Like-o-Meter
[Total: 0 Average: 0]
ఒక స్పర్శతో
సందేహాలు నివృత్తమవుతాయో
మరిన్ని జాగృతమవుతాయో
ఇష్టానికి దూరంగా
అడుగులేసినప్పుడే తెలుస్తుంది
మొరాయించిన మనసు బరువు
ఎన్నివేల టన్నులో
ఆలోచన రెండు రకాలవుతుంది
చంద్రుడొచ్చినప్పుడొకలా
సూర్యుడిని చూసాక మరోలా
ఎంత సందేహాత్మకం ఈ జీవితం
సరిబేసి సంఖ్యల్లో ఓటెవరికంటూ
వున్నట్టుండి…వరసగా
అద్ధం ప్రకటించడం పోగొట్టుకుంటుంది
ఏకాంతపు జాడల్లో కూడా
నన్ను ఎరగనట్టు
తేల్చుకోవడానికో సాయం కావాలని
తెలుస్తూనే వుంది
మెదడు ముందుకు రానంతవరకూ
వ్యక్తిత్వాన్ని ప్రశ్నించనంతవరకూ
పూర్తిగా బుద్ధి కోల్పోయినా సౌఖ్యమే
ఇరుతీరాల నడుమ కొట్టుమిట్టాడటం
మనసుకెంత కిరాతకం
మేఘమాల దాకా సాగి
రాగబిందువుల్ని లెక్కిస్తున్న పతంగం,
వెన్నెల పోకడ…రుతువుల వైనం
పసినవ్వులోని వైవిధ్యం..
రోజూవారీ క్షణాల్లో వైరుధ్యం
ఇన్నిటిలో
స్థిమిత పరిచే సమాధానమేది!?