ఈ వాక్యం చచ్చిపోదు

Spread the love
Like-o-Meter
[Total: 0 Average: 0]

 

 

‘కలమెత్తితే ఒక దేశపు జెండాకు ఉన్నంత పొగరు నాకు ఉంది’ అని గుంటూరు శేషేంద్రశర్మ గారు అన్నట్లు, అంత పొగరు కనిపిస్తుంది నాయుడు గారి మొదటి సంకలనం ‘ఒకవెళ్ళిపోతాను’ లో! ‘కన్నీళ్ళని కాళ్ళకింద వెల్తురుగా పరుచుకొని / ప్రయాణించటం’, ‘ఈ వాక్యం చనిపోతుంది / అక్షరాల్లేని కన్నీళ్ళతో మిగిలిపోవాలి’ లాంటి అద్భుతమైన వ్యక్తీకరణలు ఉన్నా, ‘గడ్డాలు లేని దు:ఖాలు, బట్ట తలల కన్నీళ్ళు, గడియారాల వీపుల్లో పొగాకు వాసనలు’ వంటి వ్యక్తీకరణలతోపాటు, కొంత అరాచకత్వం, చాలా అమూర్తత్వం ధ్వనిస్తుంది. అప్పుడెప్పుడో, అడపాదడపా, ఎక్కడెక్కడో ఆ కవితలు చదివినప్పుడు నేనో సగటు పాఠకుడిని. మొన్నటికి మొన్న ‘ఒక వెళ్ళిపోతాను’ పుస్తకాన్ని నాయుడు గారు అందించేదాకా, ఆ కవితలు వ్రాసింది నాయుడు గారే అని నాకు గుర్తు కూడా లేదు. ఈ మాటలు చెబుతున్నది నాయుడిగారినో, ‘ఒక వెళ్ళిపోతాను’నో చిన్నబుచ్చటానికి కాదు. నావరకూ గాలి అద్దానికి ఇది నేపథ్యం.

 

జీవితాన్ని అనుభవించటం ఒక ఎత్తు, ఆస్వాదించటం మరో ఎత్తు. ఆ జీవితంలోని సంక్లిష్టతలు అర్ధం చేసుకునే ప్రయత్నం చేయటం మరో ఎత్తు. ‘ఒక వెళ్ళిపోతాను’లో ఇక్కడ దాకా వచ్చిన కవి,  ఆత్మావలోకనం చేసుకోవటంతో ఆ పై మెట్టు కూడా ఎక్కారు!  ఆ సంక్లిష్టతకు అక్షర రూపం ఇవ్వటం అందరికీ సాధ్యం కాదు. అంతరాంతరాలలో చైతన్యవంతుడైన కవి మాత్రమే మన జీవితాల్లోని నిర్లిప్తతను, నిర్వికారత్వాన్ని, స్తబ్దతను చైతన్యవంతంగా చూపగలుగుతాడు.  సరిగ్గా ఇలాంటి కవిత్వమే ‘గాలి అద్దం’.

 

‘గాలి అద్దం’ చదువుతుంటే, ‘ఒక వెళ్ళిపోతాను’ లో పాఠకుల ఆలోచనలని అస్తవ్యస్తం చేసిన నాయుడుగారు చిద్విలాసంగా నవ్వుతూ కనిపిస్తారు! ‘ఒక వెళ్ళిపోతాను’ని డీకోడ్ చేస్తే అది ‘గాలి అద్దం’ అవుతుందేమో అని అనిపిస్తుంది.  ‘అద్దం కిటికీ’ కవితతో మొదలైన పుస్తకం ‘గాలి అద్దం’ కవితతో సుడిగాలిలా పాఠకుడిని చుట్టుముట్టేస్తుంది. అందరూ అద్దాల్లోను, కిటికీల్లోనూ తొంగి చూసేవారే, మరి అద్దం, కిటికీ తొంగి చూడాలనుకుంటే… అనే ప్రశ్నతో పాఠకుడి ప్రయాణాన్ని మొదలు పెట్టించి నీడలా చివరి వరకూ నడిపిస్తాడు కవి.

