. వ్యాపారం అంతకన్నా అసలే కాదు..
మనోడికి వున్న జ్ఞానం/విజ్ఞానానికి యే బాబా/స్వామీ వేషమే వేస్తే అతి తక్కువ కాలం లోనే ఇప్పుడు వున్న చిన్నా చితకా బాబాలు/స్వాములు తన దుకాణాల్ని మూసుకోవడం గ్యారంటీ.
కాకపోతే మనవాడి కమిట్మెంట్ అలాంటిది. గత 13 యేళ్ళుగా రఘులో నేను చూస్తున్నది ఈ శైలే.
*****
కన్నడిగుడైన రఘు ఆంగ్ల సాహిత్యం లో ఎం.ఏ చదివాడు.
సంస్కృత, ఆoగ్ల భాషల్లో ప్రవేశంవున్న రఘు ఇప్పుడు తెలుగు సాహిత్యం లో తనదైన శైలి తో వచన రచన లో తనదైన బలమైన ముద్రను వేస్తున్నాడు. బహుశా రఘు సాహిత్య భావజాలంతో సంప్రదాయేతర వాదులకు కన్నా సంప్రదాయ వాదులకే ఎక్కువ నొప్పి కలగవచ్చు అని నా అనుభవం చెబుతున్న అనుమానం.
ఎందుకంటే ఇదొక ఇగో కి సంబంధించినది. ఎప్పటి నుండో వాళ్ళకి తెలీని విషయాల్ని ఇప్పుడొక కుర్ర విశ్వనాథ వచ్చి ఆ కఠిన, కఠోర సత్యాల్ని పొట్లంలా విప్పి అలవోకగా చెబుతుంటే కరిగిపోతున్న వాళ్ళ పెద్దరికాన్ని చూసుకుంటూ విద్యార్థుల్లా వినాల్సివస్తున్నదనే సైకలాజికల్ ఫోబియా అది.
ఈ నవలలో చర్చించిన అనేక విషయాలు శాస్త్రం పట్ల రఘుకి వున్న సమగ్ర పరిశీలన, పరిశోధనను చూపుతుంది.
ఒక విషయాన్ని అనేక రకాలుగా పరీక్షించిన తరువాతే కాగితం మీద పెట్టే అలవాటు వుంది ఈ రచయితకు.
’వైకుంఠపాళి’ ఒక మనోవైజ్ఞానిక నవల.
దీనిలోని పాత్రలు కేవలం సింబాలిక్ షేడ్స్ మాత్రమే.
మనో గర్భం లో నిక్షిప్తమైన నిగూఢ రహస్యాల్ని మనోరంజకంగా దారి చూపే మోహదీపాలు. మోక్ష మార్గాలు కూడా!
అందుకే ఒక్కో సారి పాత్రలు తమ పరిధికి మించి ప్రసంగాలు చేస్తున్నాయా అనే అనుమానం కలుగుతుంది. అయితే ప్రతిభావంతుడైన రచయిత చేతిలో సృష్టించుకొన్న పాత్రలకు ఆ మాత్రం స్వేచ్చ ఆమోదయోగ్యమే కదా!
ఈ నవల లో ముఖ్యమయిన పాత్రలు మూడు జంటలు.
శ్రీ మహా విష్ణువు, శ్రీ మహాలక్ష్మి … ఇవి అలౌకికాలైన పురాణ పాత్రలు.
కేశవ శర్మ, సుమతి … ఒక ఆదర్శ జంట
అనంత్, రంజని … ఆధునికోత్తర జంట
మొదటి జంట ఆడిస్తుంటే మిగిలిన ఇరు జంటల చుట్టూ మానవీయ కథా కథనం చక్కర్లు కొడుతుంది.
కేశవ శర్మ, సుమతిలు నిజంగా అసూయ కలిగించే పాత్రలు. ఇవి బహుశా రచయిత మనసులో పుట్టిన ప్లాటానిక్ పాత్రలేమో!
