Like-o-Meter
[Total: 0 Average: 0]
1
పొద్దున్నే కిటికీ రెక్క అద్దాన్ని పొడిచి
రెక్కలేగరేసి ఆడుకుంటుంది చామన చాయలో,
వొక చలికాలపు గడ్డకట్టిన రాత్రి తరవాత, నీరెండ.
సర్లే, పోనీలే అనగలనా,
దాని నునుపైన దేహమ్మీద చెయ్యి వెయ్యకుండా.
దాని చేతిలో చెయ్యేసి,
తన గోర్వెచ్చనితనాన్ని నాలోకి వొంపుకోకుండా.
2
ఇప్పుడింక గుర్తొస్తుంది, చిన్నప్పటి నా చింతకాని.[i]
ఇంకా తెల్లా తెల్లారక ముందే
ముసురు తెరల్లో నీడల్లా దాక్కునే చెట్ల వేపు
దేహాన్నంతా చుట్టబెట్టుకొని వూరి బయటకి నడిచివెళ్తున్నఆ నేను.
3
ఏం వెతుక్కుంటావో, అలసిపోయేంత దాకా
ఆ వూరి చివర చెట్ల మంచు తెరల మధ్య!
పోనీ, ఇప్పుడయినా నీ లోపలి గుట్టు విప్పవా,
నీరెండ వేళ్ళు నిన్ను
తడిమి తడిమి తెరుస్తున్నప్పుడు!
[i] చింతకాని: కవి స్వస్థానం.