అప్పుడప్పుడూ గ్రూప్ ఫోటో ముందు నిల్చున్నపుడు
కాలేజిదినాలొచ్చి చూపుల్తో కరచాలనం చేస్తాయి.
స్మృతుల బంధువులు వేలాడే మెదడు కొమ్మనై
స్నేహకెరటాల్ని మోసే నేత్ర సాగరాన్నై
మధుర ప్రకంపనల్ని వెలార్చే హృదయవీణా తంత్రినై
శబ్దాలతో కట్టిన నిశ్శబ్ద శిఖరాన్నై
గ్రూప్ ఫోటో ముందు నిల్చున్నపుడు –
ప్రతి ముఖం తన స్వంతగొంతుకతో
నా చెవిలోయలోకి దిగి స్పష్టంగా ప్రతిధ్వనిస్తుంది.
ప్రతిగొంతుకా తనదైన నడకతో
నా అంతర్నేత్ర బాటపై ధూళిరేపుతూ సాగుతుంది.
ప్రతినడకా స్మృతుల సద్దన్నపు భారంతో
వరుసదీరి నా హృదయసీమకు వలస వస్తుంటుంది.
గ్రూప్ ఫోటో ముందు హిమబిందువునై ఘనీభవించినపుడే
నేను గతాన్నై నిజంగా వ్యాప్తిచెందటం తెలిసికొంటాను.
తరగతిగదిలో మాస్టారి కన్నుల్లో తడబాటు వెల్లువనై
గదిబైట అమ్మాయి చెంపదెబ్బతిని గాల్లోకి లేచిన అల్లరినై
టీ కప్పు సమస్యల్లో రేగిన సమ్మెల తుఫానునై
వ్యధాకలిత స్నేహ వియోగ హృదయకల్లోల సాగరాన్నై
గ్రూప్ ఫోటో అలల జట్టులో మమేకమైనపుడు –
భావచిత్రాలు చెక్కిన స్మృతుల బిందువులు
చెక్కిళ్ల మైదానాల్లోకి జుట్టు విరబోసుకెళ్తుంటాయి
క్షణాలు సెలయేళ్లయి శరీర శిలలో చలనం తేలేక
భూతమానలోయల్లోకి ఆత్మహత్యకై దూకుతుంటాయి.
నేనింకా నేనుగా పునరావృతం కాలేక –
ఏదోలోకపు మేఘాల పయ్యెదలో చిక్కిన గిరిశిఖరాన్నై
చినుకుపూల రుమాళ్లేసుకొన్న చందన తరువునై
సుగంధ తెమ్మెరలు ఘనీభవించిన తుమ్మెదరెక్కనై
మర్రినీడకు ప్రాణాలంకితమిచ్చిన వేసవి ఒంటరి బాటసారినై –
ఇంకా గ్రూప్ ఫోటో ముంగిట్లోనే –
*****