ఎదురింటి బాల్కెని

Spread the love
Like-o-Meter
[Total: 0 Average: 0]

ఎప్పుడైనా ఓసారి
ఆ గోడల మీద
కాకులొచ్చి వాలేవి.

ఆవిడొచ్చి
రంగురంగు పావురాళ్ళను
మొక్కలకు పూయించింది.

చిట్టి చేతుల్తో తీగ పాదుల్ని
తట్టి లేపింది.

అంతా గుప్పెడు మట్టే.

పువ్వుగా ఎదిగే
విత్తనాన్ని
సుతిమెత్తగా
తడిమి చూసింది.

అభిమానం ఎరువుగా
చల్లుకుంటూ
వెళ్ళేదా..?

తిరిగొచ్చేసరికి,
తీగెలు పరిమళాణ్ణి
ప్రతిధ్వనించేవి.

ఎండిన ఆకు,
ఆమె కంట్లో
నీటి చుక్కా
ఒకేసారి రాలి పడేవి.

ఆ కాస్త చోటే
అరోరా బొరియాలిస్
రెక్కలార్చుకునే
ఆకాశమైంది.

ఏమైందో ఏమో..?

మొన్నొచ్చిన
గాలి విసురుకు-
కూలిన మొక్కల సాక్ష్యంగా

తను కనిపించనే లేదు.
ఎప్పటికీ.

Your views are valuable to us!