ఎక్కడికీ వెళ్లలేని రాత్రుల ఏకాంతంలో…

ఎక్కడి నించి మొదలెట్టాలి వజీర్ తో నా ప్రయాణం గురించి? నిజానికి శ్రీశ్రీ మీది కోపంతో మొదలెట్టాలి. కవిత్వ అభిరుచికి సంబంధించినంత వరకూ “ఊరంతా వొక దారి అయితే, ఉలిపికట్టెది ఇంకో దారి” అన్నట్టుగా వుండేవాణ్ణి నేను మొదట్లో! (ఇప్పుడూ అంతేనేమో?) కాలేజీ రోజుల్లో విద్యార్థి రాజకీయాలతో తలమునకలుగా వుండేటప్పుడు, ప్రతి కాలేజీకి వెళ్ళి ఎప్పటికీ రాని విప్లవాల మీద ఉపన్యాసాలు దంచుకుంటూ తిరిగే కాలంలోనే మొదలయింది శ్రీశ్రీ అంటే ఈ కోపం!