“ఉత్తినే తిని తొంగుంటే మడిసి గొడ్డుకి తేడా ఏటుంటదని” విడమర్చి చెప్పిన బాపూ మాటల కాంట్రాక్టర్ ముళ్ళపూడి వెంకటరమణ నిదురించే ఏ తోటలోకో పాటలా వెళ్ళిపోయారు. రేవు బావురుమంటోదని బాపూ గుండె అంటూనే ఉంటుందిప్పుడు.
పాపం బుడుగు, సీగానపెసూనాంబ, దీక్షితులు లాంటి ఎవర్ గ్రీన్ అల్లరి పిల్లలు ఇంక మీదట మౌనంగా అల్లరి చేస్తారా? చెయ్యగలరా? చేసినా మనం ఆస్వాదించగలమా?
“వచ్చినవాడు ఫల్గుణుడు..” అంటూ బుడుగు బాణం వేస్తే “వీచింది ఎదురుగాలి!” అని పెసూనాంబ తలతిప్పకుండా చెబితే…ముక్కు మీదికి దూసుకొస్తున్న బాణాన్ని విస్తుబోయి చూస్తున్న బుడుగును మరువగలమా? బాపూ గీతలకు రమణ రాతలు సహజ కవచ కుండలాల్లాంటివి.
పింగళి నాగేశ్వర రావు తర్వాత మాటలను శాసించిన సినీ రచయితల్లో రమణగారు ప్రథమ పంక్తిలో ఉంటారు. “వీరే పంచాయితీ స్వరూపులు” అని పొగిడినా, “మగాడిదలు” అని తిట్టినా, “అపార్థసారథమ్మా!” అని ఆప్యాయంగా దెప్పిపొడిచినా, కోలాకు ప్రతిసృష్టి “ఇంకోలా” చేసినా అవి రమణ మార్కు మంత్రాలయ్యాయి.
కన్నుల్లో నీళ్ళు నిండె మా అల్లరి బుడుగుకు
ప్రాణాలే నిలిచిపోయే సీగానపెసూనకు
మాటల్లో మిగిలిపోతు, మబ్బుల్లో కలిసిపోతు
వింటావా ముళ్ళపూడి వెంకటరమణ!