చూడావత్ సింగ్ చిత్తోడ్ రాజ్యపు సైన్యంలో ఒక అధికారి. అప్పటికి కొన్నిరోజుల క్రితమే అతని వివాహం జరిగింది. భార్య పేరు మధురాణి.
ఇద్దరూ కలిసి ఉద్యానవనంలో విహరిస్తున్నారు. ఇంతలో చిత్తోడ్ మహారాణి నుండి రాజభటుడు ఒక లేఖను తీసుకొని వచ్చాడు. ‘మన మాతృదేశంపై శత్రువులు దండయాత్ర చేసారు. తక్షణమే రావలసింది’ అని ఆ ఉత్తరంలో ఉంది.
సంకటస్థితిలో పడ్డాడు చూడావత్ సింగ్. ఒకవైపు భార్యకు దూరంకాలేని పరిస్థితి. మరోవైపు మాతృదేశ పరిరక్షణ. కానీ, సెలవు మరో రెండు రోజుల వరకూ ఉంది. చివరికి సెలవు పిమ్మటే వెళ్ళాలని నిశ్చయించుకున్నాడు.
దేశం పరాధీనమయ్యే పరిస్థితిలో ఉన్నప్పుడు ఇక్కడ కూర్చొని సుఖభోగాలు అనుభవించటంలో అర్ధంలేదు. దేశమే సర్వనాశనమైనప్పుడు ఇక మిగిలేదెవరు? అంటూ మధురాణి భర్తను యుద్ధానికి సన్నద్ధం చేసింది.
యుద్ధానికి వెళ్లటమైతే వెళ్లాడు గానీ, మనసంతా భార్యపైనే. పరాక్రమంతో తెగించి పోరాడలేకున్నాడు. భార్యకు లేఖలు వ్రాసాడు. లేఖలు చదివిన మధురాణికి విషయం అవగతమైంది. తన మీద ప్రేమ వలన, తన భర్త పోరాడలేకపోతున్నాడని గ్రహించి, ఒక సేవకుని పిలిచి వెండి పళ్ళెం, ఒక ఖడ్గం తెమ్మని చెప్పింది.
‘నీ సేనాధిపతి వద్దకు పోయి, నేను నా బాధ్యత నిర్వర్తించానని చెప్పు. నీ అధికారి కూడా మాతృభూమి సంరక్షకుడుగా తన కర్తవ్యాన్ని నెరవేర్చాలని నా అంతిమ కోరికగా చెప్పు’ అంటూ… తన శిరస్సును ఖండించుకుంది. ఆ శిరస్సును ఆ సైనికుడు చూడావత్ కు అందజేసాడు. ఆమె ఆఖరి కోరికను తెలిపాడు.
ఆమె ఆత్మాహుతిలోని ఆంతర్యం గ్రహించి, ఒక చేతిలో ఆమె శిరస్సుని, మరో చేతిలో ఖడ్గాన్ని ధరించి యుద్ధంలో వీరవిహారం చేసాడు. శత్రువులని తరిమికొట్టి మాతృభూమిని కాపాడాడు.
Source: కల్నల్ టా( వ్రాసిన ‘రాజస్థాన్ చరిత్ర’లోని కథ ఇది.)