వీరి దాంపత్యంలో ఒక్కోసారి ఆదర్శ దాంపత్యం, మరోసారి గురు-శిష్యుల రిలేషన్‍షిప్ తో పోటీ పడుతుంటాయి. ఈనాటి కాలంలో ఇలాంటి పాత్రలు నిజ జీవితంలో ఆశించడం అత్యాశే అవుతుంది. ఇప్పుడు కేశవ శర్మల కంటేనూ అనంత్ లే ఎక్కువ కనిపిస్తారు.
అనంత్, రంజనిల జంట కొంచెం కల్లోల ప్రవాహం వంటిది.
ఆటుపోట్లు, కుదుపులు, సరసాలు, విరసాలు కలగలిసిన దుఃఖిత పాత్రల సుఖాంత కథనం వీరిది.
వీరేకాక సుబ్బు మధ్యలోమధ్యలోనే వెళ్ళిపోయే అతిధి ..
విశ్వేశ్వర్, అతని చెల్లెలు, పావని, స్టెల్లా, ముకుల్, రంజని బాస్ ఇలా అన్నీ అలా వచ్చి తమ తమ ప్రత్యేకతలను చూపించి రంగం వదిలి పోతుంటారు.
కథా పరంగా రచయిత జోక్యం ఎక్కడా కనిపించదు. పాత్రల పరంగా చూస్తే—
కథ లో 2 ముఖ్యమయిన మలుపులు వున్నాయి.
మొదటిది రంజని సుమతి ని కలవడం.(వీరు ఒకే ఒక్కసారి కలుస్తారు, మరోసారి ఫోన్లో కొన్ని క్షణాలు పలకరించుకుంటారు)
రెండోది: సుబ్బు ఆత్మహత్య…
ఈ రెండు ఘట్టాలే కథా కథానంలో మరింత వేగాన్ని పెంచుతాయి. కథకు మూలం కూడా ఈ రెండు సంఘటనలే అని నా నమ్మకం.
*****
ఒకే మనిషి లో అనేక కోణాలు వున్నట్లు గానే ఒకే మనిషి లోని ఒక్కక్క కోణాన్ని ఒక్కక్క పాత్రలోకి పరకాయ ప్రవేశం చేసి ఎంతో ప్రేమతో, నేర్పరితనంతో ఈ పాత్రల్ని రఘు సృష్టించాడు.
మిత్రుడి రచన అనే అభిమానంతో ఒకసారి, పాఠకుడిగా ఒకసారి, విమర్శకుడిగా మరోసారి, సహృదయునిగా ఇంకోసారి , లొసుగులు వెదుకుదామనే దురుద్దేశంతో మరోసారి – ఇలా అనేక సార్లు ఈ నవల్ని చదివాను. అందుకే ఈ నవలలోని అన్ని పాత్రల్తోనూ స్నేహం కుదిరింది.
ఈ రచన కు ఒక ప్రత్యేకత వుంది.
మొదటి 10-15 పుటలు పాఠకుడు ఓపిగ్గా చదవాలి, తరువాత ఆగే పని వుండదు. దీనికి ముఖ్య కారణం — మనకు అలవాటు అయిన వర్తమాన సాహిత్య ధోరణి కి భిన్నంగా ఉండటమే. కాబట్టి కొంచెం హృదయంతో చదవాలి.
ఆవకాయ.కామ్ లో సీరియల్ గా అచ్చయినప్పుడు సుమారు 15000-20000 మంది చదివినట్లు ఒక లెక్క..నెట్ లోకం లో విశేష ప్రాచుర్యం పొందిన ఈ నవల ఇప్పుడు పుస్తక రూపంలో వస్తుంది.
మిత్రులు రఘుకి అభినందనలు.
పి.ఎస్:
మిత్రమా!
ఏ ఉత్తమ రచయిత కూడా మొత్తం పొట్లం విప్పి చెప్పడు. మీరు అదే చేసారు. ఇంకా అనేక విషయాల చర్చ కొనసాగించ వలసి వుంది. నా లెక్క తప్పు కాకపోతే ఆంధ్ర పాఠకులు త్వరలో వైకుంఠపాళి-2 ని చదువుతారు.
శెలవ్…
-ఇక్బాల్ చంద్
*****