Like-o-Meter
[Total: 0 Average: 0]
ఎప్పటినుంచో నాకు తెలుసు
ఇప్పటి ఈ రోజులు ఎక్కడో పొంచిఉన్నాయని
ఎప్పటినుంచో తెలుసు మరి !
బాల్యం ఇసుక తిన్నెలమీద
భవిష్యత్తు ఓనమాలు రాసుకునేప్పుడే తెలుసు
బలపం పట్టుకున్నసుకుమారపు వేలికొసల్లో
ఎన్ని ఉపద్రవాల సూది మొనలు గుచ్చుకుంటాయో
అపుడో ఇపుడో ఆత్మీయత తలుపు తట్టిపిలిచే
సస్నేహపు పరిమళాలు
సుళ్ళుతిరిగే వేదన వెన్ను నిమిరి
ఓదార్పు చేయూత నందిస్తూ
నాకు తెలుసు ఎప్పటి అనుబంధాలో
ఈ నును వెచ్చని పలకరింపులని
ఎక్కడినుంచో మోసుకు వస్తున్న
ఈ అజ్ఞాత భారం హఠాత్తుగా అదృశ్యమై
ఉనికి ఊహ రెక్కల చివరన వాలి ఎక్కడికో వలసపోయే
ఇప్పటి ఈ రోజుల పుట్టుకు నాకే తెలియని ఎప్పటిదోనని
ఎప్పటినుంచో నాకు తెలుసు
మసక మసక జ్ఞాపకాల తెలి మబ్బుతెరల్లో
లీలగా కదిలే గతం ఎప్పటి వాసనలోనని ఎప్పటినుంచో తెలుసు..