“నా చుట్టే పల్లె మొత్తం
వెల్లివిరిసిందని” ముచ్చటపడి
మూగసాక్షిగా
నీదైన ధ్యాన ముద్రలో
ఎండా, వాన, చలి,
నునువెచ్చని హాయికి
అతీతంగా, అలౌకికంగా
అలరారే ఓ బొడ్డురాయీ!
బడుద్దాయిలు ప్రవేశించారు
నీ స్వప్నసీమలో
బడబాగ్ని రగిలించారు.
నీకు ఈశాన్యంలో ఉండిన సంప్రదాయం
దారితప్పిపోయింది…ఆ గుడితో సైతం
ఆగ్నేయం వైపు ఉన్న సత్రం
ఇప్పుడు దేహవ్యాపార కేంద్రంగా మారిపోయింది
నైరుతి దిక్కున్న ఉన్న
బయలు భూమి కబ్జాచేయబడింది
వాయువ్యంలో ఉన్న దేవుడి భూమి
దయ్యాల పాలైపోయింది
ఉత్తరాన ఉన్న రామాలయం
ఒక్కటే నిలబడి నిట్టూరుస్తోంది.
స్వామివారి పుష్కరిణి ఎండిపోయింది
దక్షిణం వైపునున్న
స్మశాన భూమికి కూడా
చావొచ్చి పడిందేమో
ఈమధ్యే కుంచించుకొని పోయింది
నీకు కాస్త దూరంగా
తూర్పున ఉన్న పెద్దచెరువు, బడి
అలా పడమరన ఉన్న రైల్వే స్టేషన్, బందెల దొడ్డి
నీలానే మూగసాక్షులు మిగిలిపోయాయి
నీ సమాధిలో ఉండిపోయి
చూడలేదేమో
పల్లె మారిపోయింది బొడ్డురాయీ!
నీ చుట్టుపక్కలంతా వెర్రి నాగరికత
జుట్టు విరబోసుకొని తిరుగుతోంది.
నిన్ను గౌరవించడం కాదు కదా
నీ తలపై కాళ్ళు పెట్టడం నేర్చుకొన్న
వాళ్ళంతా
నీ గతాన్ని మర్చిపోయారు !!
పట్టణంలో బతుకీడుస్తున్నాను గదా
అందుకేనేమో
నువ్వప్పుడప్పుడూ గుర్తుకొస్తుంటావిలా.