బిజినెస్ మాన్ – ద బీప్

Spread the love
Like-o-Meter
[Total: 0 Average: 0]

ఈ మధ్య మన సినిమాలలో బీప్ ల భాష చాలా ఎక్కువైపోతున్నది. విషయం ఏమిటంటే, మొన్ననే బిజినెస్ మాన్ సినిమా చూసొచ్చాను. ముందు సీనులో ముంబాయిని బీప్ పోయిస్తాననే డైలాగు దగ్గర నుండి, చివరి సీనులో ఇండియాను బీప్ పోయిస్తాననేదాకా చాలా చోట్ల బీప్ లే! ఒకప్పుడు సినిమా సంభాషణలే ఆస్వాదించదగ్గ సాహిత్యంలా వినిపించేవి. ఇప్పటి మన సినిమా పాత్రధారుల సంగతేమో కానీ, ప్రేక్షకుడు మాత్రం సినిమా చూసొచ్చాక చెవులు కడుక్కోవాల్సిన పరిస్థితి దాపురించింది. ఇక బీప్ లే కాకుండా, కొన్ని సన్నివేశాలలో బొమ్మలు బూజర చేసే పద్ధతులు కూడా వచ్చాయి. శ్వేతా భరద్వాజ్ ఐటం సాంగ్ దానికో ఉదాహరణ. ఆ పాటలో సగానికి సగం బొమ్మలు బూజర బూజర చేసేసారు. మరో విచిత్రం ఏమిటంటే మితిమీరిన హింసాత్మక దృశ్యాలు ఉన్న పోరాట సన్నివేశాల్లో బూజరలు ఉండనే ఉండవు.

 
 

అసలు సంగతేమిటంటే, ఈ సినిమా కు “ఏ” సర్టిఫికెట్ ఇచ్చారు. అడల్ట్ సర్టిఫికెట్ ఇచ్చినా కూడా సంభాషణలు బీపులుగాను, బొమ్మలు బూజరగాను అయ్యాయంటే, ఆ సినిమా దర్శకుడు ఎంత బీపో ప్రేక్షకులకు అర్ధమౌతుంది. లేదంటే, ఎన్ని బీప్ లు, బూజరలు ఉంటే, సినిమా హిట్టయ్యే అవకాశాలు అంత పెరుగుతాయనేది మన దర్శకుడి అభిప్రాయమేమో! దర్శకుడే ఈ సినిమాకు సంభాషణలు అందించాడట! బూతులు ఉంటే ఖచ్చితంగా కత్తెర వేయబడతాయని తెలిసినా దర్శకుడు సిద్ధమైపోయి, బీప్ లతో సరిపుచ్చటం ఏమిటో ప్రేక్షక బీప్ లకు అర్ధం కాదు.

 
 

సాధారణంగా ఇటువంటివి సెన్సారు వారు కత్తెర వేసేస్తారు. మరి సెన్సారు వారు బీప్ లకు బూజరలకు అభ్యంతరం వ్యక్తం చేయకుండా, ఉదార హృదయంతో సినిమా విడుదలకు అనుమతి ఇచ్చేయటం ప్రేక్షక బీప్ లకు అర్ధం కాదు. అడల్టు సినిమాలకు బీప్ లు బూజరలు ప్రత్యేక లక్షణాలుగా మన సెన్సారు బీప్ వారు పరిగణిస్తున్నారేమో! చూస్తుంటే, మిగతా దర్శకులు కూడా ఈ పంధాలోనే హిట్ల కోసం, సెన్సారువాళ్ళని, ప్రేక్షకులను పెద్ద బీప్ లుగా చేసే రోజులు వచ్చేసినట్లున్నాయి.

 

గమనిక : ఈ వ్యాసంలో “బీప్” బదులు “పిచ్చి పుల్లాయ్” అని చదువుకోవలసిందని మనవి.

Your views are valuable to us!