1.
బలమైన పాటను విసురు – బాణంలా తగిలేలా
కన్నెర్రచేసిచూడు – వెన్ను విరిగిపోయేలా!
2.
కూటికి సరిపోక – కూలుతున్న కూలోనికి
ఓటిబతుకు తప్పించగ – నోటి స్వరం హెచ్చించు!
3. గంజి బియ్యం రూకకొచ్చెను – పచ్చిపులుసుకు ఉల్లి దొరకదు
పాచిపనులెన్ని చేసినా – గోచిగుడ్డకు చాలదాయె!
4. రూపాయికి దిక్కులేక – బక్కచిక్కి పోతోంది
నూకలు కొనబోతే – మన చెంతకు రానంది1
5. ఉలుకు పలుకులేక – రాయివోలె కూసోకు
పిడికిలి పైకెత్తి – నిప్పులింక కురిపించు!
6. కొనబోతె కొండెక్కి – మబ్బుల్లో దాగుంటె
గురిచూసి కొట్టరా – దిమ్మ తిరిగిపడేలా
7. నెత్తినోరు బాదుకున్నా -యింతకూడ కదలవేర!
అడగందే అమ్మైనా – బువ్వ పెట్ట బోదుగా!
8. పెళ్ళి కరుసు పెట్టలేవు – ఆడపిల్లనంపలేవు
ఊపిరాగిన కట్టెను – సాగనంప దారిలేదు!
9. చేత ‘ కానీ ‘ లేకపాయె – చేతకాని వాడివైతివి
చేవలుడిగి కూసోబోకు – చేవయేదో సూపరార!
10. సామాన్యుని గోడు వినక – ఆసాముల సేవలోనే
అనునిత్యం దేవురించు – పాలన నిలువరింప
11. తిరుగుబాటు చేయందే – జరుగుబాటు లేదురా
చర్నకోల విందుతొనె – సర్కారుని వంచరా!
12. మూసినకన్నులు తెరిచి – మోస్తున్న బరువును దింపు
ఓటుతోనే కూట రాజ్యం – బీటలువారు పచ్చినిజం
13. కర్ణపు టాలదిరేలా – కరణీకం ముగిసేలా
కసిదీరా ఛీకొట్టు – కరవాలం చేపట్టు !