బ్రతికేస్తూ ఉంటాను
మహా జాలీగా…
ఓల్డుమాంక్ సీసాలోనూ…
సానిదాని పరుపు మీద మరకల్లోనూ…
ఎప్పటికీ పూర్తికాని కవితల్లోనూ…
మత్తులో కారు డ్రైవు చేస్తుంటే
నలభైరెండేళ్ళ నెరుస్తున్న జుత్తు
మోహపుగాలిలో క్రూరంగా ఎగురుతుంటుంది.
నా పక్క సీటు ఇప్పటికీ ఖాళీనే
నన్నెవరూ ప్రేమించలేదు
నేనెవరినీ ప్రేమించలేను
అసలు ఎవరు ఎవరినైనా ప్రేమించగలరా?
కనీసం ప్రేమంటే ఏమిటో తెలుసుకోగలరా?
రోడ్డు మలుపుల్లో నివురుగప్పిన యాక్సిడెంట్లు
కుళ్ళిపోయిన కన్నీళ్ళలో తడిసి
కుప్పలుగా పడి ఉంటాయి
రైలుపట్టాలకీ, చక్రాలకీ మధ్య
మృత్యువు మీసం మెలేస్తూ ఉంటుంది.
మృత్యువు పెద్ద రంకులాడి.
రోజూ లక్షలమందితో రమిస్తుంది.
రైల్లో కూర్చొని
డివైన్ ట్రాజెడీలోని మెటాఫిజికల్ ఎమ్టీనెస్ ని విశ్లేషించుకుంటున్న
నా పెదవులపై ఒకానొక నిర్లక్ష్యపు చిరునవ్వు
నాగరిక ఉన్మాదానికి చిహ్నంగా…
రైల్లో అందరికీ నత్తే.
అందరూ నకిలీ తొడుగుల బోలురూపాలే
ఎవడి చావు కబురు ఉత్తరం వాడే
స్టాంపుల్లేకుండా అందుకున్నవాడే
బ్రతుకులు ముక్కిపోయి, కంపుకొట్టే చోట
శృంగారం కూడా కాలకృత్యమే
ఇలాంటి కాలంలో
కవిత్వం గురించి మాట్లాడ్డానికి
క్షమించాలి… నాకు గుండెలు చాలడంలేదు.
అయినా పదాలెందుకో ఆగటంలేదు.
సగం చచ్చిన వానపాముకు
కుబుసం విడిచిన కాలనాగుకు
తేడా ఉండొద్దూ??
మీకు చెప్పనే లేదు కదూ…
నాటకాలన్నీ తెరవెనుకే సాగుతాయి.
తెర ముందు అబద్ధాన్ని చప్పరిస్తున్న
గుడ్డి ప్రేక్షకులు…
ఈ దేశంలో బ్రతుకు.. చావు ముందు శ్రోత.
uncertainity లోని అందం చూడ్డానికి
బ్యాంకు లాకర్లో మూలుగుతున్న రంగుకాగితాలు తల్చుకుని
మురిసిపోయేవాళ్ళ కళ్ళు చాలవు.
అందుకే వాడిన కాగితం పువ్వులను
గాజుకుప్పెల్లో అమర్చుకోవడం వినా
అందం అంటే ఏంటో తెలియని శవాల మధ్య
నిర్లక్ష్యాన్ని నిర్మోహంతో హెచ్చవేసి
నిషాని కూడి, విషాదాన్ని తీసేసి…
మహాదర్జాగా
ప్రపంచాన్ని దబాయించి మరీ
బ్రతికేస్తుంటాను…