“ఇష్టపడి” చూసిన “శ్రీరామరాజ్యం”…

Spread the love
Like-o-Meter
[Total: 0 Average: 0]

నేను బాపు రమణల అభిమానిని. అలానే బాలకృష్ణకు కూడా అభిమానిని. చివరికి టీవీ సీరియల్సు చూసి సమీర్ ను కూడా అభిమానించాను. ఆ అభిమానంతోనే ఆఫీసు పనివత్తిళ్ళ మధ్య, కుటుంబ ఈతిబాధల మధ్య కూడా వెసులుబాటు కలిగించుకుని హడవుడిగా టిక్కెట్టు కొనుక్కొని మరీ శ్రీరామరాజ్యం చూసాను. ఏంతో అభిమానంతో ఆశలపల్లకీలో సినిమాకు వెళ్ళిన నేను నవరసభంగుడినై నడుస్తూనే తిరిగి ఇంటికి చేరాల్సివచ్చింది. శోకప్రధానమైన ఇతివృత్తమైతే మాత్రం మిగిలిన రసాలు నీరసించాలా అన్నది నాకు నేను వేసుకుని, బాపును అడగాలనుకున్న ప్రశ్న. పాత కధే అయినా కొత్త మసాలాలు లేవా అన్నది మరో ప్రశ్న. ఇక నాకు నచ్చని విషయాల మీద నాలుగు రాళ్ళు :

 

ఇప్పటి టెక్నాలజీ సాయంతో ఆహా ఓహో అనే అద్భుతాలు ఆవిష్కరించారని అందరూ ఆశ్చర్యచకితులైనట్లు చాలా సమీక్షలు చెబుతున్నాయి.

 

ఆనాటి లవకుశ నుండి ఈనాటి శ్రీరామరాజ్యం దాకా ఎన్నెన్నో పౌరాణిక సినిమాలు రామాయణ ఇతివృత్తంతో వచ్చాయి. విషాదమేమిటంటే, అప్పటి సినిమాల నుంచి ఇప్పటి సినిమాల దాకా ఆంజనేయస్వామికి సినిమాలో తగిలించే తోకలో మార్పేమీ లేదు. నిజానికి ఇప్పటికీ స్టేజీ డ్రామాలలో వాడేది కూడా అటువంటి తోకే. వంకీలు తిరిగి బిర్రబిగదీసుకున్న ఆ తోకతో ఒకానొక రసభంగం కలిగిందనే చెప్పాలి.

 

ఇంతవరకు దాదాపుగా అన్ని సినిమాల్లోనూ సీతాదేవిని దీనంగానే చిత్రీకరించారు. ఈ సినిమాలోనైతే భీరువుగా కూడా చిత్రీకరించారు. లేకపోతే, ఒకసారి లక్ష్మణుడు, మరోసారి హనుమంతులవారు, చివరికి భరతుడు పాదాల మీద పడితే గాభరా పడుతూ సీతా మాత వెనక్కి జరిగిపోవటం ఏమిటి? ఈ సన్నివేశాల్లో కూడా రసభంగమైతే కలిగింది కానీ, అదే రసమో తెలీదు.

 

ఎంత నీలమేఘశ్యాముడని కవులు కీర్తించినా అంతేసి రంగు పులమాల్సిందేనా శ్రీరాముడికి. చివరికి అంత:పురంలోనూ, రాజ భవనంలోనూ అదే నీలి రంగా! భరతుడు, లవుడుకి కనీసమాత్రంగానైనా నీలిరంగు వేయకపోవటం రసభంగమే కాకుండా నాకు నేత్రభంగం కూడా అయ్యిందనే చెప్పవచ్చు.

 

 

పాత లవకుశలో శతృఘ్నుడుగా శోభన్ బాబుకు ఓ రెండు డైలాగులతోబాటు మరో రెండు బాణాలు కూడా వేసే అవకాశం ఇచ్చారు. ఈ సినిమాలోనైతే మరీ దారుణం… బాణాల సంగతి తర్వాత కోరస్ లో తప్పించి మరే డైలాగు ఇచ్చినట్లు లేరు శతృఘ్నుడుకి. శతృఘ్నుడి నటన గమనించాలనుకున్న నాకు ఆశాభంగమే కలిగింది.

 

 

ఈవెన్ రమణ మార్కు డైలాగులు కూడా కొన్నిచోట్ల సంభ్రమాశ్చర్యాలు కలిగించాయి. అశ్వమేధయాగానికి అయోధ్య నుంచి ఆహ్వానం అందించాలని వచ్చిన వార్తాహరులతో మాట్లాడుతూ… “సమయం సందర్భం వచ్చినప్పుడు నేను వస్తానని చెప్పండి” (దాదాపు ఇదే అర్ధంలో) అంటూ వాల్మీకి ప్రత్యుత్తరమిస్తాడు. సమయం సందర్భం అశ్వమేధ యాగమే అయినప్పుడు వేరే సమయాసందర్భాల గురించి ఏం చెబుతున్నాడో వాల్మీకుడు అని తీవ్రంగా ఆలోచించినా అర్ధంకాక ఆలోచనాభంగం చేసుకోవాల్సివచ్చింది.

 

అలానే ఇళైరాజా సంగీతంలో అక్కడక్కడ పాటల్లోనూ, నేపధ్యంలోనూ సన్నాయి నొక్కులతోపాటు గిటారు మీటల నొక్కుడు కూడా వినిపించింది. బాగ్గ్రౌండ్ పాటల్లో ఈ నొక్కుళ్ళు ఇంపుగానే ఉన్నా, లవకుశులు చెప్పే కథల్లో మాత్రం చెవులకు కంపు అనిపిచ్చింది.

 

సీతమ్మ చింతకాయ తినటం, ఆంజనేయస్వామి మూతి అర సెంటీమీటర్ చిన్నదిగా ఉండటం, వాల్మీకి కన్ను, రాముడి పుట్టుమచ్చ, లక్ష్మణుడి గౌను, తిప్పడి ముక్కెర ఇవన్నీ నాలోని నవరసాలని రసాభాసగా చేసేశాయి. వీటితోపాటు ఈ సినిమాలో సూర్యాకాంతం రమణారెడ్డిలు లేని లోటు కొట్టొచ్చినట్లు కనిపించింది. అదే ఈ సినిమాకో శాపమని నాకు అనిపిస్తున్నది.

 

Your views are valuable to us!