కష్టాలకి క్రుంగిపోవటం, సుఖాలకు ఆనందించటం మానవ సహజం. సంక్లిష్టమౌతున్న జీవన విధానంలో ఏదో సాధించాలన్న తపన, సాధించలేమోననే అసహాయత, సాధించినా సంతృప్తి లేకపోవటం, సాధించలేకపోతే ఆత్మన్యూనతా భావంతో క్రుంగిపోవటం ఇవన్నీ ప్రస్తుతం ప్రతిమనిషీ అనుభవిస్తున్న పరిస్థితులే. ఈ పరిస్థితులే పెరుగుతున్న ఆత్మహత్యలకు కారణభూతం అవుతున్నాయి.
డిప్రెషన్ ఒక జటిలమైన సమస్య. భారతదేశంలో 2020 నాటికి గుండె జబ్బుల తరువాతి స్థానానికి డిప్రెషన్ చేరుకుంటుందని ప్రామాణికుల అంచనా.
అసలు డిప్రెషన్ ఎందుకు వస్తుంది. దానిని గుర్తించటం ఎలా? తప్పించుకోవటం ఎలా ? అనే విషయాలు అందరూ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది.
ఎప్పుడు నిరాశ ఆవరించి ఉండటం. మనసు స్థిమితంగా ఆలోచించలేకపోవటం, తప్పు జరిగిపోతున్నట్లు అనుకోవటం, స్వంత నిర్ణయాలు తీసుకోలేకపోవటం, ఏకాగ్రతతో ఏ పనీ చేయలేకపోవటం, జ్ఞాపకశక్తి క్షీణించటం… ఇత్యాదులన్నీ డిప్రెషనుకు సంబంధించిన మానసిక భావనలు. వీటివల్ల అనేక శారీరక ఇబ్బందులు కూడా కలుగుతాయి.
తలనొప్పి, కళ్ళు తిరగటం, నిద్ర పట్టకపోవడం,తిండి మీద ధ్యాస తగ్గి అవసరానికన్న తక్కువ బరువు కలిగి ఉండటం, అవసరాన్ని మించి తిండి తినడం..ఈ శారీరకబాధలు డిప్రెషను వల్లే కలుగుతాయి. డిప్రెషను వల్ల అనవసరమైన ఆందోళన కలుగుతుంది. ఏమాత్రం వ్యతిరేకత వ్యక్తమైనా కోపం ప్రదర్శించటం, తనను తాను హింసించుకోవటం, వస్తువులు విసిరి వేయటంలాంటివి చేయటంతో ఆత్మీయులు కూడా దూరమయ్యే ప్రమాదం ఉంటుంది.
తనను గురించి తను సరైన అవగాహన లేకపోవటంతో, శక్తికి మించిన పనులు చేయాలనే తాపత్రయం కలుగుతుంది. అవి నెరవేరని సమయంలో నిరాశ నిస్పృహలకు లోనుకావటం జరుగుతుంది. అంతే కాకుండా, వృత్తిపరమైన పోటీ వలన, ఆశించిన స్థాయిలో జీవితంలో ఎదగకపోవటం వలన, ఇదివరలో జరిగిన కొన్ని చెడు సంఘటనల వలన డిప్రెషను కలుగుతుంది.
మరి డిప్రెషను తగ్గించుకోటానికి మార్గాలేమిటి?
అన్నిటికన్నా ముఖ్యంగా, మనసును ప్రశాంతంగా ఉంచుకోవాలి. చిరాకు పెట్టే విషయాల నుంచి ఆలోచనలు తప్పించాలి. నలుగురితో కలిసి తిరగటం, ప్రతిరోజు ఈత, నడక వంటి వ్యాయామాలు చేయటం, శ్వాసకు సంబంధించిన వ్యాయామాలు – ప్రాణాయామము, ధ్యానము వంటివి చేయటం, సమస్యలను ఆప్తులతో సంప్రదించి సరైన నిర్ణయాలు తీసుకోవటం. వృత్తిపరమైన పోటీల నుంచి కొన్నాళ్ళు దూరంగా ఉండటం ఇత్యాదులు డిప్రెషను తగ్గించుకోటానికి ఉపయోగపడతాయి. పరిస్థితులు చేయి దాటుతున్నట్లుగా అనిపిస్తే, తప్పనిసరిగా వైద్యులను సంప్రదించాలి. ఈ డిప్రెషను ఒక రకమైన మానసిక ఉన్మాదస్థితికి చేరుకునే ముందుగానే అవసరమైన జాగ్రత్తలు పాటించటం మంచిది.
@@@@@