 

అద్దంలో చూస్తున్న మన ఆలోచనలు అపభ్రంశం అవ్వచ్చేమో కానీ, అద్దం అబద్ధం చెప్పదు. అలా అపభ్రంశమయ్యే ఆలోచనలు, అద్దం చెబుతున్న నిజాల మధ్య ఊయలలూగిస్తాడు కవి. స్పందించటానికి ఎప్పుడూ తర్కం వెతుక్కుంటుంది బుద్ధి. ఏ తర్కమూ లేకుండానే స్పందిస్తుంది మనస్సు. రెంటినీ సమన్వయం చేస్తూ చాలా కవితల్లో అలా అద్దమై కనిపిస్తాడు కవి.

 

మచ్చుకు ఓ రెండు కవితలు :

 

మనసు

 

నీ ప్రార్ధనకై

పూరేకులన్నీ చేతులు జోడించాయి

అప్రయత్నంగానే,

నీ స్నేహానికై

చినుకులన్నీ రెక్కలు విప్పాయి

అప్రయత్నంగానే

ప్రతిచోటా నీ శ్వాస

అడుగుజాడలే

ఈదులాడే కాలం

సూర్య చంద్రులని చేరటం లేదు

ప్రేమించే కొమ్మలకే

నీడలు తెలుసు.

 

***

 

నేత్ర సమాధి

 

“వెను తిరిగిపోయే

ఆకాశపు నీడలే

ఈ చిల్లులు పడ్డ అక్షరాలు

 

దారితప్పిన

మాటల నీళ్ళే

ఈ ఆవిరవ్వని శబ్ద వివర్ణాలు

 

ఎట్నుంచైనా

ప్రయాణించే మౌనప్పొరల్లోని

గాలిని కాస్తంత వొదులు చేస్తే

 

ఈ ఆకృతిలోకి రాని

వాక్యాన్ని చూడ్డానికి వెళ్దాం”

 

అని రాసుంది వస్తూపోతూ ఉండే

నిద్ర కనుపాపపైన

ఆ కన్ను నీదేనా

 

గాలి అద్దంలోనూ కొన్ని అమూర్తాలు ఉన్నాయి. అసాంఘికాలున్నాయి. కొంత విశృంఖలత్వమూ ఉంది. అయినా, పాఠకుడు ఎక్కడా కవితో డిస్‌కనెక్టు కాడు. ప్రతి కవితలోనూ తానే ఒక అద్దమై, నిజాన్ని నిర్భయంగా చూడలేని వ్యక్తిత్వాల ముసుగులు తీసి గాలిలా నిశ్శబ్దంగా స్పృశిస్తాడు ఈ కవి. అస్తిత్వ రోదనలు, సామాజిక వేదనలు, సమస్యాత్మక స్పందనలు, రాజకీయ దరువులు లేకుండా,  మూర్తమైనా, అమూర్తమైనా, ఆనందం సిద్ధింపజేయటమే కవిత్వ ప్రయోజనమైతే, ప్రకృతిలో మనలని, మనలోని మన:ప్రకృతిని దర్శింపజేస్తుంది. మనలని మనం సమీక్షించుకునేట్లు చేస్తుంది. ఈ కవిత్వంలో ఆ పొగరు లేదు, ఎటువంటి వగరు లేదు. ఉద్రేకంతో ఉత్తేజింప చేయదు, ఉన్మత్తంగా ఆవేశం కలిగించదు. ఆలోచనలేవీ లేని ఓ అంత:స్థితిలో, ఓ ఆకాశంలో, ఓ అద్దంలా మనలని, మనలోని మరొకరిని మనముందే చూపిస్తుంది.

 

‘ఒక వెళ్ళిపోతాను’ సంకలనంలో ఓ చోట నాయుడు గారు అన్నట్లు, ఈ వాక్యాలు మళ్ళీ మళ్ళీ పుడతాయో లేదో తెలీదు కానీ, ఈ వాక్యాలు మాత్రం చచ్చిపోవు. తెలుగు కవిత్వ చరిత్రలో నిలిచిపోయే కవిత్వం ‘గాలి అద్దం’.

Your views are valuable to us!